లింగాయత్ మఠాధిపతికి నాలుగు రోజుల క‌స్ట‌డీ.. వీల్ చైర్ లో కోర్టుకు హాజ‌రు.. 

By Rajesh KFirst Published Sep 2, 2022, 6:22 PM IST
Highlights

మైనర్ బాలికలను లైంగికంగా వేధించిన కేసులో అరెస్టయిన లింగాయత్ మఠాధిపతి శివమూర్తి మురుగ శరణును నాలుగు రోజుల పోలీసు కస్టడీకి పంపారు. ఆరోగ్య సమస్యలు బాద‌ప‌డుతున్న ఆయ‌న కోర్టుకు వీల్ చైర్ లో హాజరయ్యారు.

కర్ణాటకలో ప్రముఖ‌ లింగాయత్ మఠాధిపతి శివమూర్తి మురుగ శరణుపై లైంగిక వేధింపుల ఆరోపణలు రావడంతో రాష్ట్రవ్యాప్తంగా ప్రకంపనలు రేగుతున్నాయి. మఠం నడుపుతున్న పాఠశాలలో చదువు కుంటున్న త‌మ‌ను లైంగిక వేధించడాన్ని బాధిత బాలికలు పోలీసులకు ఫిర్యాదుచేయడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. దీంతో ఆయ‌న‌పై పోక్సో చట్టం కింద లైంగిక వేధింపుల కేసు నమోదయిన విషయం తెలిసిందే.

బాలికలను లైంగికంగా వేధించిన కేసులో అరెస్టు అయిన‌ మఠాధిపతి శివమూర్తిని  నాలుగు రోజుల పోలీసు కస్టడీకి పంపారు. దీని తర్వాత ఆయ‌న‌ సెప్టెంబర్ 5 వరకు పోలీసు కస్టడీలో ఉండ‌నున్నారు. అనారోగ్య కారణాల వల్ల మఠాధిపతి శివమూర్తి వీల్ చైర్ లో కోర్టుకు హాజరయ్యారు. వాస్తవానికి పోలీసులు ఐదు రోజుల పోలీసు కస్టడీని కోరినప్పటికీ.. బెంచ్ నాలుగు రోజుల పోలీసు కస్టడీకి అంగీకరించింది.
 
అత్యంత నాటకీయ పరిణామాల మధ్య మఠాధిపతి శివమూర్తిని  లైంగిక వేధింపుల ఆరోపణలపై గురువారం రాత్రి అరెస్టు చేసి 14 రోజుల జ్యుడీషియల్ కస్టడీకి పంపారు. అయితే.. జైలులో అనారోగ్య స‌మ‌స్య‌లు త‌లెత్త‌డంతో శుక్రవారం ఆయ‌న‌ను చిత్రదుర్గ జిల్లా ఆసుపత్రికి త‌ర‌లించారు.

మఠాధిపతి శివమూర్తిని గురువారం అర్థరాత్రి అరెస్టు చేసిన తర్వాత కొన్ని గంటలపాటు విచారించినట్లు పోలీసులు తెలిపారు. జైలుకు పంపిన తర్వాత.. మఠాధిపతి శివమూర్తి ఛాతీలో నొప్పి వ‌స్తుంద‌న‌డంతో   పరీక్షల కోసం జిల్లా ఆసుపత్రికి తీసుకెళ్లారని పోలీసులు  చెప్పారు. ఈ క్ర‌మంలో అతనికి ఎలక్ట్రో కార్డియోగ్రామ్, ఇతర వైద్య పరీక్షలు చేశారు.

click me!