రామ మందిర నిర్మాణం దేశాన్ని ఏకం చేసేందుకు ఓ సాధనం: మోడీ

By narsimha lodeFirst Published Aug 5, 2020, 1:56 PM IST
Highlights

రామ మందిర నిర్మాణానికి భూమి పూజ చేయడం దేశ చరిత్రలో సువర్థ అధ్యాయమని ప్రధాని నరేంద్ర మోడీ చెప్పారు. 

అయోధ్య:రామ మందిర ఆలయ నిర్మాణం దేశాన్ని ఏకం చేయడానికి ఒక సాధనమని ప్రధాని నరేంద్ర మోడీ చెప్పారు. అయోధ్యలో రామ మందిర నిర్మాణానికి భూమి పూజ నిర్వహించారు మోడీ. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన శిలాఫలాకాన్ని బుధవారం నాడు ఆయన ప్రారంభించారు. 

ఈ సందర్భంగా ఆయన ప్రసంగించారు.రామ మందిర నిర్మాణానికి భూమి పూజ చేయడం దేశ చరిత్రలో సువర్థ అధ్యాయమన్నారు. ఈ నాటి జయ జయ ధ్వానాలు శ్రీరాముడికి విన్పించకపోవచ్చన్నారు. ప్రపంచంలో ఉన్న కోట్ల మంది భక్తులకు మాత్రం విన్పిస్తాయని చెప్పారు. రామ మందిర భూమి పూజ చేయడం మహద్భాగ్యమని  ఆయన అభిప్రాయపడ్డారు.  ఈ భాగ్యాన్ని రామ మందిర ట్రస్టు తనకు కల్పించిందన్నారు.

వందల ఏళ్ల నిరీక్షణకు ఇవాళ తెరపడిందని ఆయన తెలిపారు. దశాబ్దాలపాటు రామ్‌లల్లా ఆలయం టెంటులోనే కొనసాగిన విషయాన్ని ఆయన ఈ సందర్భంగా గుర్తు చేశారు. ప్రతి ఒక్కరి మనసు దేదీప్యమానమైందన్నారు. దేశం మొత్ం ఆధ్యాత్మిక భావనతో ఇవాళ నిండిపోయిందని ఆయన తెలిపారు.

హనుమంతుడి ఆశీస్సులతో రామ మందిర నిర్మాణాన్ని చేపట్టినట్టుగా ఆయన చెప్పారు. భూమి పూజ కంటే ముందుగానే తాను హనుమాన్ గుడిని సందర్శించిన విషయాన్ని ఆయన ఈ సందర్భంగా ప్రస్తావించారు.

స్వాతంత్ర్యం కోసం దేశ ప్రజలంతా పోరాటం చేశారు వారి పోరాటాల ఫలితంగానే ఆగష్టు 15న స్వాతంత్ర్య దినోత్సవం జరుపుకొంటున్నామన్నారు. అదే మాదిరిగానే రామ మందిరం కోసం ఎందరో త్యాగాలు చేశారన్నారు. వారి త్యాగాలతోనే ఈనాడు రామ మందిర నిర్మాణం ప్రారంభించినట్టుగా చెప్పారు. ఇవాళ మహోత్సవం.. నరుడు, నారాయణుడిని కలిపే మహోత్సవంగా ఆయన పేర్కొన్నారు. 

సూర్యుడంత తేజస్సు, భూదేవి అంత సహనం రాముడి సొంతమన్నారు. భారత్ ఆదర్శంలో రాముడు ఉన్నారన్నారు. భారత జీవన విధానంలో శ్రీరాముడు ఉన్నారన్నారు. మహాత్ముడి అహింస నినాదంలోనూ శ్రీరాముడే ఉన్నాడని ఆయన గుర్తు చేశారన్నారు.

ఇవాళ కోట్లాది మంది రాముడి భక్తుల కల నెరవేరుతోందన్నారు. రాముడు అందరివాడు, అందరిలోనూ ఉన్నాడని మోడీ చెప్పారు. మనందరి చుట్టూ శ్రీరాముడు ఆవరించి ఉన్నాడని ఆయన తెలిపారు.కాంబోడియా, శ్రీలంక, మలేషియాతో పాటు మరికొన్ని దేశాల్లో కూడ శ్రీరాముడిని పూజిస్తున్నారని  మోడీ చెప్పారు.

కోటాను కోట్ల హిందువులకి ఈ ఆలయ నిర్మాణం ఎంతో ముఖ్యమైందన్నారు మోడీ. రాముడి ఆదర్శాలు కలియుగంలో పాటించేందుకు మార్గమిదేనన్నారు. ఈ కోట్లాది మంది మనో సంకల్పానికి ప్రతీక ఈ మందిరమని మోడీ చెప్పారు. 

also read:30 ఏళ్లనాటి సంకల్పం సాకారమైంది: ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్

రామ మందిరం అయోధ్య ఆర్ధిక పరిస్థితిని మార్చివేయనుందని మోడీ అభిప్రాయపడ్డారు.  స్వర్గం కంటే మాతృభూమి గొప్పదని రాముడు తన ప్రజలకు బోధించిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. 
 

click me!