Maharashtra: నిజ‌మైన ప్ర‌తిప‌క్షం కాంగ్రెస్‌, ఎన్సీపీలే.. శివ‌సేన రెబ‌ల్ ఎమ్మెల్యేలు.. !

By Mahesh RajamoniFirst Published Jun 23, 2022, 3:53 PM IST
Highlights

Maharashtra political crisis: మహారాష్ట్ర రాజకీయ సంక్షోభం మ‌రింత‌గా ముదిరింది. శివ‌సేన నుంచి బ‌య‌ట‌కు వ‌చ్చి ప్ర‌భుత్వాన్ని మైనార్టీలోకి ప‌డేసిన ఏక్‌నాథ్ షిండే వ‌ర్గంలో చేరుతున్న ప‌లువురు ఎమ్మెల్యేలు మాట్లాడుతూ.. రాష్ట్రంలో నిజ‌మైన ప్ర‌తిప‌క్షాలు ఎన్‌సీపీ, కాంగ్రెస్ లేన‌ని పేర్కొంటున్నారు. 
 

Maharashtra political crisis: మహారాష్ట్ర రాజ‌కీయాలు ప్ర‌స్తుతం దేశవ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారాయి. శివ‌సేన‌, కాంగ్రెస్‌, ఎన్సీపీల‌తో కూడిన సంకీర్ణ ప్ర‌భుత్వాన్ని ప‌డ‌గొట్ట‌డానికి కేంద్రంలోని బీజేపీ స‌ర్కారు చేసిన కుట్ర‌గా ప్ర‌తిప‌క్ష పార్టీల‌తో పాటు దేశంలోని అన్ని వ‌ర్గాలు ఇదే అభిప్రాయాన్ని వ్య‌క్తం చేస్తున్నాయి. బీజేపీపై విమ‌ర్శ‌లు వెల్లువెత్తుతున్నాయి. ఈ క్ర‌మంలోనే మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే తిరుగుబాటుకు దారితీసిన కారణాలను జాబితా చేసిన శివసేన తిరుగుబాటు ఎమ్మెల్యే ఏక్‌నాథ్ షిండే బహిరంగ లేఖను విడుదల చేశారు. ఆదిత్య ఠాక్రేతో కలిసి అయోధ్య పర్యటనకు వచ్చిన శాసనసభ్యులను పార్టీ హైకమాండ్ అడ్డుకున్నదని ఎమ్మెల్యే లేఖలో పేర్కొన్నారు. కాంగ్రెస్, ఎన్సీపీని నిజమైన ప్రతిపక్షం అని పిలిచిన ఎమ్మెల్యే, రెండు పార్టీల నాయకులు ఠాక్రేను క‌ల‌వ‌చ్చ‌నీ,  అయితే సేన ఎమ్మెల్యేలు అందుకు సిద్ధంగా ఉండ‌రంటూ చెప్పుకొచ్చారు. శివసేన నాయ‌కుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పటికీ ఎమ్మెల్యేలు, నాయ‌కులు, కార్య‌క‌ర్త‌లు ముఖ్యమంత్రి అధికారిక బంగ్లా వర్షను సందర్శించే అవకాశం లేదని పేర్కొన్నారు. 

హిందూత్వ, రామమందిరం పార్టీకి కీలకమైన అంశాలు అయినప్పుడు, పార్టీ మమ్మల్ని అయోధ్యకు వెళ్లకుండా ఎందుకు అడ్డుకుంది? అని ప్ర‌శ్నించారు. ఆదిత్య ఠాక్రే పర్యటన సందర్భంగా ఎమ్మెల్యేలను పిలిచి అయోధ్యకు వెళ్లకుండా అడ్డుకున్నారు అని లేఖలో రాశారు. ఎన్సీపీ, కాంగ్రెస్‌ల నాయకులు, కార్యకర్తలు ఠాక్రేను కలిసే అవకాశం ఉండేదని ఆయన పేర్కొన్నారు. "మేము ముఖ్య‌మంత్రిని  కలవలేకపోయినా, మా 'అసలు ప్రతిపక్షం' నుండి ప్రజలు..  కాంగ్రెస్, ఎన్సీపీ ఆయనను కలిసే అవకాశాలను పొందారు. వారి నియోజకవర్గాలలో పనికి సంబంధించిన నిధులు కూడా వారికి ఇవ్వబడ్డాయి" అని పేర్కొన్నారు. ఠాక్రేను ఎవరు కలవాలో చుట్టుపక్కల ప్రజలు నిర్ణయిస్తారని చెప్పారు. ‘‘రాష్ట్రంలో శివసేన సీఎం ఉన్నప్పటికీ, ఆ పార్టీ ఎమ్మెల్యేలకు వర్ష బంగ్లా (సీఎం నివాసం) వెళ్లే అవకాశం రాలేదు. సీఎం చుట్టూ ఉన్నవాళ్లు ఆయనను కలవాలా వద్దా అని నిర్ణయించుకునేవారు. మమ్మల్ని అవమానించారని భావించారు" అని అన్నారు.

శివసేన సైద్ధాంతికంగా కాంగ్రెస్, ఎన్సీపీతో బంధాన్ని తెంచుకునీ, బీజేపీతో పొత్తు పెట్టుకోవాలని ఉద్ధవ్ ఠాక్రేను ఏక్నాథ్ షిండే డిమాండ్ చేశారు. దాదాపు 40 మంది ఎమ్మెల్యేలతో కలిసి ఆయన అసోంలో గౌహతిలో క్యాంప్‌ చేస్తున్నారు. తిరుగుబాటు ఎమ్మెల్యేలు తనను కలసి కోరితే ముఖ్యమంత్రి పదవికి, శివసేన అధ్యక్ష పదవికి రాజీనామా చేసేందుకు సిద్ధమని థాకరే బుధవారం చెప్పారు. అతను తన అధికారిక నివాసం వర్ష నుండి ప్రైవేట్ బంగ్లా మాతోశ్రీకి మారాడు. గురువారం ఉదయం గౌహతిలో శివసేన నాయకుడు ఏక్‌నాథ్ షిండే నేతృత్వంలోని ఎమ్మెల్యేల రెబల్ గ్రూపులో మరో ముగ్గురు శివసేన ఎమ్మెల్యేలు చేరారు. ఇతర ఎమ్మెల్యేలు ప్రచారం నిర్వహిస్తున్న గౌహతిలోని రాడిసన్ బ్లూ హోటల్‌కు చేరుకున్నారు. నిన్న రాత్రి గౌహతిలో మరో నలుగురు ఎమ్మెల్యేలు షిండేతో కలిసి వచ్చారు. దీంతో గత 24 గంటల్లో రెబల్‌ గ్రూపులో చేరిన ఎమ్మెల్యేల సంఖ్య ఏడుకు చేరింది. రెబల్ గ్రూప్ లో చేరుతున్న శివసేన నాయకుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. 

click me!