
భారీ వర్షాలు, వరదలతో అతలాకుతలమైన కేరళను సమస్యలు ఇంకా వెంటాడుతూనే ఉన్నాయి. వరదల్లో అనేక జంతువులు జనావాసాల్లోకి కొట్టుకువచ్చాయి. ఈ సమయంలో జంతువుల మూత్రం నీటిలో కలిసి ‘‘రాట్ ఫీవర్’’కు కారణమవుతోంది. దీని కారణంగా ఇప్పటి వరకు 15 మంది మరణించగా.. 200 మంది ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు.
తీవ్రజ్వరం, తలనొప్పి, రక్తస్రావం, రక్తవాంతులతో జనం ఆసుపత్రులకు వస్తున్నారు. వ్యాధిని సకాలంలో గుర్తించకపోతే ప్రాణాలు పోవడం ఖాయమని వైద్యులు తెలిపారు. దీనిపై కేరళ ఆరోగ్య మంత్రి కేకే శైలజ స్పందించారు. రాట్ ఫీవర్ నివారణకు ప్రత్యేక వైద్య బృందాలను రాష్ట్రం మొత్తం మోహరించామని శైలజ వెల్లడించారు. పునరావాస కేంద్రాల వద్ద విధులు నిర్వర్తిస్తున్న సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని.. కార్మికులకు ముందుజాగ్రత్తగా ‘డాక్సీ సెలైన్’ టాబ్లెట్లు పంపిణీ చేస్తున్నట్లు ఆమె వివరించారు.