జగన్ లాస్ట్ మినిట్ యూటర్న్: బిజెపితో సీక్రెట్ ఒప్పందం

First Published Aug 10, 2018, 8:41 AM IST
Highlights

డిప్యూటీ చైర్మన్ ఎన్నికల్లో ఎన్డీఎ అభ్యర్థి హరివంశ్ నారాయణ సింగ్ కు 125 ఓట్లు రాగా, ప్రతిపక్షాల అభ్యర్థి హరిప్రసాద్ కు 105 ఓట్లు వచ్చాయి. దాంతో ఎన్డీఎ అభ్యర్థి విజయం సాధించారు. ఓటింగులో పాల్గొనకపోవడం ద్వారా వైఎస్సార్ కాంగ్రెసు పార్టీ పరోక్షంగా ఎన్డీఎకు సహకరించింది. 

హైదరాబాద్: రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ చివరి నిమిషంలో వైఖరి మార్చుకున్నారు. డిప్యూటీ చైర్మన్ ఎన్నికల్లో ఎన్డిఎ అభ్యర్థికి వ్యతిరేకంగా, ప్రతిపక్షాల అభ్యర్థిగా మద్దతుగా ఓటు వేస్తామని వైఎస్సార్ కాంగ్రెసు పార్టీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి ఎన్నికలకు ముందుకు ప్రకటించారు. 

అయితే, ఎన్నికల్లో పాల్గొనకుండా వైఎస్సార్ కాంగ్రెసు పార్టీ సభ్యులు తటస్థంగా ఉండిపోయారు. తెలుగు రాష్ట్రాలకు సంబంధించి తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్) స్పష్టంగా ఎన్డీఎ అభ్యర్థికి ఓటు వేయగా, తెలుగుదేశం పార్టీ కాంగ్రెసు అభ్యర్థికి ఓటు వేసింది.

డిప్యూటీ చైర్మన్ ఎన్నికల్లో ఎన్డీఎ అభ్యర్థి హరివంశ్ నారాయణ సింగ్ కు 125 ఓట్లు రాగా, ప్రతిపక్షాల అభ్యర్థి హరిప్రసాద్ కు 105 ఓట్లు వచ్చాయి. దాంతో ఎన్డీఎ అభ్యర్థి విజయం సాధించారు. ఓటింగులో పాల్గొనకపోవడం ద్వారా వైఎస్సార్ కాంగ్రెసు పార్టీ పరోక్షంగా ఎన్డీఎకు సహకరించింది. 

తాము ప్రతిపక్షాల నుంచి కాంగ్రెసేతర పార్టీకి చెందిన అభ్యర్థిని దించుతారని భావించామని, అయితే ప్రతిపక్షాల నుంచి కాంగ్రెసు అభ్యర్థిని రంగంలోకి దించారని, దాంతో తాము ఓటింగుకు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నామని వైసిపి రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డి తమ వైఖరిని సమర్థించుకున్నారు. 

రాష్ట్రపతి, ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో వైసిపి బిజెపి అభ్యర్థికి అనుకూలంగా ఓటు వేసిన విషయం తెలిసిందే. బిసీ కమ్యూనిటికి చెందినవాడు కావడం వల్ల తాము కాంగ్రెసు అభ్యర్థి హరిప్రసాద్ కు ఓటు వేశామని తెలుగుదేశం పార్టీ రాజ్యసభ సభ్యుడు సుజనా చౌదరి చెప్పారు. కాంగ్రెసుతో తమ సంబంధం పార్లమెంటు వరకే పరిమితమని ఆయన చెప్పారు.

తమ అభ్యర్థికి ఓటు వేయాలని బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ ఫోన్ చేసి తమ నేత కేసీఆర్ ను కోరారని, ఎన్డీఎ అభ్యర్థి బిజెపికి చెందినవాడు కాకపోవడంతో తాము ఓటు వేశామని టీఆర్ఎస్ నాయకులు చెబుతున్నారుట. తమ అభ్యర్థిని బలపరిచినందుకు నితీష్ కుమార్ కెసిఆర్ కు పోన్ చేసి ధన్యవాదాలు కూడా తెలిపారు.

click me!