
న్యూఢిల్లీ: భారత కుబేరుడు ముఖేశ్ అంబానీకి చెందిన సంస్థ త్వరలో కరోనా టీకా ట్రయల్స్ ప్రారంభించనుంది. రిలయన్స్ లైఫ్ సైన్సెస్ కరోనా టీకాను అభివృద్ధి చేస్తున్నది. రెండు డోసుల రీకాంబినెంట్ ప్రోటీన్ టీకా కోసం ప్రయోగాలు చేస్తున్నది. ఇదే తరహాలో హైదరాబాద్‌కు చెందిన బయోలాజికల్ ఈ టీకాను అభివృద్ధి చేస్తున్న సంగతి తెలిసిందే.
ఈ టీకా ట్రయల్స్‌కు అనుమతించాలని రెగ్యులేటరీకి రిలయన్స్ లైఫ్ సైన్సెస్ దరఖాస్తు చేసుకున్నది. ఈ దరఖాస్తును డీసీజీఐ నిపుణుల కమిటీ పరిశీలించింది. శుక్రవారం నాటి నిపుణుల కమిటీలో ఈ దరఖాస్తుకు ఆమోదం లభించింది. రిలయన్స్ లైఫ్ సైన్సెస్ తొలి దశ టీకా ప్రయోగాలు చేయడానికి అనుమతించాల్సిందిగా నిపుణుల కమిటీ సిఫారసు చేసింది. డీసీజీఐ అనుమతులే ఇంకా మిగిలి ఉన్నాయి. డీసీజీఐ అనుమతి లభించగానే రిలయన్స్ లైఫ్ సైన్సెస్ టీకా ట్రయల్స్ ప్రారంభించనుంది.
ఇప్పటికే రిలయన్స్ లైఫ్ సైన్సెస్ టీకా ట్రయల్స్ కోసం రంగం సిద్ధం చేసుకుంది. దేశవ్యాప్తంగా పది చోట్ల ట్రయల్స్ చేపట్టనుంది. ఇందులో తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, ఢిల్లీలు ఉన్నాయి. మనదేశంలో అత్యవసర వినియోగ అనుమతులు పొందిన కరోనా టీకాలు మొత్తం ఆరు ఉన్నాయి. జైదూస్ అభివృద్ధి చేసిన జైకోవ్ డీ, సీరం ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియా టీకా కొవిషీల్డ్, హైదరాబాద్‌కు చెందిన భారత్ బయోటెక్ టీకా కొవాగ్జిన్, రష్యాకు చెందిన స్పుత్నిక్ వీ, అమెరికా టీకాలు మొడెర్నా, జాన్సన్ అండ్ జాన్సన్ టీకాలకు భారత ప్రభుత్వం అత్యవసర వినియోగానికి అనుమతులు ఇచ్చింది.