దసరా వేడుకలు.. రావణుడికి నిప్పు.. రివర్స్ ఫైరింగ్ చేసిన అసురుడు (వీడియో)

By Mahesh KFirst Published Oct 6, 2022, 1:46 PM IST
Highlights

దసరా సందర్భంగా ఉత్తరప్రదేశ్‌లో  రావణుడి దహనం చేస్తుండగా అపశృతి చోటుచేసుకుంది. రావణుడు మండిపోతూనే అతనిలో నుంచి నిప్పులు ఎగిసి ప్రజలపై పడ్డాయి. దూరంగా నిలుచున్న ప్రజలపై దూసుకువచ్చిన వీడియో ఇప్పుడు వైరల్ అవుతున్నది.
 

న్యూఢిల్లీ: పది తలలతో రావణుడి విగ్రహాన్ని అయినా, కటౌట్ అయినా ఊహించుకోవడం కొంత భయంగానే ఉంటుంది. పురాణాల్లో ఆయన ఓ అసుర రాజు. సురులకు, అసురులకు మధ్య జరిగిన యుద్ధంలో వధించబడతాడు. దీన్ని ప్రజలు వేడుక చేసుకుంటారు. అసుర రావణుడి మరణాన్ని.. చెడుపై మంచి విజయంగా భావిస్తుంటారు. అందుకే దసరా సంబురాల్లో రావణాసురుడి కటౌట్ ఏర్పాటు చేసి కాల్చేయడం కొన్ని చోట్ల ఆనవాయితీగా వస్తున్నది. ఇందులో భాగంగానే ఉత్తరప్రదేశ్‌లోని ముజఫర్ నగర్‌లో బుధవారం రావణాసురుడిని దహనం చేయాలనే కార్యక్రమం తలపెట్టారు. కానీ, అందులో అపశృతి చోటుచేసుకుంది.

ముజఫర్ నగర్‌లోని ప్రభుత్వ ఇంటర్ కాలేజీలో పెద్ద రావణాసురుడి బొమ్మను ఏర్పాటు చేశారు. ఆ బొమ్మకు నిప్పు పెట్టారు. కానీ, రావణాసురుడు ఏమనుకున్నాడో.. రివర్స్‌గా ఫైరింగ్ జరిపాడు. అంటే.. ఆ నిప్పులో దహనం అయిపోవడమే కాదు.. ఆ బొమ్మ నుంచి అగ్ని కీలలు దూరంగా ఉన్న ప్రజలపైకి ఎగిరి పడ్డాయి. ఈ ఘటనతో ప్రజలు చెల్లాచెదురయ్యారు. దూరంగా ఉరికే ప్రయత్నం చేశారు. కేవలం ప్రజలే కాదు.. అక్కడ భద్రతా పరమైన ఏర్పాట్లు చూస్తున్న పోలీసులు కూడా కొన్ని క్షణాలు భయానికి లోనయ్యారు. వారు కూడా రావణాసురుడి నుంచి వస్తున్న అగ్ని నుంచి తప్పించుకోవడానికి పెనుగులాడారు.

ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నది. 

मुज़फ़्फ़रनगर में अपने को जलाए जाने से क्रुद्ध रावण ने मौक़े पर मौजूद लोगों पर अग्नि-वाण चलाए 😬 pic.twitter.com/zuDmH3dKXa

— Umashankar Singh उमाशंकर सिंह (@umashankarsingh)

రావణుడి బీభత్సం ముగియగానే.. ఓ గేదె గ్రౌండ్‌లోకి ఎంటర్ అయి వీరంగం సృష్టించింది. అయితే, అధికారులు వెంటనే అలర్ట్ అయ్యారు. ఆ పశువును మైదానం నుంచి బయటకు తీసుకెళ్లారు.

ఇలాంటి ఘటనే బుధవారం నాడు హర్యానాలోని యమునానగర్‌లోనూ చోటుచేసుకుంది. నిప్పు పెట్టిన రావణుడి బొమ్మ వీక్షకులపై కూలింది. కానీ, ఈ ఘటనలో క్షతగాత్రులు లేరని యమునా నగర్ పోలీసులు వివరించారు.

Also Read: రావ‌ణ‌ ద‌హ‌నంలో అప‌శృతి.. ఒక్క‌సారిగా కింద‌ ప‌డ్డ దిష్టిబొమ్మ.. ప‌లువురికి తీవ్రగాయాలు.. ఎక్క‌డంటే ?

అయితే, రావణాసురుడిని కొలిచేవారు కూడా ఉన్నారు. ప్రధాన స్రవంతిలో ప్రచారంలో ఉన్న కథలకు భిన్నమైన కథలనూ వారు ఆధారంగా చేసుకుని వాదిస్తుంటారు. ఒక వైపు రావణాసురుడిని దహనం చేసి వేడుకలు చేసుకుంటూ ఉండగా.. మన దేశంలోని మరికొన్ని చోట్ల ఆయనకు పూజలు చేస్తుంటారు. అందుకు ఉదాహరణ.. రావణుడు జన్మించిన ప్రాంతంగా భావించే యూపీ గ్రేటర్ నోయిడాలోని బిర్సఖ్ గ్రామంలో ప్రజలు ఆయనను పూజిస్తారు. అలాగే, ఆయన భార్య మండోదరి తమ ప్రాంతంలోనే నివసించినట్టుగా మధ్యప్రదేశ్‌లోని మందసౌర్‌‌ ప్రజలు భావిస్తారు. అందుకే మందసౌర్ అల్లుడిగా రావణుడిని కొలుస్తూ పూజలు చేస్తారు. ఈ ప్రాంతంలో పలు రావణ ఆలయాలు కూడా ఉండటం గమనార్హం. ఇంకా రాజస్తాన్‌లోని జోధ్‌పూర్, మహారాష్ట్రలోని గడ్చిరోలిలోనూ రావణుడికి భక్తులు ఉన్నారు. వాల్మీకి రామాయణంలో సీతను రావణుడు ఏ విధంగానూ గాయపరచలేదని ఉన్నదని, తులసీదాస్ రామాయణంలో మాత్రమే రావణుడిని క్రూరంగా చిత్రించారని గడ్చిరోలిలోని ఓ తెగ ప్రజలు భావిస్తారు.

click me!