
న్యూఢిల్లీ: తమిళనాడు ప్రభుత్వానికి జల్లికట్టు విషయంలో భారీ ఊరట లభించింది. దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీం కోర్టు జల్లికట్టు విషయంలో సానుకూల తీర్పును వెలువరించింది. తమిళనాడులో ఎద్దులను మచ్చిక చేసుకునే క్రీడ 'జల్లికట్టు'ను అనుమతించే చట్టం చెల్లుబాటును సుప్రీంకోర్టు సమర్థించింది. ఈ మేరకు జస్టిస్ కేఎం జోసెఫ్ నేతృత్వంలోని ఐదుగురు న్యాయమూర్తుల రాజ్యాంగ ధర్మాసనం ఏకగ్రీవ తీర్పును వెలువరించింది. ఎద్దుల బండి పందేలను అనుమతించే మహారాష్ట్ర ప్రభుత్వ చట్టం చెల్లుబాటును కూడా సుప్రీం ధర్మాసనం సమర్థించింది.
ఎద్దులను మచ్చిక చేసుకునే క్రీడ జల్లికట్టు, ఎద్దుల బండ్ల పందేలను అనుమతించే రాష్ట్రాల చట్టాల చెల్లుబాటును సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్లను సుప్రీంకోర్టు ధర్మాసనం కొట్టివేసింది. తమిళనాడు సాంస్కృతిక వారసత్వంలో ‘‘జల్లికట్టు’’ ఒక భాగమని ధర్మాసనం పేర్కొంది. జంతు హింస చట్టం జల్లికట్టుకు వర్తించదని తెలిపింది. ఇక, జస్టిస్ కేఎం జోసెఫ్ నేతృత్వంలోని ధర్మాసనంలో జస్టిస్ అజయ్ రస్తోగి, జస్టిస్ అనిరుద్ధ బోస్, జస్టిస్ హృషికేష్ రాయ్, జస్టిస్ సీటీ రవికుమార్‌లు ఉన్నారు.
ఇక, ప్రతి ఏడాది సంక్రాంతి సందర్భంగా తమిళనాడులో జల్లికట్టు క్రీడను నిర్వహిస్తారనే సంగతి తెలిసిందే. జల్లికట్టును ఎరుతఝువుతాల్ అని కూడా పిలుస్తారు. దీనిని ఎద్దులను మచ్చిక చేసుకునే క్రీడగా దీనిని చెబుతారు. ఇక, జల్లికట్టుకు అనుకూలంగా తమిళనాడు ప్రభుత్వం 2017లో చట్టం చేసిన సంగతి తెలిసిందే.