
రాజద్రోహం చట్టం అంటే ఐపీసీ సెక్షన్ 124ఏకి వ్యతిరేకంగా దాఖలైన పిటిషన్లపై విచారణ సందర్భంగా బుధవారం సుప్రీం కోర్టు కీలక ఉత్తర్వులు వెలువరించింది. రాజద్రోహం చట్టంపై మధ్యంతర స్టే విధించింది. రాజద్రోహంపై కేంద్ర ప్రభుత్వం పునఃపరిశీలన పూర్తయ్యేవరకు.. 124ఏ కింద కొత్త కేసులు పెట్టవద్దని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను కోర్టు ఆదేశించింది. ఇప్పటికే నమోదైన కేసులపై చర్యలు తీసుకోవద్దని న్యాయస్థానం స్పష్టం చేసింది. రాజద్రోహం చట్టంపై సుప్రీం కోర్టు ఆదేశాల తర్వాత కేంద్ర న్యాయ శాఖ మంత్రి కిరణ్ రిజిజు తన స్పందనను తెలియజేశారు. భారత రాజ్యాంగంలోని నిబంధనలను, ప్రస్తుత చట్టాలను గౌరవించాలని అన్నారు. న్యాయవ్యవస్థను, వాటి స్వతంత్రను గౌరవిస్తామని చెప్పారు. అయితే లక్ష్మణ రేఖ అనేది ఉంటుందని.. దానిని ఎవరూ దాటకూడదని కీలక కామెంట్స్ చేశారు.
‘‘మేము మా వైఖరిని పూర్తిగా స్పష్టం చేశాం. అలాగే ప్రధాని మోదీ ఉద్దేశాన్ని కూడా కోర్టుకు తెలియజేశాం. మేము కోర్టును, దాని స్వతంత్రతను గౌరవిస్తాము. కానీ కానీ అన్ని వ్యవస్థలను గౌరవించాల్సిన 'లక్ష్మణ రేఖ' ఉంది. భారత రాజ్యాంగంలోని నిబంధనలను అలాగే ప్రస్తుత చట్టాలను మనం గౌరవిస్తున్నామని నిర్ధారించుకోవాలి. మేము ఒకరినొకరు గౌరవిస్తాము. కోర్టు ప్రభుత్వాన్ని, శాసనవ్యవస్థను గౌరవించాలి. అలాగే ప్రభుత్వం కూడా కోర్టును గౌరవించాలి. మాకు స్పష్టమైన సరిహద్దు ఉంది.. అలాగే లక్ష్మణ రేఖను ఎవరూ దాటకూడదు” అని న్యాయ శాఖ మంత్రి పేర్కొన్నారు. అదే సమయంలో సుప్రీం కోర్టు నిర్ణయాన్ని తప్పని భావిస్తున్నారా అనే ప్రశ్నకు మాత్రం.. ఆయన సమాధానం చెప్పకుండా తప్పించుకున్నారు.
సుప్రీం కోర్టు ఏం చెప్పిందంటే..
రాజద్రోహం చట్టంకు వ్యతిరేకంగా దాఖలైన పిటిషన్లపై విచారణ సందర్భంగా.. ఆ చట్టాన్ని పునఃపరిశీలన చేయాలని నిర్ణయించుకున్నట్లు కేంద్రం తెలిపింది. ఇందుకోసం మరింత సమయం కావాలని విచారణ జరుపుతున్న సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణ నేతృత్వంలోని ధర్మాసనాన్ని కోరింది. ఈ క్రమంలోనే బుధవారం విచారణ సందర్భంగా కేంద్ర ప్రభుత్వం పునఃపరిశీలన చేసే వరకు.. రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు రాజద్రోహం చట్టం కింద ఎలాంటి కొత్త కేసులను నమోదు చేయరాదని సీజేఐ ధర్మాసనం స్పష్టంగా చెప్పింది. రాజద్రోహం సెక్షన్ల కింద కేతాజాగా కేసు నమోదైతే సంబంధిత పక్షాలు కోర్టును ఆశ్రయించవచ్చని, న్యాయస్థానం సమస్యను పరిష్కరిస్తుందని జస్టిస్ ఎన్వీ రమణ చెప్పారు.
చట్టాన్ని దుర్వినియోగం చేయకుండా నిరోధించేందుకు రాష్ట్రాలకు ఆదేశాలు ఇచ్చే స్వేచ్ఛ కేంద్ర ప్రభుత్వానికి ఉందని జస్టిస్ ఎన్వీ రమణ అన్నారు. సమీక్ష జరిగేంత వరకు చట్టంలోని ఈ నిబంధనను ఉపయోగించకపోవడమే సరైనదని పేర్కొన్నారు. ఇప్పటికే ఈ కేసులో జైలులో ఉన్నవారు బెయిల్ కోసం న్యాయ స్థానాలను ఆశ్రయించవచ్చని సూచించారు.
ఇక, కేంద్రం తరఫున వాదనలు వినిపించిన సొలిసిటర్ జనరల్ తుషార్ మోహతా.. తీవ్రమైన నేరాల్లో కేసులు నమోదు చేయకుండా ఉండలేమన్నారు. ప్రతి కేసు తీవ్రతను చెప్పలేమని చెప్పారు. ఎస్పీ ర్యాంక్ అధికారి ఆమోదిస్తేనే ఈ చట్టం కింద కేసు నమోదు చేసేలా మార్గదర్శకాలు రూపొందిస్తామని.. పెండింగ్ కేసులను న్యాయపరమైన పోరమ్ ముందు పరిశీలించాలని కూడా మెహతా సుప్రీం ధర్మాసనం ముందు వివరించారు. అయితే ఈ వాదనలతో సుప్రీం ధర్మాసనం ఏకీభవించలేదు. పౌరుల హక్కులు, దేశ సమగ్రత మధ్య సమతుల్యం అవసరమని సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణ అభిప్రాయపడ్డారు.