కరోనాపై కేంద్రం హైఅలర్ట్.. దేశవ్యాప్తంగా మాక్ డ్రిల్‌కు ప్లాన్.. రాష్ట్రాలకు కీలక అడ్వైజరీ..

By Sumanth KanukulaFirst Published Mar 25, 2023, 4:49 PM IST
Highlights

దేశంలో కరోనా కేసులు మరోసారి పెరుగుతున్న నేపథ్యంలో కేంద్రం అప్రమత్తమైంది. ఇప్పటికే ప్రధాని నరేంద్ర మోదీ కరోనా పరిస్థితులపై ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించిన సంగతి తెలిసిందే. తాజాగా ఆసుపత్రుల సంసిద్ధతను సమీక్షించడానికి దేశవ్యాప్తంగా మాక్ డ్రిల్‌కు కేంద్రం ప్లాన్ చేసింది. 
 

దేశంలో కరోనా కేసులు మరోసారి పెరుగుతున్న నేపథ్యంలో కేంద్రం అప్రమత్తమైంది. ఇప్పటికే ప్రధాని నరేంద్ర మోదీ కరోనా పరిస్థితులపై ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించిన సంగతి తెలిసిందే. తాజాగా కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ, ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ఐసీఎంఆర్) సంయుక్తంగా అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు అడ్వైజరీని జారీచేశాయి. ఈ అడ్వైజరీ కేంద్ర ఆరోగ్య కార్యదర్శి రాజేష్ భూషణ్, ఐసీఎంఆర్ డైరెక్టర్ జనరల్ డాక్టర్ రాజీవ్ బహ్ల్ సంతకాలతో వెలువడింది. కోవిడ్ పరీక్షల సంఖ్యను పెంచాలని అడ్వైజరీలో పేర్కొన్నారు.

దేశంలో పెరుగుతున్న కోవిడ్-19, సీజనల్ ఇన్‌ఫ్లుఎంజా కేసుల నేపథ్యంలో.. ఆసుపత్రుల సంసిద్ధతను సమీక్షించడానికి ప్రభుత్వం ఏప్రిల్ 10, 11 తేదీలలో దేశవ్యాప్తంగా మాక్ డ్రిల్‌ను ప్లాన్ చేస్తోందని అడ్వైజరీలో పేర్కొన్నారు. అన్ని జిల్లాల్లోని ప్రభుత్వ, ప్రైవేట్ ఆరోగ్య సౌకర్యాలలో మందులు, ఆసుపత్రి పడకలు, వైద్య పరికరాలు, వైద్య ఆక్సిజన్ లభ్యతను అంచనా వేసే లక్ష్యంతో ఈ ప్రక్రియ చేపట్టనున్నట్టుగా తెలిపారు. మాక్ డ్రిల్ కచ్చితమైన వివరాలను మార్చి 27న షెడ్యూల్ చేయబడిన వర్చువల్ సమావేశంలో రాష్ట్రాలకు తెలియజేయడం జరుగుతుందని తెలిపారు. 

గత కొన్ని వారాల్లో.. కొన్ని రాష్ట్రాల్లో కోవిడ్-19 పరీక్షల సంఖ్య తగ్గిందని, ప్రపంచ ఆరోగ్య సంస్థ నిర్దేశించిన ప్రమాణాలతో పోలిస్తే ప్రస్తుత పరీక్ష స్థాయిలు సరిపోవని అడ్వైజరీలో పేర్కొన్నారు. కోవిడ్-19‌కు అవసరమైన పరీక్షను నిర్వహించడం చాలా కీలకమని.. ఉద్భవిస్తున్న హాట్‌స్పాట్‌లను గుర్తించడం, ముందస్తు చర్యలు తీసుకోవడం చాలా ముఖ్యమని చెప్పారు. .

ఫిబ్రవరి మధ్య నుంచి దేశంలో కోవిడ్-19 కేసులలో పెరుగుదల కనిపిస్తోందని పేర్కొన్నారు. ఈరోజు ఉన్న గణంకాల ప్రకారం.. దేశంలో కోవిడ్ యాక్టివ్‌ కేసులు ఎక్కువగా.. ఎక్కువగా కేరళ (26.4 శాతం), మహారాష్ట్ర (21.7 శాతం), గుజరాత్ (13.9 శాతం), కర్ణాటక (8.6 శాతం), తమిళనాడు (6.3 శాతం) రాష్ట్రాల్లో ఉన్నాయని అడ్వైజరీలో పేర్కొన్నారు. అలాగే గతంలో జారీచేసిన మార్గదర్శకాలను ప్రస్తావించడంతో పాటు.. పలు జాగ్రత్తలు తీసుకోవాల్సిందిగా సూచించారు. 

click me!