యూపీలో ఘోర రోడ్డు ప్రమాదం, ఆరుగురు మృతి...

By SumaBala BukkaFirst Published Nov 30, 2022, 12:29 PM IST
Highlights

ఉత్తరప్రదేశ్ లో బుధవారం తెల్లవారుజామున జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆరుగురు మృతి చెందారు. ఓ ట్రక్కు, బస్సు ఢీ కొన్న ఈ ఘటనలో మరో 15మందికి గాయాలయ్యాయి. 

ఉత్తరప్రదేశ్ : యూపీలోని బహ్రైచ్ లో బుధవారం లక్నో-బహ్రైచ్ హైవేపై జర్వాల్ రోడ్‌లో ఘోర ప్రమాదం జరిగింది. రోడ్డు మీద వెడుతున్న బస్సును ట్రక్కు ఢీకొనడంతో ఆరుగురు మృతి చెందగా, మరో 15 మంది గాయపడినట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘటన బుధవారం తెల్లవారుజామున 4.30 గంటలకు జరిగింది. ప్రమాదం సమయంలో లక్నో డిపోకు చెందిన బస్సును అతి వేగంగా నడుపుతున్నట్లు జిల్లా మేజిస్ట్రేట్ దినేష్ చంద్ర సింగ్ తెలిపారు.

ఈ ప్రమాదంలో ఆరుగురు అక్కడికక్కడే మృతి చెందగా, గాయపడిన మరో 15 మందిని ఆస్పత్రికి తరలించారు. వీరిలో మరో నలుగురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. 

కుమారుడితో కలిసి భర్తను చంపిన భార్య..శవాన్ని ముక్కలుగా నరికి, వీధుల్లో పారేస్తూ కెమెరాకు చిక్కిన తల్లీకొడుకులు

ఇదిలా ఉండగా, ఉత్తరప్రదేశ్ లో వరుస ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. మంగళవారం సాయంత్రం ఉత్తరప్రదేశ్ లోని  ఫిరోజాబాద్ జిల్లాలో ఘోర అగ్ని ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో వ్యాపించిన మంటల్లో చిక్కుకుని మొత్తం ఆరుగురు మృతి చెందారు. మృతుల్లో ముగ్గురు చిన్నారులు కూడా ఉన్నారు. వీరు కాకుండా ఈ ప్రమాదంలో మరో ముగ్గురు గాయపడ్డారు. దీనికి సంబంధించిన పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. 

ప్రమాదం జరిగిన భవనంలో రామన్ కుమార్ అనే ఎలక్ట్రానిక్స్ అండ్ జ్యువెలరీ షాప్ యజమాని, తన తొమ్మిది మంది కుటుంబ సభ్యులతో కలిసి ఉంటున్నారు. ఈ భవనం జస్రానా ప్రాంతంలోని పధమ్ పట్టణంలో ఉంది. మంగళవారం సాయత్రం వీరి ఇంట్లో కరెంట్ షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు చెలరేగాయి. వెంటనే, సమాచారం అందుకున్న 12 స్టేషన్ల పోలీసు సిబ్బంది, మెయిన్ పూర్, ఆగ్రా, ఫిరోజ్ బాద్, ఎటా కు చెందిన 18 అగ్నిమాపక యంత్రాలు రంగంలోకి దిగాయి. 

భారీగా ఎగిసి పడుతున్న మంటలను ఆర్పేందుకు వీరంతా తీవ్రంగా శ్రమించారు. అయితే, మంటలు ఎంతకూ అదుపులోకి రాకపోవడంతో రామన్ కుమార్ తో పాటు ఇంట్లోని మరో ఐదుగురు చనిపోయారు. మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. వారిని చికిత్స కోసం సమీపంలోని హాస్పిటల్ కు తరలించారు. అయితే, ఈ ఘటనకు షార్ట్ సర్క్యూటే కారణం అయి ఉండొచ్చని ప్రాథమికంగా భావిస్తున్నామని పోలీసులు తెలిపారు.

యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఈ ఘటనపై తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. వారికి తన సంతాపాన్ని తెలియజేశారు. ప్రమాదంలో గాయపడి ఆసుపత్రిలో చేరిన వారికి మెరుగైన చికిత్స అందించాలని జిల్లా యంత్రాంగాన్ని ఆదేశించారు. వారు త్వరగా కోలుకోవాలని, చనిపోయినవారి ఆత్మలకు శాంతి చేకూరాలని ప్రార్థించారు.  

click me!