కడుపులో ఐదేళ్ల నుంచి కత్తెర.. డెలివరీ చేసిన వైద్యుల నిర్లక్ష్యం.. మళ్లీ అదే హాస్పిటల్‌కు బాధితురాలు

By Mahesh KFirst Published Oct 10, 2022, 1:03 PM IST
Highlights

కేరళకు చెందిన ఓ మహిళ ఐదేళ్లుగా కడుపులో కత్తెరతో బాధపడుతున్నది. తీవ్ర నొప్పితో అనేక హాస్పిటళ్లు తిరిగింది. సీటీ స్కాన్ చేయడంతో ఆమె ఆమె కడుపులో కత్తెర ఉన్నట్టు తేలింది. డెలివరీ సర్జరీ చేస్తుండగా కత్తెరను వైద్యులు లోపలే ఉంచేశారు.
 

తిరువనంతపురం: డెలివరీ కోసం ఆపరేషన్ చేసిన తర్వాత వైద్యులు ఆమె కడుపులో కత్తెర వదిలి మరిచిపోయారు. ఐదేళ్ల పాటు ఆ కత్తెర కడుపులోని ఉండిపోయింది. అప్పటి నుంచి ఆమె కడుపు నొప్పితో బాధపడుతూనే ఉన్నది. ఎన్నో హాస్పిటళ్లు తిరిగింది.ఇంకెన్నో చోట్లకు వెళ్లి పరిష్కారం కోసం ప్రయత్నించింది. ఆ కడుపు నొప్పి మాత్రం తగ్గలేదు. చివరకు ఓ హాస్పిటల్‌లో ఆమె కడుపును సిటీ స్కాన్ చేశారు. ఈ స్కాన్ రిపోర్టులో సంచలన విషయం వెలుగులోకి వచ్చింది. ఆమె కడుపులో ఓ మెటల్ వస్తువు ఉన్నట్టు వెల్లడించారు. అది కత్తెర అని తెలిపారు.

ఇదంతా 2017లో మొదలైంది. హర్షీనా ఆష్రఫ్ అనే మహిళ తన మూడో సంతానం కోసం కోజికోడ్‌ మెడికల్ కాలేజీకి 2017 నవంబర్ 30న వెళ్లింది. అక్కడే ఆమెకు సర్జరీ చేశారు. సర్జరీ తర్వాత కూడా ఆమెకు తీవ్రమైన నొప్పి కలిగింది. అక్కడి నుంచి డిశ్చార్జీ అయింది. కానీ, నొప్పి మాత్రం తగ్గలేదు. తగ్గకపోవడమే కాదు.. నొప్పి పెరిగింది. దీంతో ప్రైవేటు హాస్పిటళ్లు తిరిగింది. కానీ, నొప్పి మాత్రం తగ్గలేదు. మళ్లీ భరించలేని నొప్పి రావడంతో ఓ హాస్పిటల్ తీసుకెళ్లారు. అక్కడ సిటీ స్కాన్ తీశారు. ఆ స్కాన్ ద్వారా ఆమె కడుపులో ఓ మెటల్ ఆబ్జెక్ట్ ఉన్నట్టు గుర్తించారు. ఆ తర్వాత అది కత్తెర అని తనకు తెలిపినట్టు హర్షీనా తెలిపింది.

దీంతో ఆమె తనకు సర్జరీ చేసిన హాస్పిటల్‌కే మళ్లీ వెళ్లింది. అక్కడే ఆమెకు సర్జరీ చేసి కత్తెర తొలగించారు. 

ఆ తర్వాత ఆమె రాష్ట్ర సీఎం పినరయి విజయన్, ఆరోగ్య మంత్రి వీణా జార్జ్‌కు ఫిర్యాదు చేశారు. వైద్యుల నిర్లక్ష్యం కారణంగా ఆమె ఐదేళ్లుగా అనుభవించిన బాధను వెల్లబుచ్చింది. ఈ ఘటనను దర్యాప్తు చేయాలని, నివేదిక సమర్పించాలని ఆరోగ్య శాఖ అదనపు ప్రధాన కార్యదర్శికి కేరళ ఆరోగ్య మంత్రి వీణా జార్జ్ ఆదేశించారు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని ఆమె హామీ ఇచ్చారు.

click me!