
దేశ రాజకీయాలను పరిశీలిస్తే కొన్ని ఆసక్తికర అంశాలు కనిపిస్తుంటాయి. ముఖ్యంగా ప్రాంతీయ పార్టీలలో.. బాధ్యతల పంపిణీలో ఎక్కువగా పార్టీ అధినేతల కుటుంబ సభ్యులకే ప్రాముఖ్యత లభిస్తుంది. టీఆర్ఎస్, టీడీపీ, డీఎంకే, ఎన్సీపీ, శివసే, జేడీఎస్.. పార్టీల్లో వారసులు, కుటుంబ సభ్యులదే హవా కనిపిస్తుంది. అయితే పార్టీ బాధ్యతల పంపిణీ విషయాన్ని పరిశీలిస్తే.. టీఆర్ఎస్, డీఎంకే, ఎన్సీపీలలో ఒక్క అంశం కామన్‌గా కనిపిస్తుంది. జాతీయ స్థాయిలో చెల్లెళ్లు పార్టీ కోసం పనిచేస్తే.. అన్నలు రాష్ట్రంలో పార్టీ కీలక బాధ్యతలను నిర్వర్తిస్తున్నారు.
కవిత- కేటీఆర్..
గులాబీ పార్టీ అధినేత కేసీఆర్.. తన కొడుకు కేసీఆర్‌ను రాష్ట్ర స్థాయిలో కీలక బాధ్యతలు అప్పగించగా, కవిత జాతీయ స్థాయిలో ఉండేలా ప్లాన్ చేశారు. ఈ క్రమంలోనే గతంలో ఎంపీగా ఉన్న కవిత.. ఢిల్లీలో టీఆర్ఎస్ పార్టీ వాయిస్ వినిపించేవారు. అయితే 2019లో కవిత ఎంపీగా ఓడిపోయారు. దీంతో ఆమె కొద్ది రోజుల పాటు ఢిల్లీ వైపు చూడలేదు. ఆ తర్వాత ఎమ్మెల్సీగా ఎన్నికైన కవిత.. ప్రస్తుతం కేసీఆర్ జాతీయ స్థాయిలో ప్రత్యామ్నాయ కూటమి కోసం చేస్తున్న ప్రయత్నాల్లో కీలకంగా వ్యవహరిస్తున్నారు.
ఇప్పటికే కేసీఆర్ జాతీయ స్థాయిలో పలు పార్టీల నేతలతో జరుపుతున్న చర్చల సందర్భంగా, ఢిల్లీ పర్యటనల సందర్భంగా.. కవిత కీలకంగా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే. ఎంపీగా పనిచేసిన సమయంలో ఆమెకు వివిధ పార్టీల నాయకులతో ఉన్న పరిచయాలను ఈ సందర్భంగా కవిత వినియోగించుకుంటున్నారు. ఇక, తాజాగా జాతీయ రాజకీయ వ్యవహారాల కమిటీని ఏర్పాటు చేసుకున్న టీఆర్ఎస్ పార్టీ.. ఆ కమిటీకి అధ్యక్షురాలిగా ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత నియమించారు. దీంతో మరోసారి టీఆర్ఎస్ తరఫున కవిత.. ఢిల్లీ వ్యవహారాల్లో కీలకంగా వ్యవహరించనునున్నారు.
మరోవైపు టీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా, ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రిగా కేటీఆర్ తన బాధ్యతల్లో దూసుకుపోతున్నారు. మంత్రిగా రాష్ట్రానికి పెట్టుబడులను ఆకర్షించడంలో.. వర్కింగ్ ప్రెసిడెంట్‌గా టీఆర్ఎస్ పార్టీ కార్యక్రమాల్లో తనదైన ముద్ర వేస్తున్నారు. ఈ విధంగా రాష్ట్ర స్థాయిలో కేటీఆర్ కీలకంగా వ్యవహరిస్తున్నారు. కొంతకాలంగా కేటీఆర్ ముఖ్యమంత్రిగా చేయనున్నారనే ప్రచారం కూడా జరిగింది. కానీ అది కార్యరూపం దాల్చలేదు. అయితే ఇప్పుడు కేసీఆర్ దేశ రాజకీయాలపై పూర్తిగా దృష్టి సారిస్తే.. రాష్ట్రంలో పార్టీ వ్యవహారాలు మొత్తం కేసీఆర్ పర్యవేక్షణలో కేటీఆర్ చూసుకునే చాన్స్ ఉంది.
కనిమొళి- స్టాలిన్
తమిళనాడులోని డీఎంకే దాదాపు 50 ఏళ్ల పాటు మాజీ ముఖ్యమంత్రి, దివంగత కరుణానిధి నాయకత్వంలో కొనసాగింది. ప్రస్తుతం కరుణానిధి కుమారుడు స్టాలిన్ పార్టీ అధ్యక్షునిగా ఉన్నారు. డీఎంకే అధినేతగా కరుణానిధి ఉన్న సమయంలో కొడుకు స్టాలిన్ రాష్ట్రంలో కీలకంగా వ్యవహరించగా.. కూతురు కనిమొళి జాతీయ స్థాయిలో పార్టీ ఫేస్‌గా నిలిచారు. చాలా కాలం పాటు రాజ్యసభ సభ్యురాలుగా ఉన్న కనిమొళి.. యూపీఏ హయాంలో డీఎంకే తరఫున చాలా కీలకంగా వ్యవహరించారు. కనిమొళి 2019 ఎన్నికల్లో Thoothukkudi లోక్‌సభ నియోజకవర్గం నుంచి ఎంపీగా విజయం సాధించారు.
అదే సమయంలో రాష్ట్రంలో పార్టీ తరఫున స్టాలిన్ కీలక బాధ్యతలు చేపడుతూ.. అంచెలంచెలుగా ఎదిగారు. తన సోదరుడు అళగిరి పార్టీలో ఉన్నప్పటికీ.. స్టాలిన్ తనకంటూ ప్రత్యేక గుర్తింపును సొంతం చేసుకన్నారు. మంత్రిగా, డిప్యూటీ సీఎంగా, ప్రతిపక్షనేతగా బాధ్యతలు చేపట్టారు. ప్రస్తుతం తమిళనాడు ముఖ్యమంత్రిగా స్టాలిన్ ఉన్నారు. అయితే కరుణానిధి మరణానంతరం.. కనిమొళి, స్టాలిన్ మధ్య విభేదాలు చోటుచేసుకున్నట్టుగా వార్తలు వచ్చాయి. అయితే వాటిని కనిమొళి ఖండించారు.
సుప్రియా సూలే - అజిత్ పవార్
మాజీ కేంద్ర మంత్రి, మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి శరద్ పవార్ నేతృత్వంలోని ఎన్సీపీలో కూడా ఇదే రకమైన విధానం కొనసాగుతుంది. శరద్ పవార్ కూతురు సుప్రియా సూలే జాతీయ స్థాయిలో ఎన్సీపీలో కీలకంగా వ్యవహరిస్తున్నారు. పార్లెమెంట్ సభ్యురాలిగా ఉన్న ఆమె.. అనేక అంశాలపై ఎన్సీపీ వాయిస్‌ను బలంగా వినిపిస్తారు. శరద్ పవార్ కూతురుగా ఆమెకు పలు పార్టీల నాయకులతో మంచి పరిచయాలు ఉన్నాయి. అంతేకాకుండా ఆమె తన వ్యవహార శైలితో కూడా తనకంటూ ప్రత్యేక గుర్తింపును సొంతం చేసుకున్నారు.
రాష్ట్రంలో ఎన్సీపీ వ్యవహారాల్లో శరద్ పవార్ సోదరుడు అనంత్‌రావ్ పవార్ కొడుకు అజిత్ పవార్ కీలకంగా వ్యవహరిస్తారు. ఎన్సీపీ తీసుకునే నిర్ణయాల్లో, ఎన్నికల సమయంలో వ్యుహాలు రచించడంలో అజిత్ పవార్ కీలకంగా వ్యవహరించారు. 1999-2014 వరకూ కాంగ్రెస్-ఎన్సీపీ సంకీర్ణ సర్కార్ హయాంలో రెండు సార్లు డిప్యూటీ సీఎంగా పనిచేశారు. సుప్రియా సూలే పార్టీలో యాక్టివ్ కాకముందు శరద్ పవార్‌కు రాజకీయ వారసుడిగా అజిత్ పవార్ మాత్రమే కనిపించారు. అయితే సుప్రియా ఎంట్రీ ఇచ్చినప్పటికీ.. ఆమె ఎంపీగా జాతీయ స్థాయిలో పార్టీ వాయిస్ వినిపిస్తున్నారు. అజిత్ పవార్ రాష్ట్రంలో పార్టీ వ్యవహారాల్లో కీలకంగా వ్యవహరిస్తున్నారు.
అయితే మహారాష్ట్రలో 2019లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల తర్వాత చోటుచేసుకున్న పరిణామాల్లో అజిత్ పవార్ వ్యవహారం కలకలం రేపింది. ఆయన బీజేపీతో కలిపి డిప్యూటీ సీఎంగా బాధ్యతలు చేపట్టడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. అయితే ఆ తర్వాత చోటుచేసుకున్న శివసేన-కాంగ్రెస్-ఎన్సీపీ సంకీర్ణ కూటమి ప్రభుత్వం ఏర్పాటైన క్రమంలో అజిత్ పవార్ తిరిగి ఎన్సీపీ గూటికి చేరారు. ప్రస్తుతం మహారాష్ట్ర డిప్యూటీ సీఎంగా కొనసాగుతున్నారు. అయితే అజిత్ పవార్ బీజేపీ వైపు వెళ్లడాన్ని కొందరు శరద్ పవార్ ప్లానింగేనని నమ్ముతారు.
ఇక, ఎన్సీపీలో సీనియర్ నాయకులు ఉన్నప్పటికీ.. పార్టీ అభ్యర్థుల ఎంపికతో పాటు, ప్రణాళికలు రచించడంలో అజిత్ పవార్‌దే కీలకంగా వ్యహరిస్తుంటారని పార్టీ వర్గాలు చెబుతాయి. ఇలా జాతీయ స్థాయిలో సుప్రియా సూలే, రాష్ట్రంలో అజిత్ పవార్ ఎన్సీపీ తరఫున కీలకంగా వ్యవహిరిస్తున్నారు.