రాజస్థాన్ కాంగ్రెస్‌లో సచిన్ కలకలం: ఎమ్మెల్యేలతో ఢిల్లీకి పైలెట్

By narsimha lodeFirst Published Jul 12, 2020, 1:04 PM IST
Highlights

మధ్యప్రదేశ్ రాష్ట్రం తరహాలోనే రాజస్థాన్ రాష్ట్రంలో కూడ కాంగ్రెస్ పార్టీలో కలకలం రేపుతోంది. రాజస్థాన్ డిప్యూటీ సీఎం సచిన్ పైలెట్ తన వర్గానికి 23 మంది ఎమ్మెల్యేలతో కలిసి ఆదివారం నాడు ఢిల్లీకి బయలుదేరారు.


న్యూఢిల్లీ: మధ్యప్రదేశ్ రాష్ట్రం తరహాలోనే రాజస్థాన్ రాష్ట్రంలో కూడ కాంగ్రెస్ పార్టీలో కలకలం రేపుతోంది. రాజస్థాన్ డిప్యూటీ సీఎం సచిన్ పైలెట్ తన వర్గానికి 23 మంది ఎమ్మెల్యేలతో కలిసి ఆదివారం నాడు ఢిల్లీకి బయలుదేరారు.

ఢిల్లీలో పార్టీ అధినేత్రి సోనియాగాంధీ, రాహుల్ గాంధీతో సచిన్ పైలెట్ తో చర్చించే అవకాశం ఉందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.  రాష్ట్రంలో చోటు చేసుకొన్న పరిణామాలపై కాంగ్రెస్ పార్టీ చీఫ్ సోనియాగాంధీకి వివరించారు. 

మధ్యప్రదేశ్ రాష్ట్రంలో మాదిరిగా రాజస్థాన్ రాష్ట్రంలో అధికారాన్ని కైవసం చేసుకొనేందుకు  బీజేపీ ప్రయత్నాలు సాగిస్తోందని కాంగ్రెస్ పార్టీ నేతలు విమర్శలు చేస్తున్నారు.

స్వతంత్ర ఎమ్మెల్యేలను అవినీతి నిరోధక శాఖాధికారులు ప్రశ్నిస్తున్నారు.  రాష్ట్రంలో ఎమ్మెల్యేలకు రూ. 15 కోట్ల చొప్పున బీజేపీ  నేతలు ఆఫర్ చేస్తున్నారని రాజస్థాన్ సీఎం ఆశోక్ గెహ్లాట్ ఆరోపించారు.

రాజస్థాన్ చీఫ్ విప్ మహేష్ జోషి అవినీతి నిరోధక శాఖ అధికారులకు ఫిర్యాదు చేశారు.  పార్టీ మారేందుకు ఎమ్మెల్యేలకు రూ. 15 కోట్లతో పాటు ఇతర సహాయం చేసేందుకు బీజేపీ వాగ్దానం చేసిందని రాజస్థాన్ సీఎం గెహ్లాట్ చెప్పారు.

మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని పరిస్థితి రాకుండా తాము అన్ని రకాలుగా ప్రయత్నాలు చేస్తున్నామని  ఆయన చెప్పారు.

2018లో రాజస్థాన్ రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన సమయంలో ముఖ్యమంత్రి పదవిని సచిన్ పైలెట్ కోరుకొన్నాడు. అయితే అతనికి డిప్యూటీ సీఎం, పీసీసీ చీఫ్ పదవిని ఇచ్చారు.

రాజస్థాన్ రాష్ట్రంలో పార్టీని పునర్నిర్మించేందుకు పైలెట్ తీవ్రంగా కృషి చేసినందుకు పీసీసీ చీఫ్ పదవిని డిప్యూటీ సీఎం పోస్టు ఇచ్చినట్టుగా పార్టీ నాయకులు చెబుతున్నారు.

సీఎం ఆశోక్ గెహ్లాట్  డిప్యూటీ సీఎం సచిన్ పైలెట్ మధ్య విబేధాలు  రోజు రోజుకు పెరిగిపోతున్నాయి. గత ఏడాది జరిగిన లోక్ సభ ఎన్నికల సమయంలో సీఎం  గెహ్లాట్ కొడుకు ఎంపీగా ఓటమికి సచిన్ పైలెట్ కారణమని గెహ్లాట్ బహిరంగంగా ఆరోపించారు.

రాజస్థాన్ అసెంబ్లీలోని 200 అసెంబ్లీ స్థానాల్లో 107 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఉన్నారు. 12 మంది ఇండిపెండెంట్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ కు మద్దతిస్తున్నారు. రాష్ట్రీయ లోక్ దళ్, సీపీఎం, భారతీయ ట్రైబల్ పార్టీలకు చెందిన ఐదుగురు ఎమ్మెల్యేలు కాంగ్రెస్ కు మద్దతిస్తున్నారు.

మధ్యప్రదేశ్ రాష్ట్రంలో 22 మంది ఎమ్మెల్యేలతో జ్యోతిరాదిత్య సింధియా బీజేపీలో చేరిన తర్వాత ఆ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ కుప్పకూలిన విషయం తెలిసిందే.


 

click me!