బీజేపీతో పొత్తు పెట్టుకోండి.. ఎన్సీపీ-కాంగ్రెస్‌లకు మేం వ్యతిరేకం: సీఎం ఠాక్రేకు రెబల్ మినిస్టర్ అల్టిమేటం

By Mahesh KFirst Published Jun 21, 2022, 8:37 PM IST
Highlights

గుజరాత్‌లో క్యాంప్ పెట్టిన శివసేన ఎమ్మెల్యేలతో సీఎం ఉద్ధవ్ ఠాక్రే ఫోన్‌లో మాట్లాడినట్టు విశ్వసనీయవర్గాలు తెలిపాయి. శివసేన.. బీజేపీతో పొత్తుపెట్టుకోవాలని, ఎన్సీపీ, కాంగ్రెస్‌లతో జట్టు కట్టడాన్ని తాము వ్యతిరేకిస్తున్నామని రెబల్ మినిస్టర్... సీఎం ఠాక్రేకు స్పష్టం చేసినట్టు తెలిసింది. బీజేపీతో పొత్తు పెట్టుకోకుంటే శివసేనలో చీలిక వస్తుందని, నిర్ణయం ఉద్ధవ్ చేతిలోనే ఉన్నదని అల్టిమేటం విధించినట్టు సమాచారం.

ముంబయి: మహారాష్ట్రలో పొలిటికల్ హైడ్రామా ఇంకా కొనసాగుతూనే ఉన్నది. మహా వికాస్ అఘాదీ సర్కారును ధిక్కరిస్తూ కొంత మంది రెబల్ ఎమ్మెల్యేలు బీజేపీ పాలిత గుజరాత్‌లో క్యాంప్ పెట్టారు. రాష్ట్ర మంత్రి ఏక్‌నాథ్ షిండే సారథ్యంలో మొత్తం 22 మంది ఎమ్మెల్యేలు సూరత్‌లోని ఓ హోటల్‌లో ఉన్నట్టు సమాచారం. తాజాగా, ఆ తిరుగుబాటు ఎమ్మెల్యేలతో సీఎం ఉద్ధవ్ ఠాక్రే ఫోన్‌లో మాట్లాడినట్టు తెలిసింది. ఆ ఫోన్ సంభాషణలో సీఎం ఠాక్రేకు రెబల్ మినిస్టర్ అల్టిమేటం విధించినట్టు తెలుస్తున్నది.

శివసేన లీడర్ మిలింద్ నర్వేకరర్ గుజరాత్‌కు వెళ్లి రెబల్ ఎమ్మెల్యేలతో మంగళవారం సమావేశం అయినట్టు కొన్ని వర్గాలు తెలిపాయి. సుమారు రెండు గంటల పాటు ఆయన ఏక్‌నాథ్ షిండేతో మాట్లాడారు. అదే సమయంలో సీఎం ఉద్ధవ్ ఠాక్రేతో ఫోన్‌లో మాట్లాడించినట్టు తెలిసింది.

సీఎం ఉద్ధవ్ ఠాక్రేతో ఏక్‌నాథ్ షిండే ఫోన్‌లో మాట్లాడుతూ, తనతో 35 మంది ఎమ్మెల్యేలు ఉన్నారని తెలిపారు. ఉద్ధవ్ ఠాక్రే బీజేపీతో పొత్తు పెట్టుకుంటే శివసేనలో చీలిక ఉండదని సున్నితంగా హెచ్చరించినట్టు సమాచారం. తాను సీఎం పోస్టు మీద కన్నేయలేదని, కాబట్టి తనపై యాక్షన్ తీసుకోవడం సరికాదని ఏక్‌నాథ్ షిండే.. సీఎం ఉద్ధవ్ ఠాక్రేతో చెప్పినట్టు ఆ వర్గాలు వివరించాయి. అంతేకాదు, తనకు వ్యతిరేకంగా శివసేన కార్యకర్తలు నిరసనలు చేయడంపైనా ఆయన తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసినట్టు తెలిసింది.

కాగా, శివసేన నేతలను, కార్యకర్తలను బీజేపీ వేధిస్తున్నదని ఉద్ధవ్ ఠాక్రే.. ఏక్‌నాథ్ షిండేతో తెలిపినట్టు ఇండియా టుడే కథనం పేర్కొంది. బీజేపీతో పొత్తు అసాధ్యం అని సంకేతాలు ఇస్తూ.. గతంలోనూ బీజేపీ.. శివసేనను సరిగా చూసుకోలేదని, అవమానిస్తూ వచ్చిందని ఠాక్రే తెలిపారు. ఇందుకు సమాధానంగా.. తాము శివసేన.. బీజేపీతో జట్టు కట్టాలని భావిస్తున్నామని ఏక్‌నాథ్ షిండే స్పష్టం చేసినట్టు తెలిసింది. ఎన్సీపీ, కాంగ్రెస్‌లతో శివసేన పొత్తు పెట్టుకోవడాన్ని తాము వ్యతిరేకిస్తున్నామని సీఎంకు చెప్పారు. అంతేకాదు, నిర్ణయం సీఎం ఉద్ధవ్ ఠాక్రే చేతిలోనే ఉన్నదని అల్టిమేటం విధించినట్టు ఆ వర్గాలు తెలిపాయి.

click me!