
చెన్నై : శశికళ వదిన ఇలవరసి కుమారుడు వివేక్. ఇతడి భార్య కీర్తన గురువారం ఆత్మహత్యాయత్నం చేశారు. వివరాలు... దివంగత సీఎం జయలలిత నెచ్చెలి శశికళ గురించి తెలిసిందే. శశికళతో పాటు జైలు జీవితాన్ని ఆమె వదినమ్మ ఇలవరసి కూడా అనుభవించారు. శశికళ అన్న జయరామన్ సతీమణే ఈ ఇళవరసి. ఆమె కుమారుడు వివేక్. శశికళకు సంబంధించిన ఆస్తుల వ్యవహారాలన్నీ ఇతడి కనుసన్నల్లోనే సాగుతాయనే ప్రచారం ఉంది.
దీంతో వివేక్ ను ఈడీ, ఐటీ వర్గాలు టార్గెట్ చేశాయి. ఈ నేపథ్యంలో వివేక్ తన సతీమణి కీర్తనతో గత కొంత కాలంగా తరచూ గొడవ పడుతున్నట్లు సమాచారం. వివేక్ వేధింపుల గురించి పలుమార్లు శశికళ, ఇలవరసి దృష్టికి కీర్తన తీసుకువెళ్లినట్లు తెలిసింది. అయితే, వివేక్ ను ఎవ్వరూ ప్రశ్నించకపోవడంతో మనస్తాపానికి గురైన ఆమె బుధవారం రాత్రి ఇంట్లో ఉణ్న పలురకాల మాత్రలను మింగేశారు. అపస్మారక స్థితిలో పడి ఉన్న ఆమెను అర్థరాత్రి వేళ అడయార్ లోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు.
ఆమెకు అత్యవసరం చికిత్స అందిస్తున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసిదర్యాప్తు చేశారు. వివేక్, కీర్తన మధ్య బుధవారం రాత్రి కూడా గొడవ జరిగినట్లు విచారణలో వెలుగు చూసింది. దీంతో తీవ్ర వేదనకు గురైన కీర్తన ఆత్మహత్యాయత్నం చేసినట్లు తెలిసింది.
జయలలిత మృతిపై విచారణ జరపాల్సిందే.. శశికళపై బాంబు పేల్చిన ఆరుముగసామి కమిషన్ రిపోర్ట్
ఇదిలా ఉండగా, తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలిత మృతిపై జస్టిస్ ఆరుమగస్వామి కమిషన్ సంచలన విషయాలు వెల్లడించింది. తమిళనాడులోని స్టాలిన్ ప్రభుత్వం.. స్టిస్ ఆరుమగస్వామి కమిషన్ రిపోర్ట్ ను అక్టోబర్ 16న రాష్ట్ర శాసనసభలో ప్రవేశపెట్టింది. జయలలిత ఆస్పత్రిలో చేరడానికి దారి తీసిన పరిస్తితులు, పరిణామాలపై స్టిస్ ఆరుమగస్వామి కమిషన్ రిపోర్ట్ తయారు చేసి ప్రభుత్వానికి సమర్పించిన సంగతి తెలిసిందే. ఈ నివేదికలో షాకింగ్ విషయాలు వెలుగుచూశాయి.
దివంగత జయలలితకు జరిగిన చికిత్స విషయంలో నిజానిజాలు తెలియాలంటే విచారణ తప్పనిసరి అని కమిషన్ తెలిపింది. జయలలిత సహాయకురాలు శశికళ, మాజీ ఆరోగ్యశాఖ మంత్రి సి విజయభాస్కర్, ఆరోగ్యశాఖ మాజీ కార్యదర్శి డాక్టర్ జె రాధాకృష్ణన్, డాక్టర్ సి శివకుమార్‌లపై విచారణకు సిఫార్సు చేసింది. కాగా, జయలలిత 2016 డిసెంబర్ 4వ తేదీ మధ్యాహ్నం 3 నుంచి 3.30 గంటల మధ్య మరణించారని సాక్షులు చెప్పినట్టుగా ఆరుముగస్వామి కమిషన్ రిపోర్టులో పేర్కొంది.
అయితే, అపోలో ఆసుపత్రి మాత్రం జయలలిత డిసెంబర్ 5వ తేదీ రాత్రి 11.30 గంటలకు మరణించినట్లు ప్రకటించింది. అయితే, నిజానికి జయలలిత డిసెంబరు 4న మరణించారని.. కానీ, డిసెంబర్ 5న ఆమె మృతి చెందినట్లు ఆస్పత్రి వర్గాలు తెలిపాయని నివేదిక పేర్కొంది. దీంతో జయలలిత మరణాన్ని ప్రకటించడంలో ఉద్దేశపూర్వకంగానే జాప్యం జరిగిందా అనే ప్రశ్నలు తలెత్తాయి. జయలలిత ఆసుపత్రిలో ఉన్నప్పుడు శశికళ బంధువులు అక్కడి గదులను ఆక్రమించారని కూడా నివేదిక పేర్కొంది. ఇక, 2012లో జయలలిత, శశికళ మళ్లీ కలిసిన తర్వాత వారి మధ్య సంబంధాలు సజావుగా లేవని నివేదిక పేర్కొంది.