పార్లమెంటులో ప్రతిష్టంభనకు కేంద్రమే కారణం.. అదానీ వ్యవహారంపై జేపీసీ ఏర్పాటు చేయాల్సిందే.. : కాంగ్రెస్

By Mahesh RajamoniFirst Published Mar 20, 2023, 4:03 PM IST
Highlights

New Delhi: స్వాతంత్య్రానంతరం జరిగిన అతిపెద్ద కుంభకోణాల్లో అదానీ కుంభకోణం ఒకటని కాంగ్రెస్ పార్టీ ఆరోపించింది. అధికార భారతీయ జనతా పార్టీ (బీజేపీ) ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ), ఇన్‌కమ్ ట్యాక్స్ (ఐటీ) వంటి ప్రభుత్వ సంస్థలను ఉపయోగించుకుంటూ అధికార దుర్వినియోగానికి పాల్ప‌డుతున్న‌ద‌ని కాంగ్రెస్ నాయకుడు ప్రమోద్ తివారీ ఆరోపించారు.
 

Congress blames Centre for impasse in Parliament: అదానీ వ్యవహారంపై సంయుక్త పార్లమెంటరీ కమిటీ (జేపీసీ) ఏర్పాటు చేయాలన్న డిమాండ్ ను లేవనెత్తేందుకు ప్రతిపక్షాలను ప్రధాని నరేంద్ర మోడీ నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వం అనుమతించకపోవడమే పార్లమెంటులో ప్రతిష్టంభనకు కారణమని కాంగ్రెస్ ఆరోపించింది. స్వాతంత్య్రానంతరం జరిగిన అతిపెద్ద కుంభకోణాల్లో అదానీ కుంభకోణం ఒకటని కాంగ్రెస్ పార్టీ ఆరోపించింది. పార్ల‌మెంట్ లో ప్రతిష్టంభనకు కేంద్రమే కారణమ‌ని మండిప‌డింది. 

అమెరికాకు చెందిన హిండెన్ బర్గ్ నివేదిక నేప‌థ్యంలో ప్రతిపక్షాలు గౌత‌మ్ అదానీ నేతృత్వంలోని గ్రూప్ పై విమ‌ర్శ‌లు గుప్పిస్తున్నాయి. ఈ విష‌యంలో ప్ర‌భుత్వ తీరును ప్ర‌శ్నిస్తున్నాయి. అదానీ అంశం వివాదంపై జేపీసీతో విచార‌ణ జ‌రిపించాల్సిందేన‌ని కాంగ్రెస్ డిమాండ్ చేస్తోంది. ఈ క్ర‌మంలోనే  దేశంలోని అతిపెద్ద కుంభకోణాల్లో అదానీ కుంభకోణం ఒకటనీ, అధికార భారతీయ జనతా పార్టీ (బీజేపీ) ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ), ఇన్‌కమ్ ట్యాక్స్ (ఐటీ) వంటి ప్రభుత్వ సంస్థలను ఉపయోగించుకుంటూ అధికార దుర్వినియోగానికి పాల్ప‌డుతున్న‌ద‌ని కాంగ్రెస్ నాయకుడు ప్రమోద్ తివారీ ఆరోపించారు.

అదానీ వ్యవహారంపై సమగ్ర దర్యాప్తు జరిపితే అదానీ గ్రూప్ అక్రమాల్లో అధికార పార్టీ ప్రమేయం ఉండొచ్చనీ, అందుకే జాయింట్ పార్లమెంటరీ కమిటీ (జేపీసీ) విచారణకు అంగీకరించడం లేదని తివారీ అన్నారు. "స్వాతంత్య్రం వచ్చిన తర్వాత జరిగిన అతిపెద్ద కుంభకోణం ఇది. జేపీసీకి ప్రభుత్వం భయపడుతోంది.. ఎందుకంటే అది తన అసలు రంగును బయటపెడుతుంద‌నీ, పార్లమెంటరీ ప్రక్రియను ఆలస్యం చేయడానికి అధికార పార్టీ ఉద్దేశపూర్వకంగా పార్లమెంటులో గందరగోళం సృష్టిస్తోంది" అని తివారీ అన్నారు. అలాగే, గ‌తంలో చాలా చిన్న కుంభకోణాల నేప‌థ్యంలో విచార‌ణ కోసం అనేక జేపీసీలు ఏర్పడ్డాయనీ, అదానీ వ్యవహారంపై దర్యాప్తు మరింత సముచితమని కాంగ్రెస్ పేర్కొంది. అప్పుడు జేపీసీ విచారణకు ఆదేశించడానికి ప్రభుత్వం ఎందుకు భయపడుతోందని తివారీ ప్రశ్నించారు.

అధికార పార్టీ ఎన్ని ప్రయత్నాలు చేసినా కాంగ్రెస్ పార్టీ గళం విప్పడం మానదని ఆయన అన్నారు. జేపీసీ విచారణకు ఆదేశించే వరకు తమ పోరాటం కొనసాగుతుందని తివారీ స్పష్టం చేశారు. అదానీ అంశాన్ని పార్లమెంటులో లేవనెత్తడం త‌మ ప్రయోజనం కోసం కాదనీ, ప్రజాప్రయోజనం, దేశ సేవ కోసం లేవనెత్తుతున్నామని తివారీ పేర్కొన్నారు. అదానీ వ్యవహారంపై జేపీసీ విచారణ జరిపించాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తున్న నేపథ్యంలో కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ కూడా కేంద్రం విదేశాంగ విధానంపై అనేక ఆరోపణలు చేశారు. జీరో అవర్ లో పంజాబ్ లో విద్యుదుత్పత్తి, మహానది కోల్ ఫీల్డ్స్ నుంచి బొగ్గు సేకరణ గురించి మాట్లాడుతూ మనీష్ తివారీ లోక్ సభలో అదానీ గ్రూప్ అంశాన్ని లేవనెత్తారు.

అదానీ గ్రూప్ నిర్వహించే ఓడరేవులతో సహా సుదీర్ఘ మార్గం ద్వారా బొగ్గును సేకరించేలా చూడాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించడం ద్వారా అదానీ గ్రూప్ న‌కు లబ్ధి చేకూర్చడానికి కేంద్రం పంజాబ్ ప్రజలపై వివక్ష చూపుతోందని ఆయన ఆరోపించారు. రాజ్యసభలో ప్రతిపక్ష నేత మల్లికార్జున ఖర్గే కూడా అదానీ వ్యవహారంపై సమగ్ర విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. ప్రజాప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని అదానీ వ్యవహారంపై జేపీసీ లేదా సుప్రీంకోర్టు పర్యవేక్షణలో సమగ్ర దర్యాప్తు జరిపించాలని తాము కోరుతున్నామని ఖర్గే పేర్కొన్నారు. ప్రతిపాదిత నిపుణుల కమిటీ న్యూయార్క్ కు చెందిన హిండెన్ బ‌ర్గ్ పరిశోధనను పరిశీలిస్తుందా లేదా అదానీ గ్రూప్ ను పరిశీలిస్తుందా? అని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి (కమ్యూనికేషన్) జైరాం రమేష్ గత నెలలో ప్రశ్నించారు.
 

click me!