Maharashtra Political Crisis: రెబల్ ఎమ్మెల్యేల పిటిషన్లపై సుప్రీంకోర్టు విచారణ.. టాప్ 5 పాయింట్స్ ఇవే

By Mahesh KFirst Published Jun 27, 2022, 7:02 PM IST
Highlights

రెబల్ ఎమ్మెల్యేలు ఏక్‌నాథ్ షిండే వర్గం దాఖలు చేసిన పిటిషన్లను సుప్రీంకోర్టు విచారించింది. రెబల్ ఎమ్మెల్యేలకు డిప్యూటీ స్పీకర్ పంపిన అనర్హత నోటీసులపై ఊరట ఇచ్చింది. విచారణను వచ్చే నెల 11వ తేదీకి వాయిదా వేసింది.
 

న్యూఢిల్లీ: మహారాష్ట్ర ప్రభుత్వం ప్రస్తుతం  సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నది. కొందరు శివసేన ఎమ్మెల్యేలు ఏక్‌నాథ్ షిండే సారథ్యంలో తిరుగుబాటు చేయడంతో ఉద్ధవ్ ఠాక్రే ప్రభుత్వం ఇరకాటంలో పడింది. అయితే, తిరుగుబాటుదారులపై చర్యలకు ఉపక్రమించింది. ఇందులో భాగంగానే ఏక్‌నాథ్ షిండే సహా 16 మందికి డిప్యూటీ  స్పీకర్ నరహరి జిర్వాల్ అనర్హత నోటీసులు పంపారు. ఈ రోజు సాయంత్రం 5.30 గంటల లోపు వివరణ ఇవ్వాలని, లేదంటే నిబంధనల ప్రకారం చర్యలు తీసుకుంటానని డిప్యూటీ స్పీకర్ నోటీసులు పంపారు. ఈ నోటీసులను సవాల్ చేస్తూ ఏక్‌నాథ్ షిండే వర్గం సుప్రీంకోర్టును ఆశ్రయించింది.

తమకు నోటీసులు పంపిన డిప్యూటీ స్పీకర్ నరహరి జిర్వాల్‌ను తొలగించే తీర్మానం ఇంకా పెండింగ్‌లో ఉన్నదని, ముందు ఆయన తొలగింపుపై నిర్ణయం ఖరారు అయ్యే వరకు తమపై చర్యలు తీసుకోకుండా ఆదేశించాలని వారు అత్యున్నత న్యాయస్థాన్ని కోరారు. ఈ పిటిషన్‌పై జస్టిస్ సూర్యకాంత్, జేబీ పర్దివాలాతో కూడిన వెకేషన్ బెంచ్ విచారించింది. ఈ తీర్పుకు సంబంధించిన టాప్ 5 పాయింట్స్ ఇలా ఉన్నాయి.

1. ఏక్‌నాథ్ షిండే వర్గానికి సుప్రీంకోర్టు ఉపశమనం ఇస్తూ.. అనర్హత నోటీసులకు వివరణ గడువును జులై 12వ తేదీ సాయంత్రం 5.30 గంటల వరకు పొడిగింది.

2. రెబల్ క్యాంప్ వాదనలకు అనుగుణంగా.. డిప్యూటీ స్పీకర్ వీరిపై చర్యలు తీసుకోవడానికి చట్టబద్ధుడై ఉన్నాడా? అనే విషయాన్ని తాము నిర్ధారిస్తామని తెలిపింది.

3. మహారాష్ట్ర అసెంబ్లీలో బల నిరూపణ ఉండరాదని మహారాష్ట్ర ప్రభుత్వం వాదించింది. సుప్రీంకోర్టు ఈ విషయానికీ సానుకూలమైన వ్యాఖ్యలే చేసింది. అయితే, మధ్యంతర ఆదేశాలేమీ వెలువరించకపోయినా.. ఒక వేళ ఎవరైనా ఫ్లోర్ టెస్టుకు డిమాండ్ చేస్తే సుప్రీంకోర్టును ఆశ్రయించవచ్చని పేర్కొంది.

4. మరో పిటిషన్‌లో ఏక్‌నాథ్ షిండే వర్గం తమ ఆస్తులు, ప్రాణాలకు, కుటుంబ సభ్యులకు ముప్పు ఉన్నదని పేర్కొనగా.. రెబల్ శివసేన ఎమ్మెల్యేలు, వారి కుటుంబ సభ్యుల ప్రాణాలు, స్వేచ్ఛ, ఆస్తులను కాపాడే బాధ్యత మహారాష్ట్ర ప్రభుత్వానిదేనని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది.

5. ఈ మేరకు మహారాష్ట్ర డిప్యూటీ స్పీకర్ నరహరి జిర్వాల్, చీఫ్ విప్ సునీల్ ప్రభు, పార్టీ శాసనసభా పక్ష నేత అనిల్ చౌదరి, కేంద్ర ప్రభుత్వానికి సుప్రీంకోర్టు నోటీసులు పంపింది. ఈ విచారణను జులై 11వ తేదీకి వాయిదా వేసింది. వీటిపై ఏమైనా కౌంటర్లు దాఖలు చేయాలనుకుంటే.. ఐదు రోజుల్లోపు వేయవచ్చని సుప్రీంకోర్టు రెస్పాండెంట్లకు అవకాశం ఇచ్చింది.

click me!