
ముంబయి: మహారాష్ట్ర రాజకీయాల్లో మరో ట్విస్ట్ ముందుకు వచ్చింది. కొన్నాళ్ల క్రితం సీనియర్ పవార్‌పై జూనియర్ అజిత్ పవార్ తిరుగుబాటు చేసి ఏక్‌నాథ్ షిండే, దేవేంద్ర ఫడ్నవీస్ ప్రభుత్వంలో చేరిన సంగతి తెలిసిందే. ఈ ప్రభుత్వంలో డిప్యూటీ సీఎంగా అజిత్ పవార్‌లు బాధ్యతల్లో ఉన్నారు. ఎన్సీపీలో తిరుగుబాటు ఆ పార్టీ చీలికకు దారి తీస్తుందనే భయాలూ ఉన్నాయి. ఈ తిరుగుబాటు జరిగిన శరద్ పవార్, అజిత్ పవార్‌లు వేదిక పంచుకోవడం, కామన్ రిలేటివ్ ఇంటిలో కలుసుకోవడం వంటివి జరిగాయి. కానీ, వాటిని రాజకీయ కోణంలో చూడలేదు. ఆ విషయాలు బహిరంగంగానే జరిగాయి. ఇందుకు భిన్నంగా వారిద్దరూ రహస్యంగా కొన్ని గంటలపాటు మంతనాలు జరిపినట్టు ఓ వార్త గుప్పుమంది. దీంతో ఎన్సీపీ బయటికి చెబుతున్న వైఖరి సరైనదేనా? అనే అనుమానాలు వస్తున్నాయి.
అయితే, ఇది సీక్రెట్ మీటింగ్ కాదని ఆ పార్టీ మహారాష్ట్ర అధ్యక్షుడు జయంత్ పాటిల్ స్పష్టత ఇచ్చే ప్రయత్నం చేశారు. అయితే.. వారు ఏం మాట్లాడుకున్నారో తనకు తెలియదని వివరించారు.
పూణెలోని ఓ వ్యాపారవేత్త ఇంటిలో శనివారం జూనియర్, సీనియర్ పవార్‌లు భేటీ అయినట్టు తెలిసింది. కోరేగావ్ పార్క్‌లోని ఇంటిలో మధ్యాహ్నం ఒంటిగంట ప్రాంతంలో శరద్ పవార్ వెళ్లినట్టు సమాచారం. ఐదు గంటల సమయంలో ఆయన బయటికి వెళ్లిపోయారని వార్తలు వచ్చాయి. ఓ గంట తర్వాత అజిత్ పవార్ కూడా అక్కడి నుంచే బయటకు వచ్చారని తెలిసింది. వీరిద్దరూ మీడియా కంట పడకుండా వెళ్లిపోయారు. ఈ నేపథ్యంలోనే వీరి మధ్య రహస్య భేటీ జరిగిందనే వార్తలు చర్చనీయాంశమయ్యాయి.
Also Read: లిఫ్ట్ ఇస్తామని మహిళపై గ్యాంగ్ రేప్.. తలకు తుపాకీ గురిపెట్టి బెదిరింపు
దీనిపై పార్టీ నేత జయంత్ పాటిల్ మాట్లాడారు. ఇది రహస్య భేటీ కాదని, శరద్ పవార్ వెంట తాను కూడా వెళ్లానని వివరించారు. అయితే, కొద్దిసేపటికే బయటకు వచ్చానని, వారు ఏం మాట్లాడుకున్నారో తనకు తెలియదని తెలిపారు. ఇరు వర్గాల నేతలు శరద్ పవారే తమ నేత అని నమ్ముతున్నారని వివరించారు. రాష్ట్ర డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ స్పందిస్తూ దీనిపై తనకు సమాచారం లేదని అన్నారు.