రష్యా నుంచి గోవాకు వస్తున్న విమానానికి బాంబు బెదిరింపు.. ఉజ్బెకిస్థాన్‌కు మళ్లింపు..

By Sumanth KanukulaFirst Published Jan 21, 2023, 11:17 AM IST
Highlights

రష్యా రాజధాని మాస్కో నుంచి గోవాకు బయలుదేరిన విమానానికి బాంబ్ బెదిరింపు వచ్చింది. దీంతో విమానాన్ని శనివారం తెల్లవారుజామున ఉజ్బెకిస్థాన్‌కు మళ్లించారు. 

రష్యా రాజధాని మాస్కో నుంచి గోవాకు బయలుదేరిన విమానానికి బాంబ్ బెదిరింపు వచ్చింది. దీంతో విమానాన్ని శనివారం తెల్లవారుజామున ఉజ్బెకిస్థాన్‌కు మళ్లించారు. అజూర్ ఎయిర్ నడుపుతున్న ఈ విమానం ((AZV2463) భారత గగనతలంలోకి ప్రవేశించడానికి ముందు దారి మళ్లించబడింది. ఈ విమానం తెల్లవారుజామున 4.15 గంటలకు గోవాలోని దబోలిమ్ విమానాశ్రయంలో దిగాల్సి ఉంది. అయితే విమానంలో బాంబు అమర్చినట్లు పేర్కొన్న డబోలిమ్ విమానాశ్రయం డైరెక్టర్‌కు ఈమెయిల్ వచ్చినట్టుగా తెలుస్తోంది. 

దీంతో అప్రమత్తమైన అధికారులు విమానాన్ని ఉజ్బెకిస్థాన్‌కు మళ్లించారు. అజూర్ ఎయిర్ విమానంలో దాదాపు 240 మంది ఉన్నారు. ఇక, జనవరి 9 బాంబు బెదిరింపుతో మాస్కో-గోవా విమానం గుజరాత్‌లోని జామ్‌నగర్‌లోని భారత వైమానిక దళ స్థావరంలో అత్యవసరంగా ల్యాండ్ చేశారు. ఆ సమయంలో విమానాన్ని తనిఖీ చేయడానికి ఎన్‌ఎస్‌జీని పిలిచారు. రాత్రిపూట ప్రయాణికులందరినీ, సామానును క్షుణ్ణంగా తనిఖీ చేసిన తర్వాత విమానం గోవాకు వెళ్లేందుకు అనుమతించారు. దీంతో విమానం గోవాకు చేరుకుంది.

ఆ ఘటనకు సంబంధించి రష్యాలోని అజూర్ ఎయిర్ కార్యాలయానికి బెదిరింపు మెయిల్ రాగా.. తాజా ఘటనకు సంబంధించి దబోలిమ్ ఎయిర్‌పోర్ట్ డైరెక్టర్ కార్యాలయానికి బెదిరింపు మెయిల్ వచ్చిందని సంబంధిత వర్గాలు తెలిపాయి.

click me!