అవి సర్పంచ్ ఎన్నికలే.. హామీలు చూస్తే బిత్తరపోతారు.. 3 ఎయిర్‌పోర్టులు, మెట్రో, ఫ్రీ వైఫై, రోజు ఒక లిక్కర్ బాటి

By Mahesh KFirst Published Oct 11, 2022, 3:45 PM IST
Highlights

హర్యానాలోని ఓ గ్రామ సర్పంచ్ ఎన్నికలో బరిలోకి దిగిన అభ్యర్థి హామీలు వింటే నోరెళ్లబెడతారు. తాను గ్రామ సర్పంచ్‌గా గెలిస్తే.. మూడు ఎయిర్‌పోర్టులు, మెట్రో లైన్ ఏర్పాటు చేస్తానని, సమీప పట్టణానికి ప్రతి ఐదు నిమిషాలకు ఒక హెలికాప్టర్ అందుబాటులో ఉంచుతానని వివరించారు. ఆడవాళ్లకు మేకప్ కిట్.. మందుబాబులకు ప్రతి రోజు ఒక బాటిల్ లిక్కర్ ఇస్తానని హామీ ఇచ్చారు. యువతకు ప్రభుత్వ ఉద్యోగం కల్పిస్తానని పేర్కొన్నారు. ఆయన మేనిఫెస్టో ఇప్పుడు సోషల్ మీడియాలో దుమారం రేపుతున్నది.
 

చండీగడ్: ఏ ఎన్నికల్లోనైనా రాజకీయ పార్టీలు, బరిలోకి దిగిన అభ్యర్థులు హామీలు గుప్పిస్తుంటారు. ఓటర్లను తమ వైపు తిప్పుకోవడానికి పెద్ద పెద్ద హామీలను గుమ్మరిస్తుంటారు. ఇలాంటి హామీలు అన్నింటినీ తలదన్నేలా హర్యానాలోని ఓ సర్పంచ్ అభ్యర్థి వాగ్దానాలు చేశాడు.

హర్యానాలోని సిర్సద్ గ్రామంలో పంచాయతీ ఎన్నికలు జరుగుతున్నాయి. అందులో ఎన్నికల బరిలోకి దిగిన ఓ అభ్యర్థి హామీల మేనిఫెస్టో చూస్తే కళ్లు బైర్లు కమ్ముతాయి. ఐపీఎస్ అధికారి అరుణ్ బోత్రా ఈ ఎన్నికల మేనిఫెస్టోను ట్విట్టర్‌లో షేర్ చేశారు. నేను ఈ ఊరికి షిప్ట్ అవుతున్నా అంటూ లాఫింగ్ ఎమోజీతో క్యాప్షన్ ఇచ్చారు. ఆ మేనిఫెస్టోలో హామీల పరంపర ఇలా ఉన్నది.

హామీల పరంపర ఇలా..

సర్పంచ్ అభ్యర్థి జైకరన్ లాట్వాల్ విద్యావంతుడు, కష్టజీవి, నిబద్ధత, నిజాయితీ గలవాడు అని పేర్కొన్నారు. ఇక్కడికి వరకు ఓకే.. ఇది సాధారణంగా కనిపించేది. కానీ, ఆ తర్వాత అసలు సినిమా మొదలైంది. తనను సర్పంచ్‌గా గెలిపిస్తే.. గ్రామంలో మూడు ఎయిర్‌పోర్టులు నిర్మిస్తానని పేర్కొన్నారు. పెట్రోల్ ధరలను రూ. 20కే లీటర్ చేస్తానని, గ్యాస్ సిలిండర్ ధర రూ. 100కు తగ్గిస్తా అని హామీ ఇచ్చారు. గ్రామంలో ఫ్రీ వైఫై ఏర్పాటు చేస్తానని చెప్పారు. జీఎస్టీనీ ఖతం చేస్తానని తెలిపారు. ప్రతి కుటుంబానికి ఒక బైక్ ఇస్తానని హామీ ఇచ్చారు. మద్యానికి వ్యసనమైన వారికి రోజుకు ఒక బాటిల్ లిక్కర్ ఇస్తానని పేర్కొన్నారు. మహిళలకు ఉచిత మేకప్ కిట్ అందిస్తానని వివరించారు. సిర్సద్ గ్రామం నుంచి నేరుగా ఢిల్లీకి మెట్రో లైన్ ఏర్పాటు చేస్తానని హామీ ఇచ్చారు. సిర్సద్ గ్రామ యువతకు ప్రభుత్వ ఉద్యోగం ఇస్తానని వాగ్దానం చేశారు. అంతేకాదు, సమీప పట్టణం గోహానాకు తమ గ్రామం నుంచి ప్రతి ఐదు నిమిషాలకు ఒక హెలికాప్టర్ సౌకర్యం ఏర్పాటు చేస్తానని అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తారు. 

Am shifting to this village 🤣 pic.twitter.com/fsfrjxbdLc

— Arun Bothra 🇮🇳 (@arunbothra)

Also Read: పన్ను చెల్లింపుదారుల నిధుల వ్యయంతో ఉచితాలు రాష్ట్రాల దివాలాకు దారితీయవచ్చు: సుప్రీం కోర్టు

ప్రధాన మంత్రికి కూడా ఈ హామీలు ఇవ్వగలడా? అని ఓ యూజర్ల కామెంట్ చేశారు. చాలా మంది జోక్ చేస్తూ.. తాము ఆ ఊరికి వెళతామని కామెంట్లు చేశారు. 

click me!