
న్యూఢిల్లీ : వారం రోజుల కిందట పాకిస్థాన్ (Pakistan) భూభాగంపై భారతదేశానికి చెందిన క్షిపణి అనుకోకుండా వెళ్లి పడింది. ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు. అయితే ఈ విషయంలో కేంద్ర రక్షణశాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ (Defence Minister Rajnath Singh) మంగళవారం పార్లమెంట్ (Parliament) కు వివరణ ఇవ్వనున్నారు.
ఈ విషయంలో గత శుక్రవారం భారత ప్రభుత్వం (Indian government) ప్రకటన చేసింది. మార్చి 9వ తేదీన పాకిస్తాన్‌లో ల్యాండ్ అయిన క్షిపణి ఘటన ప్రమాదవశాత్తు జరిగిందని, రెగ్యులర్ మెయింటెన్స్ నిర్వహిస్తున్న క్రమంలో సాంకేతిక లోపం తలెత్తడంతో ఇది చోటు చేసుకుందని, ఇది తీవ్ర విచారకరమని తెలిపింది.
భారతదేశం నుండి ప్రయోగించిన హై-స్పీడ్ క్షిపణి (high speed missile) తమ గగనతలంలోకి ప్రవేశించిందని పాకిస్తాన్ చెప్పిన మరుసటి రోజు కేంద్ర ప్రభుత్వం ఈ ప్రకటన విడుదల చేసింది. దీనిపై ‘కోర్ట్ ఆఫ్ ఎంక్వైరీ’ (Court of Enquiry)కి ఆదేశించిందని ప్రభుత్వం పేర్కొంది. ‘‘ మార్చి 9, 2022న, సాధారణ నిర్వహణ సమయంలో సాంకేతిక లోపం కారణంగా ప్రమాదవశాత్తూ క్షిపణి పేలింది. భారత ప్రభుత్వం తీవ్రంగా పరిగణించి, ఉన్నత స్థాయి కోర్టు విచారణకు ఆదేశించింది’’ అని రక్షణ మంత్రిత్వ శాఖ తెలిపింది.
పాకిస్థాన్ గగనతలంలోకి ప్రవేశించిన భారత క్షిపణి పంజాబ్ ప్రావిన్స్ (Punjab province)లోని ఖనేవాల్ (khaneval) జిల్లాలోని మియాన్ చన్ను(Mian Channu) సమీపంలో పడిందని, దీంతో పరిసర ప్రాంతాలకు కొంత నష్టం వాటిల్లందని ఆ దేశం తెలిపింది. దీంతో పాటు తమ దేశంలో ప్రయాణించే అనేక జాతీయ, అంతర్జాతీయ విమానాల రాకపోకలకు తీవ్ర ప్రమాదం కలిగించిందని పేర్కొంది. ఇంతటి తీవ్రమైన అంశాన్ని భారతదేశం సరళమైన వివరణతో తాము సంతృప్తి చెందలేమని తెలిపింది. దీనిపై సంయుక్త విచారణ జరపాలని పాక్ విదేశాంగ మంత్రి షా మహమూద్ ఖురేషీ (Pakistan Foreign Minister Shah Mahmood Qureshi) సోమవారం డిమాండ్ చేశారు.
ఇదిలా వుండగా క్షిపణి ఘటన ప్రమాదవశాత్తు జరిగినదే తప్ప మరేమీ లేదని అమెరికా పేర్కొంది. ఇదే విషయంలో నిన్న పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ (Pakistan prime minister imran khan) మాట్లాడారు. లాహోర్‌కు 275-కిమీ దూరంలో ఉన్నమియాన్ చన్ను (Mian Channu)లో భారత క్షిపణి పడిపోయిన తర్వాత తాము ప్రతిస్పందించగలిగే అవకాశం ఉందని, అయినప్పటికీ తాము సంయమనం పాటించామని తెలిపారు. పాకిస్థాన్ దేశ రక్షణను బలోపేతం చేసుకోవాల్సిన అవసరం ఉందని తెలిపారు. ఉమ్మడి ప్రతిపక్షం ఇమ్రాన్ ఖాన్ పై ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానం నేపథ్యంలో ఆదివారం మధ్యాహ్నం పంజాబ్‌లోని హఫీజాబాద్ జిల్లాలో జరిగిన బహిరంగ ర్యాలీలో ఆయన ప్రసంగించారు. ఈ ప్రసంగంలో భాగంగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. కాగా ఈ విషయంలో కాంగ్రెస్ (congress) నాయకుడు మనీష్ తివారీ (manish tiwari) తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ఇలాంటి ఘటనలు పెద్ద చిక్కులను తీసుకొచ్చే ప్రమాదం ఉందని ఆవేదన వ్యక్తం చేశారు.