ప్రధాని మోడీకి పర్సనల్‌గా ఓ సందేశాన్ని అందించాలనుకుంటున్నా: రష్యా విదేశాంగ మంత్రి

Published : Apr 01, 2022, 03:54 PM ISTUpdated : Apr 01, 2022, 03:58 PM IST
ప్రధాని మోడీకి పర్సనల్‌గా ఓ సందేశాన్ని అందించాలనుకుంటున్నా: రష్యా విదేశాంగ మంత్రి

సారాంశం

రష్యా విదేశాంగ మంత్రి సెర్జీ లావరోవ్ ఈ రోజు భారత విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్‌తో భేటీ అయ్యారు. తాను రష్యా నుంచి ఓ సందేశాన్ని మోసుకు వచ్చానని, అది ప్రధాని నరేంద్ర మోడీకి పర్సనల్‌గా అందించాలనుకుంటున్నానని పేర్కొన్నారు. భారత ప్రధాని మోడీ, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఇరువురూ రెగ్యులర్‌గా టచ్‌లో ఉన్నారని వివరించారు.  

న్యూఢిల్లీ: భారత విదేశాంగ శాఖ మంత్రి ఎస్ జైశంకర్ ఈ రోజు రష్యా విదేశాంగ మంత్రి సెర్జీ లావరోవ్‌తో సమావేశం అయ్యారు. ఒక వైపు భారత్‌కు రష్యా చౌకగా చమురును అందిస్తామని ఆఫర్ ఇస్తుండగా, మరోవైపు తాము రష్యాపై విధించిన ఆంక్షలను పక్కదారి పట్టించే ప్రయత్నాలు చేస్తే తర్వాతి పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందన్న అమెరికా హెచ్చిరకల నేపథ్యంలో వీరిద్దరి సమావేశం జరిగింది. ఇదే సందర్భంలో విదేశాంగ మంత్రి సెర్జీ లావరోవ్ మాట్లాడుతూ, తాను భారత ప్రధాని నరేంద్ర మోడీతో పర్సనల్‌గా కలిసి ఓ మెస్సేజీని డెలివర్ చేయాలనుకుంటున్నట్టు తెలిపారు.

రష్యా అందించే ఆఫర్‌ను అందిపుచ్చుకుని చౌకగా చమురును దిగుమతి చేసుకోవాలని భారత్ యోచిస్తున్నట్టూ కథనాలు వస్తున్నాయి. అందుకోసం ఉభయ దేశాలూ రూబుల్- రూపాయి వాణిజ్య వ్యవస్థను ఏర్పాటు చేసుకోవడానికి సంసిద్ధతనూ వ్యక్తం చేసినట్టూ తెలుస్తున్నది. ఈ నేపథ్యంలో రష్యా విదేశాంగ మంత్రి సెర్జీ లావరోవ్ భారత్ పర్యటిస్తున్నారు.

రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్, భారత ప్రధాని నరేంద్ర మోడీలు రెగ్యులర్‌గా టచ్‌లో ఉన్నారని సెర్జీ లావరోవ్ అన్నారు. ఇక్కడ జరిగిన చర్చలు, సంప్రదింపులనూ తాను తమ అధ్యక్షుడు పుతిన్‌కు రిపోర్ట్ చేయాల్సి ఉంటుందని వివరించారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ గురించి తమ అధ్యక్షుడు పుతిన్ అడిగినట్టు చెప్పారు. ప్రధాని మోడీతో వ్యక్తిగతంగా కలిసి ఈ సందేశాన్ని ఆయనకు అందించే అవకాశం ఇస్తారని భావిస్తున్నానని పేర్కొన్నారు.

భారత్, రష్యా మధ్య సంబంధాలు సుస్థిరంగా కొనసాగడానికి వాటిని సంతులనం చేసుకునే అవకాశాలు ఈ ఉభయ దేశాలకు ఉన్నాయని తెలిపారు. ఇటీవలే 2+2 చర్చలు జరిగాయని గుర్తు చేశారు. కరోనాపై ఈ రెండు దేశాలు కలిసి పోరాడాయని, అదే విధంగా ఎనర్జీ, సైన్స్, ఫార్మాస్యూటికల్స్‌లకు సంబంధించిన ప్రాజెక్టుల అమలును యథాతథంగా కొనసాగించాలని భావిస్తున్నట్టు చెప్పారు. ఉక్రెయిన్‌పై తమ వైఖరి భారత్‌కు తెలుసు అని, తాము ఏదీ దాయడం లేదని వివరించారు. అందుకే భారత్ కూడా రష్యా పరిస్థితులను సమగ్రంగా పరిగణనలోకి తీసుకున్న తర్వాతే నిర్ణయం తీసుకుంటుందని, ఏకపక్షంలో నిర్ణయాలు తీసుకోదని ఆశాభావం వ్యక్తం చేశారు.

ప్రపంచ దేశాల్లోనూ ఒక సమతూకమైన వాతావరణాన్ని కొనసాగించడంలో రష్యా ఆసక్తి చూపుతుందని వివరించారు. కానీ, నేడు మన పశ్చిమ మిత్రులు ఒక ఆవశ్యకమైన అంతర్జాతీయ అంశాన్ని ఉక్రెయిన్ సంక్షోభంగా మార్చేశారని పేర్కొన్నారు. తాము దేని కోసం పోరాడేవారం కాదని చెప్పారు. రష్యాను సమగ్రంగా అవగాహన చేసుకుని, ఏకపక్షంగా ఆలోచించకుండా స్పష్టమైన వైఖరి తీసుకున్న భారత్‌ను తాము అభినందిస్తున్నామని అన్నారు.

ఇదే సందర్భంలో భారత విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ మాట్లాడుతూ, ఇరు దేశాల మధ్య సంబంధాలు మరింత బలోపేతం అయ్యాయని, ఎంతో వృద్ధి చెందాయని అన్నారు. ఈ సమావేశం కరోనాతోపాటు అత్యంత సంక్లిష్ట పరిస్థితుల నడుమ జరుగుతున్నదని తెలిపారు. 

ఇదిలా ఉండగా, భారత్‌కు అమెరికా వార్నింగ్ ఇచ్చింది. రష్యాపై తాము విధించిన ఆంక్షలు పక్కదారి పట్టేలా వ్యవహరించవద్దని స్పష్టం చేసింది. రష్యా, చైనాల మధ్య పరిమితి లేని భాగస్వామ్యం ఉన్నదని తెలిపింది. భవిష్యత్‌లో చైనా మళ్లీ భారత భూభాగాల్లోకి చొచ్చుకురావాలని ప్రయత్నించకపోదు అని, అలా ఎల్ఏసీ దాటే ప్రయత్నం చేసినప్పుడు భారత్‌కు సహాయం చేయడానికి, అండగా నిలవడానికి రష్యా ముందుకు రాదని పేర్కొంది. ఎందుకంటే ఆ రెండు దేశాల మధ్య అంతులేని భాగస్వామ్యం ఉందని అవి ప్రకటించుకున్నాయని గుర్తు చేసింది. కాబట్టి, రష్యాపై అమెరికా విధించిన ఆంక్షలను తప్పించేలా భారత్ వ్యవహరించరాదని పేర్కొంది. ఒక వేళ తాము రష్యాపై విధించిన ఆంక్షలను నీరుగార్చేలా ఏ దేశం వ్యవహరించిన అందుకు తగిన పరిణామాలను ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరించింది.

PREV
click me!

Recommended Stories

ఇండిగో విమానాలను దెబ్బకొట్టింది ఏంటి? అసలు ఈ ఎఫ్‌డిటిఎల్ అంటే ఏమిటి?
Humans On Moon: చంద్రుడిపై ఇల్లు.. కల కాదు నిజం ! 2025 స్టడీ సంచలనం