
టీమిండియా క్రికెటర్ రవీంద్ర జడేజా సతీమణి రివబా జడేజా గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తున్న సంగతి తెలిసిందే. జామ్ నగర్ నార్త్ నుంచి బీజేపీ తరపున ఆమె బరిలో నిలిచారు. దీనిలో భాగంగా సోమవారం రివబా నామినేషన్ దాఖలు చేశారు. ఈ సందర్భంగా రవీంద్ర జడేజా ఆమె పక్కనే వున్నారు. తన భార్య ఖచ్చితంగా ఎమ్మెల్యేగా గెలుస్తుందని.. రివబాకు ప్రజాసేవ అంటే ఇష్టమని, అందుకే రాజకీయాల్లోకి అడుగుపెడుతున్నారని జడేజా అన్నారు. తన భార్యకు ఓటేయాలని ఆయన విజ్ఞప్తి చేశారు. మరోవైపు ఇదే జామ్ నగర్ నార్త్ నుంచి జడేజా కుటుంబానికి చెందిన మరో వ్యక్తి పోటీపడతారని వార్తలు వెలువడుతున్నాయి. ఆయన సోదరి నైనా జడేజా కాంగ్రెస్ పార్టీ తరపున బరిలో దిగుతారని కథనాలు వెలువడుతున్నాయి. ప్రస్తుతం కాంగ్రెస్ జిల్లా అధ్యక్షురాలిగా వున్నారు నైనా జడేజా.
ఇకపోతే.. ఈ ఏడాది డిసెంబర్‌లో జరగనున్న గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి తమ పార్టీ అభ్యర్థుల తొలి జాబితాను బీజేపీ గురువారం ప్రకటించిన సంగతి తెలిసిందే. 100 మంది పేర్లతో కూడిన జాబితాను కేంద్ర మంత్రి భూపేంద్ర యాదవ్ ప్రకటించారు. ఈ జాబితాలో రివాబా జడేజా పేరు కూడా ఉంది. ఆమె జామ్‌నగర్ నార్త్ నుంచి బీజేపీ తరఫున బరిలో నిలవననున్నారు. ఈ స్థానంలో ప్రస్తుతం బీజేపీకే చెందిన ధర్మేంద్రసింగ్ జడేజా ఉన్నారు. అయితే ఈ సారి ఆ స్థానం నుంచి రివాబా జడేజాను బీజేపీ బరిలో నిలపాలని నిర్ణయం తీసుకుంది.
కాంగ్రెస్ నాయకుడు హరి సింగ్ సోలంకికి బంధువైన రివాబా.. 2016లో రవీంద్ర జడేజాను పెళ్లి చేసుకున్నారు. ఆమె 2019లో బీజేపీలో చేరారు. ప్రత్యక్ష రాజకీయాల్లో యాక్టివ్‌గా ఉంటూ వస్తున్నారు. రాజ్‌పుత్‌ల అనుబంధ సంస్థ కర్ణి సేనలో ఆమె క్రియాశీలకంగా పనిచేస్తున్నారు. గుజరాత్‌లో కీలకంగా ఉండే కుల సమీకరణాల దృష్ట్యా రాజ్‌పుత్ వర్గం ఓట్లను ఆకర్షించడానికి రివాబాకు బీజేపీ టికెట్ ఇచ్చి ఉంటుందని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.
ALso REad:రవీంద్ర జడేజా భార్య రివాబాకు బీజేపీ ఎమ్మెల్యే టికెట్.. ఆమె ఎక్కడి నుంచి పోటీ చేయనున్నారంటే..
ఇదిలా ఉంటే.. గుజరాత్ ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్.. ఘట్లోడియా నియోజకవర్గం నుంచి, పాటిదారు ఉద్యమ నేత హార్దిక్ పటేల్.. విరాంగ్రామ్ నియోజకవర్గం నుంచి బరిలో నిలువనున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో తాము పోటీ చేయబోమని మాజీ ముఖ్యమంత్రి విజయ్ రూపానీ, పార్టీ సీనియర్ నేత భూపేంద్రసింగ్ చుడాసమా ప్రకటించిన సంగతి తెలిసిందే.
ఇక, 182 మంది సభ్యులున్న గుజరాత్ శాసనసభకు రెండు దశల్లో ఎన్నికలు జరగనున్నాయి. తొలిదశ పోలింగ్.. డిసెంబర్ 1న, రెండో దశ పోలింగ్.. డిసెంబర్ 5న జరగనుంది. రెండు దశల్లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు డిసెంబర్ 8న జరగనుంది. ఈసారి కూడా గుజరాత్‌లో విజయం సాధించి.. వరుసగా ఆరోసారి అధికారాన్ని చేపట్టాలని బీజేపీ భావిస్తోంది. కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ పార్టీలు కూడా గుజరాత్‌లో విజయమే లక్ష్యంగా ప్రణాళికలు రచిస్తున్నాయి.