
73వ రాజ్యాంగా సవరణ ద్వారా దేశానికి పంచాయతీరాజ్ వ్యవస్థను అప్పటి ప్రధాని రాజీవ్ గాంధీ అందించారని రాహుల్ గాంధీ అన్నారు. గ్రామాలను బలోపేతం చేయాలనే మహాత్మాగాంధీ కలలను నెరవేర్చిన ఘనత ఆయనకే దక్కుతుందని అన్నారు. ఆదివారం జాతీయ పంచాయతీరాజ్ దినోత్సవం సందర్భంగా దివంగత ప్రధాని రాజీవ్ గాంధీని రాహుల్ గాంధీ కొనియాడారు.
‘‘ దేశంలోని గ్రామాలు దృఢంగా మారాలన్నది మహాత్మాగాంధీ కల. మాజీ ప్రధాని రాజీవ్‌గాంధీ ఆ కలను పంచాయతీరాజ్ వ్యవస్థను తీసుకొచ్చి సాకారం చేశారు. జాతీయ పంచాయతీ రాజ్ దినోత్సవం సందర్భంగా పంచాయతీ సంస్థల, స్థానిక గ్రామీణ సంస్థల అధినేతలు, సర్పంచ్‌లు, సభ్యులందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు. ’’ అని రాహుల్ గాంధీ హిందీలో ట్వీట్ చేశారు.
1993 ఏప్రిల్ 24వ తేదీన పంచాయతీ రాజ్ చట్టాన్ని అప్పటి కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చింది. ఈ చట్టం ద్వారా అట్టడుగువర్గాలకు అధికార వికేంద్రీకరణ జరిగింది. ఈ చట్టం చరిత్రలో ఒక గొప్ప మైలురాయిగా నిలిచిపోయింది. ఈ జాతీయ పంచాయతీరాజ్ దినోత్సవాన్ని పురస్కరించుకుకొని దేశవ్యాప్తంగా గ్రామసభలను ఉద్దేశించి ప్రధాని నరేంద్ర మోదీ ఆదివారం జమ్మూ కాశ్మీర్‌లో పర్యటించారు.
జమ్మూలోని పల్లి అనే పంచాయతీ ఈ ఏడాది పంచాయతీరాజ్ దివాస్ సందర్భంగా ఉత్తమ పంచాయతీగా ఎంపికైంది. ఈ నేపథ్యంలో అక్కడికి ప్రధాని నరేంద్ర మోడీ వెళ్లారు. రైతులు, గ్రామీణ ప్రజల ఆదాయాన్ని మెరుగుపరిచేందుకు సర్పంచ్‌లు, గ్రామ పెద్దలకు వీలుగా సరికొత్త ఆవిష్కరణలను అక్కడ ప్రదర్శించారు.
ఈ సందర్భంగా ఆ గ్రామంలో ఏర్పాటు చేసిన సభలో ప్రజలను ఉద్దేశించి ప్రధాని నరేంద్ర మోడీ మాట్లాడారు. ఈ ఏడాది పంచాయితీ రాజ్ దినోత్సవాన్ని జమ్మూకాశ్మీర్ లో జరుపుకోవడం ఒక పెద్ద మార్పును సూచిస్తోందని అన్నారు. జమ్మూకాశ్మీర్ లో ప్రజాస్వామ్యం అట్టడుగు స్థాయికి చేరుకున్నప్పుడు, తాను ఇక్కడి నుంచి అందరితో మాట్లాడుతున్నానని చెప్పారు. ఇది చాలా గర్వించదగిన విషయమని అన్నారు. ప్రజాస్వామ్యం అయినా, అభివృద్ధి అయినా దానికి నేడు జమ్మూ కాశ్మీర్ కొత్త ఉదాహరణగా నిలుస్తోందని అన్నారు.
గత 2-3 ఏళ్లలో జమ్మూ కాశ్మీర్‌లో అభివృద్ధిలో కొత్త కోణాలు సృష్టించబడ్డాయని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు. సాంబా జిల్లాలోని పల్లిలో 500 కిలోవాట్ల సోలార్ పవర్ ప్లాంట్‌ను ప్రారంభించడంతో దేశంలోనే కార్బన్ న్యూట్రల్‌గా మారిన మొదటి పంచాయతీగా అవతరిస్తోందని తెలిపారు. పల్లి ప్రజలు 'సబ్కా ప్రయాస్' ఏమి చేయగలరో నిరూపించారని ప్రధాని తెలిపారు. జమ్మూ కాశ్మీర్‌లో అభివృద్ధిని వేగవంతం చేయడానికి 20,000 కోట్ల రూపాయల విలువైన ప్రాజెక్టులను నేడు ప్రారంభించామని చెప్పారు. కాగా జమ్మూ కాశ్మీర్ పర్యటన సందర్భంగా పలు అభివృద్ధి పనులను ప్రధాని నరేంద్ర మోడీ ప్రారంభించారు.