ఇండియా-పాకిస్తాన్ మ్యాచ్‌ను కలిసి చూస్తే రూ. 5000 జరిమానా.. పోస్టులూ చేయొద్దు: శ్రీనగర్ కాలేజీ ఆర్డర్

By Mahesh KFirst Published Aug 28, 2022, 1:24 PM IST
Highlights

శ్రీనగర్‌లోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఎన్ఐటీ) ఆదివారం జరుగుతున్న ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ గుంపులుగా చూడకుండా తమ విద్యార్థులకు ఆంక్షలు విధించింది. ఎవరి గదికి వారే పరిమితం కావాలని, ఇతరులను ఆహ్వానిస్తే సదరు విద్యార్థిని డిబార్ చేస్తామని తెలిపింది.
 

శ్రీనగర్: జమ్ము కశ్మీర్‌లో శ్రీనగర్‌లోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఎన్ఐటీ) సరికొత్త ఆదేశం జారీ చేసింది. ఆసియా కప్ సిరీస్‌లో భాగంగా ఆదివారం జరుగుతున్న ఇండియా పాకిస్తాన్ మ్యాచ్‌ పై ఆంక్షలు విధించింది. విద్యార్థులు ఈ మ్యాచ్‌ను కలిసి గ్రూపుగా చూడొద్దని ఆదేశించింది. అలాగే, మ్యాచ్‌కు సంబంధించి సోషల్ మీడియా వేదికల్లోనూ ఎలాంటి పోస్టులు చేయొద్దని పేర్కొంది.

ఇన్‌స్టిట్యూట్ యాజమాన్యం, స్టూడెంట్స్ వెల్ఫేర్ డీన్ ఓ నోటీసు జారీ చేశారు. ఈ మ్యాచ్ జరుగుతున్న సమయంలో విద్యార్థులు తమకు కేటాయించిన గదుల్లోనే ఉండాలని ఆదేశించారు.

‘దుబాయ్ ఇంటర్నేషనల్ స్టేడియంలో కొన్ని దేశాల క్రికెట్ జట్లు ఓ క్రికెట్ సిరీస్‌లో భాగంగా క్రికెట్ ఆడుతున్న విషయం విద్యార్థులు తెలిసిందే. ఈ సందర్భంగా స్పోర్ట్స్‌ను ఒక గేమ్‌లాగే తీసుకోవాలని విద్యార్థులకు సూచిస్తున్నాం. కాబట్టి, విద్యా సంస్థలో లేదా హాస్టల్‌లో ఎలాంటి ఇన్‌డిసిప్లైన్ వాతావరణం సృష్టించకుండా ఉండాలి’ అని నోటీసులో ఎన్ఐటీ యాజమాన్యం తెలిపింది.

ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ జరుగుతున్న ఈ ఆదివారం నాడు విద్యార్థులు వారి వారికి కేటాయించిన గదుల్లోనే ఉండాలని ఆదేశించింది. ఇతర విద్యార్థులను తమ రూమ్‌లలోకి రానివ్వొద్దని తెలిపింది. గ్రూపులుగా కలిసి ఈ మ్యాచ్‌ను చూడొద్దని ఆదేశించింది. ఒక రూమ్‌లో గ్రూపుగా విద్యార్థులు ఈ మ్యాచ్ చూడటాన్ని అంగీకరించబోమని వివరించంది. అలా చేస్తే.. ఆ రూమ్ కేటాయించిన విద్యార్థిని డిబార్ చేస్తామని తెలిపింది. అలాగే, ఆ గదిలోకి వెళ్లి మ్యాచ్ చూసిన విద్యార్థులకు రూ. 5000 ఫైన్ వేస్తామని పేర్కొంది.

అలాగే, ఈ మ్యాచ్‌కు సంబంధించి విద్యార్థులు సోషల్ మీడియాలో ఎలాంటి పోస్టులు చేయరాదని ఆదేశించింది. అంతేకాదు, ఈ మ్యాచ్ జరిగే కాలంలో లేదా జరిగిన తర్వాత కూడా విద్యార్థులు హాస్టల్ గది దాటి బయటకు రావొద్దని తెలిపింది.

2016లో ఈ విద్యా సంస్థలో ఔట్ స్టేషన్, లోకల్ స్టూడెంట్ల మధ్య ఘర్షణలు జరిగాయి. అప్పుడు టీ 20 వరల్డ్ కప్ సెమీ ఫైనల్‌లో వెస్ట్ ఇండీస్ చేతిలో భారత్ ఓడిపోయిన తర్వాత ఈ ఘర్షనలు జరిగాయి. ఫలితంగా ఎన్ఐటీ కొన్నాళ్లపాటు మూసి ఉంచాల్సి వచ్చింది.

click me!