అడ్డగోలుగా నిర్మాణాలు చేపడితే మహా విపత్తు తప్పదు : బిల్డర్లకు సద్గురు హితవు..!

By Mahesh KFirst Published Mar 20, 2023, 5:24 PM IST
Highlights

బిల్డర్లకు సద్గురు జగ్గీవాసుదేవ్ వార్నింగ్ ఇచ్చారు. గతంలో ప్యాలెస్‌లు నిర్మించినట్టు ఇప్పుడూ అడ్డగోలుగా నిర్మాణాలు చేపడుతూ వెళితే మహా విపత్తు తప్పదని అన్నారు. ఆయన ఓ రియల్ ఎస్టేట్ కార్యక్రమంలో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం.
 

న్యూఢిల్లీ: ఆధ్యాత్మిక గురువు సద్గురు రియల్ ఎస్టేట్ డెవలపర్లకు ఓ వార్నింగ్ ఇచ్చాడు. గతంలో ప్యాలెస్‌లు నిర్మించినట్టు ఇప్పుడూ అలాగే అడ్డగోలుగా నిర్మాణాలు చేపడితే మాత్రం మహా విపత్తు తప్పదు అని అన్నారు.

కోయంబతూర్‌లో నిర్వహించిన రియల్ ఎస్టేట్ కన్వెన్షన్, మల్టిసిటీ ఎక్స్‌పో నార్విగేట్ 2023 కార్యక్రమంలో సద్గురు జగ్గీ వాసుదేవ్ మాట్లాడారు. సుమారు 1200ల మంది పార్టిసిపేంట్లతో మాట్లాడుతూ ప్రపంచ భూభాగంలో భారత్‌కు ఉన్నది నాలుగు శాతమే.. ప్రపంచ జనాభాలో మన దేశం వాటా 17.2 శాతం అని అన్నారు. మరో 15 సంవత్సరాల్లో జనాభా వాటా 20 శాతానికీ చేరవచ్చు అని వివరించారు. కానీ, భూమి పెరగడం లేదు కదా అని తెలిపారు.

అందుకే గతంలో ప్యాలెస్‌లు నిర్మించినట్టు ఇప్పుడూ అడ్డగోలుగా నిర్మిస్తూ పోతే ముప్పు తప్పదని వివరించారు.

ప్రభుత్వంపైనా ఆయన పలు ఆరోపణలు చేశారు. ప్రతి రోజూ సవరణలు చేస్తూ ఉంటే అందరూ కన్ఫ్యూజ్ అవుతూనే ఉన్నారని వివరించారు. గ్రామానికి, పట్టణానికి, నగరానికి నిర్మాణాల కోసం చట్టాలు చేసి వదిలిపెట్టండని తెలిపారు. చాలా మంది చట్టాన్ని అనుసరిస్తారని, చట్టాన్ని ఉల్లంఘించేవారు 2 శాతం కూడా ఉండకపోవచ్చని చెప్పారు. కానీ, ఇప్పుడు ప్రతి ఒక్కరినీ నేరస్తుడిగానే పరిగణిస్తున్నారని, ఒక్క బిల్డింగ్‌కు పర్మిషన్ తీసుకోవాలంటే 14 సర్టిఫికేట్లు అవసరం అని పేర్కొన్నారు. 

చట్టాల రూపకల్పనలో తమ ప్రమేయం ఇసుమంతైనా లేనప్పుడు దేశ నిర్మాణానికి తమ వంతు సేవలను ఎలా అందించగలమని ప్రశ్నించగా.. అందుకే ఇలాంటి అసోసియేషన్లు చాలా ముఖ్యం అని సద్గురు అన్నారు. ఇద్దరు వ్యక్తులను రియల్ ఎస్టేట్ డెవలపర్ల హక్కులు, వారేమీ చేయగలరు అనే విషయాలను పరిశోధించడానికి కేటాయించండి అని సూచించారు. ఆ తర్వాత సరైన ప్రాతినిధ్యం తీసుకోండని వివరించారు. ఒంటిగా వెళితే ఎవరైనా మిమ్మల్ని కన్విన్స్ చేయగలరేమో కానీ, మీరు ఒక పరిశ్రమగా వెళితే నియంత్రించలేరని తెలిపారు.

Also Read: పార్లమెంటులో ప్రతిష్టంభనకు కేంద్రమే కారణం.. అదానీ వ్యవహారం పై జేపీసీ ఏర్పాటు చేయాల్సిందే.. : కాంగ్రెస్

దేశంలో ఇప్పుడు 15 ఏళ్ల నుంచి 16 ఏళ్ల మధ్య వయసు చిన్నారులు ఒక కోటి మంది ఉండొచ్చని చెప్పారు. వారు తమను తాము చదువుకున్నామని భావిస్తారని, కానీ, రెండుకు రెండు కూడితే ఎంత వస్తుందో వారికి తెలియదని అన్నారు. వారి వద్ద ఎలాంటి నైపుణ్యం లేదని, వారు కాలేజీకి, యూనివర్సిటీలకు వెళ్లరని అన్నారు. వీరే ఎప్పుడు పేలుతుందో తెలియని బాంబ్ వంటివారని అన్నారు. క్రిమినల్స్, ఇతర అసాంఘిక శక్తులు వీరిని ఆసరాగా తీసుకునే ముప్పు ఎక్కువ అని తెలిపారు.

దేశ నిర్మాణం కేవలం బిల్డింగ్‌లు, రోడ్లు, వంతెనలు నిర్మిస్తే కాదని, అందుకు గొప్ప వ్యక్తులను నిర్మించాల్సి ఉంటుందని అన్నారు. శారీరకంగా, మానసికంగా, నైపుణ్యాల పరంగా గొప్ప వ్యక్తులను నిర్మిస్తేనే.. గొప్ప దేశం నిర్మాణమవుతుందని చెప్పారు.

click me!