కోల్‌కత్తా: రాష్ట్రంలో లాక్‌డౌన్ అమలు జరుగుతున్న తీరుపై బెంగాల్ రాష్ట్ర గవర్నర్ జగదీప్ దంఖర్ తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేశారు. లాక్ డౌన్ అమలు చేయడంలో వైఫల్యం చెందిన అధికారులను విధుల నుండి తొలగించాలని ఆయన సీఎం మమత బెనర్జీకి సూచించారు.
మతపరమైన సమ్మేళనాలు జరగకుండా చూడడంలో కొందరు అధికారులు వైఫల్యం చెందారని గవర్నర్ ఆరోపించారు. లాక్ డౌన్ విజయవంతం చేసేందుకు కేంద్ర బలగాల మోహరింపు అంశాన్ని పరిశీలించాలని ఆయన ట్విట్టర్ వేదికగా తన అభిప్రాయాన్ని పంచుకొన్నారు.
రాష్ట్రంలో పలుచోట్ల లాక్ డౌన్ ను పక్కాగా అమలు చేయడం లేదని బెంగాల్ రాష్ట్రానికి చెందిన బీజేపీ నేతలు మమత బెనర్జీపై తీవ్రంగా విమర్శలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో హోంమంత్రిత్వశాఖ విపత్తు నిర్వహణ చట్టం 2005 ప్రకారం చర్యలు చేపట్టాలని రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ రాసిన విషయం తెలిసిందే.
అయితే ఈ లేఖపై ముఖ్యమంత్రి మమత స్పందించారు. కొన్ని నిర్ధేశిత ప్రాంతాల్లో కేంద్రం ప్రత్యేక చొరవ చూపిస్తోందని కేంద్రం తీరుపై తనదైన శైలిలో విమర్శలు గుప్పించారు.
also read:
170 జిల్లాల్లో కరోనా హాట్ స్పాట్స్: కేంద్ర ఆరోగ్య శాఖ
మతపరమైన వైరస్‌కు వ్యతిరేకంగా మనం పోరాడటం లేదు. మనుషుల నుంచి మనుషులకు సోకే వైరస్ వ్యాప్తిని అరికట్టడానికి కృషి చేస్తున్నాం. ఎక్కడ సమస్య ఉన్నా అక్కడ పటిష్ట చర్యలు తీసుకుంటామని మమత బెనర్జీ ప్రకటించారు.