త్వరలోనే మోదీ, అమిత్ షాలను కలుస్తానని చెప్పిన సంజయ్ రౌత్.. ఫడ్నవీస్‌‌పై ప్రశంసలు..

By Sumanth KanukulaFirst Published Nov 10, 2022, 12:49 PM IST
Highlights

ఉద్దవ్ ఠాక్రే నేతృత్వంలోని శివసేన నాయకుడు సంజయ్ రౌత్ కీలక వ్యాఖ్యలు చేశారు. తాను త్వరలోనే మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్, ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షాలను కలుస్తానని చెప్పారు. 

ఉద్దవ్ ఠాక్రే నేతృత్వంలోని శివసేన నాయకుడు సంజయ్ రౌత్ కీలక వ్యాఖ్యలు చేశారు. తాను త్వరలోనే మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్, ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షాలను కలుస్తానని చెప్పారు.  పత్రా చాల్ రీడెవలప్‌మెంట్ ప్రాజెక్ట్‌కు సంబంధించిన మనీలాండరింగ్ కేసులో సంజయ్ రౌత్ 100 రోజులకు పైగా జైలులో ఉన్నారు. బుధవారం రౌత్ బెయిల్‌పై విడుదలైన సంగతి తెలిసిందే.  గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. దేవేంద్ర ఫడ్నవీస్ తీసుకున్న మంచి నిర్ణయాలను స్వాగతిస్తున్నట్లు చెప్పారు. గడచిన 100 రోజుల్లో తాను ఎదుర్కొన్న విషయాలను తెలియజేయడానికి త్వరలో ఢిల్లీలో మోదీ, అమిత్ షాలను కలుస్తానని తెలిపారు. 

ఈరోజు తాను ఉద్దవ్ ఠాక్రే‌ను కలవనున్నట్టుగా చెప్పారు. అలాగే శరద్ పవార్‌ను కూడా కలుస్తానని తెలిపారు.  “నేను ఈ రోజు శరద్ పవార్‌ను కలుస్తాను. ఆయన కూడా బాగా లేరు. నా గురించి కూడా ఆందోళన చెందాడు. చాలా మంది నాకు ఫోన్ చేశారు, వాళ్లందరినీ కలుస్తాను’’ అని రౌత్ చెప్పారు.

తనకు ఎవరిపైనా పగ లేదని పేర్కొన్న సంజయ్ రౌత్.. కేంద్ర సంస్థలు లేదా ప్రభుత్వంపై తాను విమర్శలు చేయనని చెప్పారు. ఇలాంటి రాజకీయ వైషమ్యాలను గతంలో ఎప్పుడూ చూడలేదని అన్నారు. అదే సమయంలో తాను కేంద్ర దర్యాప్తు సంస్థలను నిందచనని పేర్కొన్నారు. రాజకీయ నాయకుల మధ్య వైషమ్యాలు అంతం కావాలనే ఫడ్నవీస్ వైఖరిని స్వాగతిస్తున్నట్లు చెప్పారు.

మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండేను కూడా కలుస్తారా అని మీడియా ప్రశ్నించినప్పుడు.. ఫడ్నవీస్ చాలా మంచి నిర్ణయాలు తీసుకున్నారని.. కొంత పని ఉన్నందున ఆయనను కలుస్తానని చెప్పారు. అలాగే త్వరలో మోదీ, అమిత్ షాలను కూడా కలుస్తానని తెలిపారు. తనకు ఏమి జరిగిందో వారికి చెప్తానని అన్నారు. తాను ఒకరిని కలుస్తున్నాను అంటే మెతక వైఖరిని తీసుకున్నట్టు కాదని స్పష్టం చేశారు. 

ఇక, తన అరెస్టు చట్టవిరుద్ధమని సంజయ్ రౌత్ తెలిపారు. కోర్టు కూడా అదే చెప్పిందని అన్నారు. “నాపై కుట్ర పన్నిన వారు సంతోషంగా ఉంటే వారు సంతోషంగా ఉండనివ్వండి. నేను బాధపడ్డాను.. బ్రిటీష్ హయాంలో కూడా ఇలాంటి డర్టీ పాలిటిక్స్ పట్టలేదు” అని సంజయ్ రౌత్ అన్నారు. 
 

click me!