
మతపరమైన ప్రదేశాల నుంచి తొలగించిన లౌడ్ స్పీకర్లను మళ్లీ ఏర్పాటు చేయకుండా చూడాలని ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ అధికారులను ఆదేశించారు. ఇప్పటి వరకు రాష్ట్రంలోని మతపరమైన ప్రదేశాల నుంచి లక్షకు పైగా లౌడ్ స్పీకర్లను తొలగించడం గమనార్హం. శనివారం ఝాన్సీలో అభివృద్ధి, శాంతిభద్రతల పురోగతిపై ఆయన సీఎం సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశంలో యోగి ఆదిత్యనాత్ లౌడ్ స్పీకర్ల అంశాన్ని లేవనెత్తారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మత పరమైన కార్యక్రమాలను ఆ ఆలయ ప్రాంగణాల్లోనే నిర్వహించాలని సూచించారు. రోడ్లపైన ర్యాలీలు, ఇంకా ఇతర ఊరేగింపులు, కార్యక్రమాలు చేపట్టకూడదని అన్నారు. సాధారణ ప్రజలకు ఈ కార్యక్రమాల వల్ల ఎలాంటి ఇబ్బంది కలగకూడదని అన్నారు. ధార్మిక ప్రాంగణాల్లో మైక్రోఫోన్లను ఉపయోగించినా.. ఆ ప్రాంగణం నుంచి శబ్దం బయటకు రాకుండా చూసుకోవాలని అన్నారు. ప్రజలకు ఎలాంటి సమస్యలు ఎదురుకాకూడదని తెలిపారు.
ఇదిలా ఉండగా మతపరమైన సంస్థల్లో లౌడ్ స్పీకర్లను తొలగించే డ్రైవ్ ఏప్రిల్ 25వ తేదీన ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ప్రారంభించింది. ఇది మే 1వ తేదీ వరకు కొనసాగింది. ఇందులో నిబంధనలకు అనుగుణంగా లేని లౌడ్ స్పీకర్లను తొలగించింది. దీంతో పాటు కొన్ని లౌడ్ స్పీకర్ల వాల్యూమ్ ను సెట్ చేసింది. కాగా సీఎం నిర్వహించిన సమీక్షలో అదనపు డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (లా అండ్ ఆర్డర్) ప్రశాంత్ కుమార్ మాట్లాడారు. హైకోర్టు ఆదేశాలకు లోబడి వివక్ష లేకుండా అన్ని మతపరమైన ప్రదేశాల నుంచి అనధికార లౌడ్ స్పీకర్లను తొలగించామని తెలిపారు.
యూపీలో లౌడ్ స్పీకర్ల తొలగింపు ప్రక్రియపై మహారాష్ట్ర నవనిర్మాణ్ సేన (ఎంఎన్ఎస్) చీఫ్ రాజ్ ఠాక్రే గత వారం స్పందించారు. యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ చర్యలను ప్రశంసించారు. ‘‘ మతపరమైన ప్రదేశాల నుంచి ముఖ్యంగా మసీదుల నుంచి లౌడ్ స్పీకర్లను తొలగించినందుకు యోగి ప్రభుత్వానికి హృదయపూర్వక అభినందనలు, కృతజ్ఞతలు తెలుపుతున్నాను’’ అని రాజ్ ఠాక్రే ట్వీట్ చేశారు. మహారాష్ట్ర ప్రభుత్వంలో యోగులు లేరని కేవలం భోగులు ఉన్నారని అన్నారు.
ఇటీవల చర్చలోకి వచ్చిన లౌడ స్పీకర్ల వివాదానికి కూడా రాజ్ ఠాక్రే కేంద్ర బిందువుగా నిలిచారు. మసీదుల వద్ద ఆజాన్ కోసం ఏర్పాటు చేసిన లౌడ్ స్పీకర్ల అంశాన్ని తెరమీదకు తీసుకొచ్చారు. లౌడ్ స్పీకర్లను తొలగించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. లౌడ్ స్పీకర్ల సమస్య మతపరమైనది కాదని, అది ప్రజల సమస్య అని థాకరే అన్నారు. ఔరంగాబాద్‌లో జరిగిన ర్యాలీలో ఆయన ఈ విధంగా వ్యాఖ్యలు చేశారు. మే 3వ తేదీ నాటికి లౌడ్ స్పీకర్లను తొలగించాలని పలు సందర్భాల్లో ఆయన డిమాండ్ చేశారు. లేకపోతే హిందువులు ఈ ధార్మిక ప్రదేశాల్లో హనుమాన్ చాలీసాను పారాయణం చేస్తారని తెలిపారు. ఈ లౌడ్ స్పీకర్ల వివాదం ఒక రాష్ఠ్రం నుంచి మరో రాష్ట్రానికి పాకింది.