
తమిళనాడు : ఎలుకల పుణ్యమా అని గంజాయి కేసులో పట్టుబడ్డ నిందితులు నిర్దోషులుగా విడుదలయ్యారు. ఈ ఘటన తమిళనాడులోని చెన్నైలో వెలుగు చూసింది. రెండేళ్ల క్రితం గంజాయి కేసులో పట్టుబడిన ఇద్దరు నిందితులని కోర్టులో హాజరు పరిచారు పోలీసులు.. అయితే వారి దగ్గర పట్టుబడిన గంజాయిలో సగానికి పైగా ఎలుకలు తినేసాయి. దీంతో పోలీసులు ఆధారాలు సమర్పించలేకపోయారు. పోలీసులు ఆధారాలు సమర్పించలేకపోయారంటూ మంగళవారం నాడు మాదకద్రవ్యాల నియంత్రణ ప్రత్యేక కోర్టు.. కేసును కొట్టివేస్తూ తీర్పును వెలువరించింది.
ఈ విచిత్రమైన ఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.. రెండేళ్ల క్రితం మెరీనా బీచ్ పరిసరాల్లో ఇద్దరు వ్యక్తులను గంజాయి విక్రయిస్తున్నారని చెప్పి పోలీసులు అరెస్టు చేశారు. మెరీనా బీచ్ పరిసరాలకు చెందిన రాజగోపాల్, నాగేశ్వరరావు లను అరెస్టు చేసిన పోలీసులు జైల్లో పెట్టారు. అప్పటి నుంచి ఈ కేసు విచారణ చెన్నై హైకోర్టు ఆవరణలో ఉన్న మాదకద్రవ్యాల నియంత్రణ ప్రత్యేక కోర్టులో విచారణ జరుగుతుంది.
వివాహేతర సంబంధం : స్నేహితుడి మేనమామ భార్యతో అక్రమసంబంధం.. ఫ్రెండ్ హత్య...
పోలీసులు కోర్టుకు సమర్పించిన చార్జిషీట్లో ఆ ఇద్దరు వ్యక్తుల నుంచి 22 కేజీల గంజాయిని పట్టుకున్నట్లుగా తెలిపారు. ఇందులో కొంత మొత్తాన్ని టెస్ట్ కోసం పంపించారు. పోలీసుల దగ్గర 21 కేజీల 900 గ్రాములను భద్రపరిచామని తెలిపారు. ఈ కేసు కోర్టులో విచారణకు వచ్చిన సమయంలో సాక్షదారాలుగా పట్టుకున్న గంజాయిని చూపించాల్సి వచ్చిన సమయంలో పోలీసులు.. మొత్తం 21 కేజీల 900 గ్రాముల గంజాయికి బదులు 11 కేజీలు మాత్రమే చూపించారు.
మిగిలిన మొత్తం ఎక్కడా? అని కోర్టు ప్రశ్నించింది. దీంతో మెరీనా బీచ్ పోలీసులు గంజాయిని ఎలుకలు తినేసినట్లుగా తెలిపారు. పోలీసులు చెప్పిన ఈ సమాధానం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. దీంతో ఈ కేసు తుది విచారణ ముగిసింది. మంగళవారం వారిద్దరిని నిర్దోషులుగా పేర్కొంటూ తీర్పు వెలువరించింది కోర్టు.
పోలీసులు చార్జిషీట్లో పేర్కొన్న విధంగా కోర్టులో గంజాయిని సమర్పించలేకపోయారని.. ఆధారాలు సరిగా లేకపోవడంతో కోర్టు కేసును కొట్టివేస్తుందని తెలిపారు. ఈ మేరకు నిందితులను విడుదల చేసింది. ఎలుకల పుణ్యమా అని గంజాయి కేసులో ఇద్దరు నిందితులు జైలు శిక్ష నుంచి తప్పించుకోవడం హాట్ టాపిక్ గా మారింది.
ఇలాంటి ఘటన ఇటీవల కోయంబేడ్ లోనూ వెలుగు చూసింది. కోయంబేడు పోలీసులు పట్టుకున్న 33 కేజీల గంజాయిలో 19 కేజీలను ఎలుకలు తినేసాయి. ఈ మేరకు పోలీసులు కోర్టుకు వివరాలు సమర్పించారు. ఈ కేసులో కూడా నిందితులు జైలు శిక్ష నుంచి బయటపడ్డారు. నిజంగానే గంజాయిని ఎలుకలు తినేస్తున్నాయా? అడ్డుపడ్డ గంజాయిని భద్రపరచడంలో పోలీసులు వైఫల్యం చెందుతున్నారా? ఎలుకల పేరు చెప్పి పట్టుకున్న గంజాయిని బయటకు పంపించి.. సొమ్ము చేసుకుంటున్నారా? అని అనుమానాలు.. సామాజిక మాధ్యమాల్లో వెల్లువెత్తుతున్నాయి.