ఈ దేశానికి మ‌నం యాజ‌మానులం కాదు.. వార‌సులం మాత్ర‌మే.. :ఆర్‌ఎస్‌ఎస్ చీఫ్‌ మోహన్ భగవత్

By Rajesh KarampooriFirst Published Sep 24, 2022, 3:23 AM IST
Highlights

భార‌త భూమి మ‌న‌కు ఆహారం, నీరుతో పాటు పుణ్యఫలాలను కూడా ఇస్తుందనీ, అందుకే మనమంతా మదర్ ఇండియా అని పిలుస్తాము. భూమికి యజమానులం కాదు, దాని వార‌సులం అని ఆర్‌ఎస్‌ఎస్ చీఫ్  మోహన్ భగవత్ అన్నారు. 

భారతదేశ జాతీయవాద భావన 'వసుధైవ కుటుంబం'పై ఆధారపడి ఉందని, ఇది మరే ఇతర దేశాల‌కు ముప్పు కాదని రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (ఆర్‌ఎస్‌ఎస్) చీఫ్‌ మోహన్ భగవత్ పేర్కొన్నారు. ఆయ‌న శుక్రవారం డాక్టర్ అంబేద్కర్ ఇంటర్నేషనల్ సెంటర్‌లో సంకల్ప్ ఫౌండేషన్, మాజీ సివిల్ సర్వీస్ ఆఫీసర్ మంచ్ ఉపన్యాసాల శ్రేణిలో ప్రసంగించారు. ఈ సంద‌ర్భంగా మోహన్ భగవత్ మాట్లాడుతూ..  “మన జాతీయవాదం ఇతరులకు ఎటువంటి ముప్పును కలిగించదు. మన‌కు అలాంటి స్వభావం లేదు. మన జాతీయవాదం.. ప్రపంచమంతా ఒక్క‌టే కుటుంబం అని చెబుతుంది (వసుధయేవ్ కుట్యాంబకం). ఈ భావ‌న‌ ప్రపంచాన్ని ఒకే కుటుంబంగా మార్చడానికి కూడా తోడ్ప‌డుతుందని తెలిపారు. 
 
భారతదేశం ప్రాచీన కాలం నుంచి భిన్నత్వం కలిగిన దేశమని అన్నారు. భార‌త భూమి అందరికీ ఇచ్చే విధంగా ఉంటుంద‌నీ, ఈ భూమి ఆహారం, నీరుతో పాటు పుణ్యఫలాలను కూడా ఇస్తుందనీ, అందుకే మనమంతా మదర్ ఇండియా అని పిలుస్తామని అన్నారు. మ‌న‌ ఈ భూమికి యజమానులం కాదనీ, వీటికి వార‌సుల‌మ‌ని అన్నారు. భార‌త దేశ సంస్కృతిలోనే ఐక్యత ఉంద‌నీ, ప్ర‌తి భార‌తీయుడు ఈ  విధానాన్ని అనుస‌రిస్తాడ‌ని తెలిపారు. సంస్కృతి పరిరక్షణ కోసం మన పూర్వీకులు త్యాగాలు, పోరాటాలు చేశారని అన్నారు. పాశ్చాత్య దేశాల్లో దేశాభివృద్ధికి, మన దేశంలో దేశాభివృద్ధికి చాలా వ్య‌త్యాసాలు ఉంటాయ‌ని భగవత్ అన్నారు.  భారతదేశ జాతీయవాదం అనే  భావన.. మతం లేదా భాష లేదా ప్రజల ఉమ్మడి ప్రయోజనాలపై ఆధారపడి ఉంటుంద‌ని,  ఇతర భావనలకు చాలా భిన్నమైనదని మోహన్ భగవత్ నొక్కి చెప్పారు.  భారతదేశ జాతీయవాద భావనలో భిన్నత్వం ఒక భాగమని అన్నారు. 

అనంత‌రం ఈ కార్యక్రమంలో శ్రీ రామజన్మభూమి మందిర్ నిర్మాణ సమితి చైర్మన్, ప్రధానమంత్రి మాజీ ప్రధాన కార్యదర్శి నృపేంద్ర మిశ్రా మాట్లాడుతూ.. 36 ఏళ్లుగా సంకల్ప్ సంస్థ మంచి విద్యార్థులను ప్రోత్సహిస్తోందన్నారు. ఈ కార్యక్రమంలో సంకల్ప్ సంకలనం చేసిన 'ఇండియన్ పర్‌స్పెక్టివ్' పుస్తకానికి సంబంధించిన ఆంగ్ల వెర్షన్‌ను కూడా సర్సంఘచాలక్ డాక్టర్ మోహన్ భగవత్ విడుదల చేశారు.

ఈ పుస్తకంలో అంతకుముందు సంవత్సరాల్లో నిర్వహించిన ఉపన్యాస పరంపరకు హాజరైన వక్తల ఉపన్యాసాలు సంకలనం చేయబడ్డాయి. వీటిలో డాక్టర్ కృష్ణ గోపాల్, డాక్టర్ మురళీ మనోహర్ జోషి, హోం మంత్రి అమిత్ షా, దివంగత సుష్మా స్వరాజ్, దివంగత అనిల్ మాధవ్ దవే సహా 12 మంది ప్రముఖ వక్తల ఉపన్యాసాలు ఉన్నాయి. ఈ పుస్తకాన్ని కేంద్రీయ హిందీ శిక్షణ మండల్ ఉపాధ్యక్షుడు అనిల్ శర్మ జోషి మరియు సామాజిక కార్యకర్త రాజేంద్ర ఆర్య సంపాదకత్వం వహించారు. ఈ పుస్తకాన్ని ప్రభాత్ ప్రకాశన్ ప్రచురించింది.

click me!