
వాహనదారులకు కేంద్ర ప్రభుత్వం కాస్త ఊరటనిచ్చింది. వాహనాల తనిఖీ సమయంలో పోలీసులకు ఒరిజినల్ సర్టిఫికేట్స్ చూపించాల్సిన అవసరం లేదని కేంద్ర ప్రభుత్వం తాజాగా స్పష్టం చేసింది.
ఇప్పటి వరకు ట్రాఫిక్ పోలీసులు.. వాహనదారులను కేవలం ఒరిజినల్స్ మాత్రమే చూపించాలని ఒత్తిడి చేసేవారు. అయితే.. ఇక నుంచి అలా ఒత్తిడి చేయడానికి లేదని కేంద్ర పభుత్వం తెలిపింది.
వీటికి బదులుగా డిజీలాకర్ లేదా ఎంపరివాహన్ లాంటి ప్రభుత్వ యాప్‌ల ద్వారా పొందిన ఎలక్ట్రానిక్ ధ్రువపత్రాలు కూడా చెల్లుబాటవుతాయని తెలిపింది. వాహనదారులు ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘనలకు పాల్పడిన సమయంలో అసలు పత్రాలు లేకపోతే మొబైల్ సాయంతో సెంట్రల్ డేటాబేస్‌లోకి లాగిన్ అయి క్యూఆర్ కోడ్‌ను రికార్డుచేయాలని సూచించింది.
సిగ్నల్స్ జంపింగ్, వేగంగా వాహనం నడపడం, డ్రైవింగ్ చేస్తూ ఫోన్ మాట్లాడటం లాంటి ట్రాఫిక్ నిబంధనల ఉల్లంఘనలకు పాల్పడిన సమయంలో వాహనదారులు డ్రైవింగ్ లైసెన్స్‌లు, ఆర్సీలను పోగొట్టుకుంటారు.అనేక సందర్భాల్లో వాహనదారులు పోగొట్టుకున్న పత్రాలను గుర్తించడంలో రవాణా శాఖ విఫలమైనట్టు ఫిర్యాదులు అందుతున్నాయి. దీంతో కేంద్ర తాజాగా కొత్త నిబంధనలను తీసుకొచ్చింది.
దీనికి సంబంధించి అన్ని రాష్ట్రాలకు సూచనలు చేసింది. కేంద్ర ఉపరితల రవాణా మంత్రిత్వ శాఖ తాజా నిబంధనల ప్రకారం.. వాహనం నడిపేవారు ట్రాఫిక్ ఉల్లంఘనలకు పాల్పడినప్పుడు ఒరిజనల్ ధ్రువపత్రాలను అవసరం లేకుండా వాహన్, సారథి డేటాబేస్ ద్వారా వారి వివరాలను పొందవచ్చు.