
న్యూఢిల్లీ: పార్లమెంటు(Praliament)లోని లోక్‌సభ, రాజ్యసభలో జరిగే సమావేశాలను లైవ్‌లో ప్రసారం చేసే సంసద్ టీవీ(Sansad TV) యూట్యూబ్ చానెల్(Youtube Channel)ను కొందరు దుండగులు హ్యాక్ చేశారు. ఫిబ్రవరి 15వ తేదీన రాత్రి 1 గంటల ప్రాంతంలో ఈ చానెల్‌ను హ్యాక్ చేసినట్టు సంసద్ టీవీ ఓ ప్రకటనలో వెల్లడించింది. ఈ చానెల్‌లో లైవ్ స్ట్రీమింగ్ సేవలు కూడా అంతరాయానికి గురయ్యాయి. అంతేకాదు, ఆ హ్యాకర్లు ఏకంగా సంసద్ చానెల్ పేరునూ ‘ఇథేరియం’గా మార్చినట్టు ప్రసార్ భారతీ ట్వీట్ చేసిన ప్రకటన తెలిపింది.
సంసద్ టీవీకి చెందిన టెక్నికల్ టీమ్ ఈ ప్రాబ్లమ్‌ను పరిష్కరించడానికి పని చేసినట్టు ఆ ప్రకటన తెలిపింది. రెండు గంటలు ఆ ప్రయత్నాలు చేసిన తర్వాత యూట్యూబ్ చానెల్‌ను రీస్టోర్ చేసినట్టు పేర్కొంది. భారత్‌లోని సైబర్ సెక్యూరిటీ ఘటనలను గుర్తించి వెంటనే రెస్పాండ్ అయ్యే నోడల్ ఏజెన్సీ ఇండియన్ కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్.. సంసద్ టీవీ యూట్యూబ్ చానెల్ హ్యాక్ అయిన విషయాన్ని గుర్తించింది. వెంటనే సంసద్ టీవీని అలర్ట్ చేసింది. ఆ తర్వాత యూట్యూబ్ టీమ్ రంగంలోకి దిగింది. ఈ సమస్యను శాశ్వతంగా పరిష్కరించే పనిలో ఉన్నట్టు సంసద్ టీవీ ప్రకటన తెలిపింది. వీలైనంత త్వరలోనే ఈ సమస్య పరిష్కృతం అవుతుందని, సంసద్ టీవీ యూట్యూబ్ అకౌంట్ అందుబాటులోకి వస్తుందని వివరించింది.
కాగా, సంసద్ టీవీ చానెల్ యూట్యూబ్‌లో ఇంకా అందుబాటులోకి రాలేదు. యూట్యూబ్ కమ్యూనిటీ గైడ్‌లైన్స్ నిబంధనలు ఉల్లంఘించారనే కారణంగా ఈ అకౌంట్‌ను రద్దు చేసినట్టు యూట్యూబ్‌లో కనిపిస్తున్నది. యూట్యూబ్‌లో ఇప్పుడు సంసద్ టీవీ అని సెర్చ్ చేసినా.. ఇదే మార్క్ చూపిస్తున్నది.
గత నెలలో కేంద్ర కార్పొరేట్ వ్యవహారాల మంత్రిత్వ శాఖ సహాయ మంత్రి రావు ఇంద్రజిత్ సింగ్ ఖాతాలో అరబిక్‌లో ఒక ట్వీట్ పోస్ట్ అయ్యింది. దీంతో పాటు హర్యానా ఎమ్మెల్యే. కాంగ్రెస్ నాయకుడు భూపిందర్ సింగ్ హుడా ట్విట్టర్ అకౌంట్ పేరు ‘‘@iLoveAlbaik’’గా మార్చబడింది. వీటి ద్వారా ఉర్దూలో పోస్ట్‌లు చేయబడ్డాయి. అయితే తాజాగా రాజస్థాన్ రాజ్ భవన్‌లో ద్వారా అందిన సమచారం ప్రకారం.. గవర్నర్ కల్‌రాజ్ మిశ్రా ఖాతా కూడా హ్యాక్ కు గురయ్యింది. తన సోషల్ మీడియా అకౌంట్లు హ్యాకింగ్ గురయ్యాయని ఆయన సంబంధిత కేంద్ర అధికారులకు గవర్నర్ అధికారికంగా ఫిర్యాదు చేశారు. నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ (NDRF) అధికారిక ట్విట్టర్ ను హ్యాకింగ్ నుంచి తిరిగి తీసుకున్న ఒక రోజు తరువాతే ఇవి చోటు చేసుకోవడం ఆందోళనకరం.
ఇదే రకంగా జనవరిలో సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ యొక్క ట్విట్టర్ ఖాతా హ్యక్ అయ్యింది. ట్విట్టర్ అకౌంట్ పేరు ‘ఎలోన్ మస్క్’గా మార్చబడింది. ఆ శాఖకు సంబంధం లేని పోస్టులు ఆ అకౌంట్ నుంచి వెలువడ్డాయి. దీంతో వెంటనే స్పందించిన అధికారులు అకౌంట్ ను కొన్ని నిమిషాల్లోనే తిరిగి స్వాధీనం చేసుకున్నారు. అందులో పోస్ట్ లను తొలగించారు. గతేడాది డిసెంబర్ మధ్య కాలంలో ప్రధాని నరేంద్ర మోదీ ట్విట్టర్ అకౌంట్ కు హ్యాక్ కు గురయ్యింది.