బీహార్ అసెంబ్లీలో హైడ్రామా: విపక్ష సభ్యుల ఆందోళన.. సొమ్మసిల్లి పడిపోయిన ఎమ్మెల్యే

By Siva KodatiFirst Published Mar 23, 2021, 6:19 PM IST
Highlights

బీహార్ అసెంబ్లీ వద్ద హైడ్రామా చోటు చేసుకుంది. కొత్త పోలీస్ చట్టాన్ని వ్యతిరేకిస్తూ విపక్ష సభ్యులు ఆందోళనకు దిగారు. అక్కడితో ఆగకుండా స్పీకర్ పోడియాన్ని చుట్టుముట్టి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు

బీహార్ అసెంబ్లీ వద్ద హైడ్రామా చోటు చేసుకుంది. కొత్త పోలీస్ చట్టాన్ని వ్యతిరేకిస్తూ విపక్ష సభ్యులు ఆందోళనకు దిగారు. అక్కడితో ఆగకుండా స్పీకర్ పోడియాన్ని చుట్టుముట్టి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.

దీంతో రెండు సార్లు సభ వాయిదా పడినప్పటికీ విపక్ష సభ్యులు వెనక్కి తగ్గలేదు. దీంతో ఆందోళన చేస్తున్న సభ్యుల్ని మార్షల్స్ బయటకు పంపే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో రెండు వర్గాల మధ్య తోపులాట జరిగింది.

ఓ ఎమ్మెల్యే స్పృహ తప్పి పడిపోయారు. ఉద్రిక్త పరిస్ధితులు చోటు చేసుకోవడంతో మరిన్ని బలగాలను రంగంలోకి దింపారు. మరోవైపు ఆర్జేడీ ఎమ్మెల్యేలు స్పీకర్ విజయ్ సిన్హాను ఛాంబర్ నుంచి బయటకు రాకుండా నిర్బంధించారు. 

అంతకుముందు రాష్ట్రంలో పెరిగిపోతున్న నిరుద్యోగం, ఇంధన ధరలకు నిరసనగా రాష్ట్రీయ జనతాదళ్ ఆధ్వర్యంలో మంగళవారం ఉదయం బీహార్ వ్యాప్తంగా నిరసన ర్యాలీలు నిర్వహించారు.

దీనిలో భాగంగా ఆ పార్టీ అగ్రనేతలు తేజస్వీయాదవ్, తేజ్ ప్రతాప్ యాదవ్‌లు అసెంబ్లీ వైపు భారీ ర్యాలీ నిర్వహించారు. అప్రమత్తమైన పోలీసులు ఆర్జేడీ నేతలు, కార్యకర్తలపై లాఠీ చార్జ్ చేశారు.

తేజస్వీయాదవ్, తేజ్ ప్రతాప్ యాదవ్‌లను అదుపులోకి తీసుకున్నారు. పాట్నాలోని డాక్ బంగ్లా చౌక్ వద్ద ఆర్జేడీ కార్యకర్తలు పోలీసు బారికేడ్లను నెట్టేసి దూసుకొచ్చారు. దీంతో పోలీసులు వారిపై వాటర్ కేనన్లు ప్రయోగించారు.
 

click me!