అయోధ్యలో బాలరాముడి విగ్రహా ఎంపిక పూర్తి.. కొలువుతీరనున్న51 అంగుళాల శ్యామవర్ణ విగ్రహం...

By SumaBala Bukka  |  First Published Jan 1, 2024, 1:48 PM IST

మైసూర్ కు చెందిన అరుణ్ యోగిరాజ్ చేసిన విగ్రహం ఎంపికయ్యింది. అరుణ్ యోగిరాజ్ ఆరు నెలల్లోనే విగ్రహాన్నితయారు చేశారు.


అయోధ్య : ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న అయోధ్య బాలరాముడి విగ్రహ ఎంపిక పూర్తయ్యింది. ముగ్గురు శిల్పులు చేసిన విగ్రహాల్లోంచి ఒక విగ్రహాన్ని ఫైనల్ చేశారు. మైసూర్ కు చెందిన అరుణ్ యోగిరాజ్ విగ్రహాన్ని ఎంపిక చేసింది ఆలయ ట్రస్టు. మిగిలిన రెండు విగ్రహాలకు అయోధ్య ఆలయంలోనే చోటు కల్పించనున్నారు.  మైసూర్ కు చెందిన అరుణ్ యోగిరాజ్ చేసిన విగ్రహం ఎంపికయ్యింది. అరుణ్ యోగిరాజ్ ఆరు నెలల్లోనే విగ్రహాన్నితయారు చేశారు. ఈ విగ్రహం 51 అంగుళాల ఎత్తుతో శ్యామవర్ణ రూపంలో దర్శనమిస్తుంది. 

అయోధ్యలోని గర్భగుడిలో ప్రతిష్టించేందుకు శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ మూడు విగ్రహాలను తయారు చేయించింది. వీటిలో రెండు మూడు రోజుల క్రితం మౌఖిక ఓటింగ్ ద్వారా విగ్రహాన్ని ఎంపిక చేసే ప్రక్రియను పూర్తి చేసింది. ధర్మకర్తల మండలి తమ అభిప్రాయాన్ని లిఖితపూర్వకంగా ట్రస్ట్ కు అందజేసింది. ఈ మేరకు ట్రస్ట్ తన తుది నిర్ణయాన్ని ప్రకటించింది. ఈ విగ్రహాలను ఎంపిక చేసే ప్రక్రియ కూడా ఆశామాషిగా ఏమీ జరగలేదు. ట్రస్ట్ ట్రస్టీల బోర్డులోని 11మంది సభ్యులు ముగ్గురు శిల్పులతో దాదాపు అరగంట పాటు సంభాషించారు. 

Latest Videos

Ayodhya Ram Mandir : అందాల రామయ్యకు హైదరబాదీ పాదుకలు ...

వీరిలో రామ మందిరం నిర్మాణ కమిటీ చైర్మన్ నృపేంద్ర మిశ్రా కూడా ఉన్నారు. విగ్రహ తయారీ గురించి అనేక విషయాలను అడిగి తెలుసుకున్నారు. ఆ తర్వాత ట్రస్ట్ ప్రధాన కార్యదర్శి చెంపత్రాయ్ తమ అభిప్రాయాలను లిఖితపూర్వకంగా ట్రస్ట్ కి తెలియజేశారు. ఈ మూడు విగ్రహాలను కర్ణాటకకు చెందిన ప్రఖ్యాత శిల్పులు గణేష్ భట్ ఒకటి, అరుణ్ యోగి రాజ్ ఒకటి..  మరొకటి రాజస్థాన్ కు చెందిన సత్యనారాయణ్ పాండేలు తయారు చేశారు. విగ్రహాల తయారీకి కర్ణాటక శిల్పులు నల్లరాళ్ళను ఉపయోగించారు. రాజస్థాన్ కు చెందిన సత్యనారాయణ్ పాండే తెల్లని మకరానా పాలరాయితో విగ్రహాన్నిరూపొందించారు.

ముంబైకి చెందిన ప్రముఖ కళాకారుడు వాసుదేవ్ కామత్ ఇచ్చిన స్కెచ్ ఆధారంగా రాంలల్లా విగ్రహాలను రూపొందించారు. ఇక గర్భగుడిలో ప్రతిష్టించే ఈ విగ్రహాన్ని భక్తులు 35 అడుగుల దూరం నుంచి మాత్రమే దర్శించుకోవడానికి వీలు ఉంటుంది. జనవరి 16నుంచి అయోధ్యలో విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమాలు మొదలవుతాయి 17వ తేదీన బాలరాముడు విగ్రహాన్ని అయోధ్యలో ఊరేగిస్తారు. జనవరి 20వ తేదీన సరయూ నది జలాలతో రామ మందిరాన్ని శుద్ధి చేసి అదే రోజు వాస్తు పూజలు నిర్వహిస్తారు. 21వ తేదీన బాలరాముడు విగ్రహాన్ని సంప్రోక్షణ చేసి 22వ తేదీన పూజల అనంతరం మృగశిర నక్షత్రంలో మధ్యాహ్న సమయంలో బాల రాముడు విగ్రహానికి ప్రాణ ప్రతిష్ట చేస్తారు. 

click me!