కరోనా పాజిటివ్ కేసు వార్తలు: రాష్ట్రపతి భవన్ ఇచ్చిన వివరణ ఇదీ...

Published : Apr 21, 2020, 03:45 PM IST
కరోనా పాజిటివ్ కేసు వార్తలు: రాష్ట్రపతి భవన్ ఇచ్చిన వివరణ ఇదీ...

సారాంశం

రాష్ట్రపతి భవన్ ఆవరణలోని ఓ ఉద్యోగికి కరోనా వైరస్ పాజిటివ్ వచ్చినట్లు వచ్చిన వార్తలపై రాష్ట్రపతి భవన్ వివరణ ఇచ్చింది. ఈ మేరకు రాష్ట్రపతి భవన్ నుంచి ఓ ప్రకటన జారీ అయింది.

న్యూఢిల్లీ: రాష్ట్రపతి భవన్ సచివాలయంలో ఏ ఉద్యోగికి కూడా కరోనా వైరస్ పాజిటివ్ నిర్ధారణ కాలేదని రాష్ట్రపతి భవన్ స్పష్టం చేసింది. రాష్ట్రపతి భవన్ ఆవరణలో ఒకరికి కరోనా పాజిటివ్ వచ్చినట్లు మీడియాలో వార్తలు వచ్చిన నేపథ్యంలో తాము ఈ వివరణ ఇస్తున్నట్లు రాష్ట్రపతి భవన్ తెలిపింది. 

న్యూఢిల్లీలోని బిఎల్ కపూర్ ఆస్పత్రిలో ఏప్రిల్ 13వ తేదీన మరణించిన కరోనా వైరస్ రోగి రాష్ట్రపతి సచివాలయంలో గానీ రాష్ట్రపతి భవన్ ఆవరణలో గానీ ఉద్యోగి కాదని స్పష్టం చేసింది. 

మృతుడి కాంటాక్టులో ఉన్నవారి కోసం ఆరా తీయగా, రాష్ట్రపతి సచివాలయంలోని ఉద్యోగి కుటుంబ సభ్యుడొకరు అతనితో కాంటాక్టులో ఉన్నట్లు తేలిందని వివరించారు. ఆ ఉద్యోగి తన కుటుంబ సభ్యులతో పాటు రాష్ట్రపతి ఎస్టేట్ షెడ్యూల్ ఏరియాలోని పాకెట్ 1లో ఉంటున్నట్లు తెలిపింది. 

మార్గదర్శక సూత్రాలను అనుసరించి ఆ వ్యక్తి కుటుంబ సభ్యులను ఏడుగురిని ఏప్రిల్ 16వ తేదీన మందిర్ మార్గ్ లో క్వారంటైన్ కు పంపించినట్లు స్పష్టం చేసింది. మృతుడితో సంబంధం ఉన్న ఓ వ్యక్తికి కరోనా పాజిటివ్ ఉన్నట్లు తేలిందని తెలిపింది . రాష్ట్రపతి సచివాలయంలోని ఉద్యోగితో పాటు అతని కుటుంబ సభ్యులందరికీ నెగెటివ్ వచ్చిందని  తెలిపింది. 

దాంతో షెడ్యూల్ ఏరియాలోని పాకెట్ 1లో నివాసం ఉంటున్న115 ఇళ్లకు చెందినవారి కదలికలపై ఆంక్షలు విధించినట్లు, ఇంట్లోనే ఉండాలని వారికి సూచించినట్లు వివరించింది. వాళ్ల ఇంటికే నిత్యావసరాలు చేరవేస్తున్నట్లు తెలిపింది. ఇప్పటి వరకు కూడా రాష్ట్రపతి సచివాలయంలోని ఓ ఒక్క వ్యక్తికి కూడా కరోనా పాజిటివ్ రాలేదని రాష్ట్రపతి భవన్ స్పష్టం చేశసింది. 

రాష్ట్రపతి భవన్ సముదాయంలో ఓ వ్యక్తికి కరోనా పాజిటివ్ ఉన్నట్లు నిర్ధారణ అయినట్లు మంగళవారం ఉదయం వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. దీంతో దాదాపు వంద మందిని క్వారంటైన్ కు తరలించినట్లు, ఆ వ్యక్తికి కరోనా పాజిటివ్ ఉన్నట్లు నాలుగు రోజుల క్రితం తేలిందని, మిగతా అందరికీ నెగెటివ్ వచ్చిందని వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. ఆ వార్తలపై ఓ ప్రకటనలో రాష్ట్రపతి భవన్ వివరణ ఇచ్చింది. 

PREV
click me!

Recommended Stories

మహిళా ఉద్యోగులకు నెలసరి సెలవు.. కర్ణాటక హైకోర్టు స్టే
శంషాబాద్ ఎయిర్ పోర్ట్ లో కలకలం... ఇంటర్నేషనల్ విమానాలకు బాంబు బెదిరింపులు