
తమిళ రాజకీయాలు రోజుకో కొత్త వార్తతో ఆసక్తికరంగా మారుతున్నాయి. ఇప్పటికే రజనీ కాంత్ ఎంట్రీ, విజయ్ పార్టీ పెడతాడన్న వార్తలతో హాట్ హాట్ గా ఉన్నాయి. అయితే రజనీకాంత్ ఈ నెల 31న పార్టీ ఏర్పాటుపై ప్రకటన చేయనున్నారని వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో రజనీ పార్టీ ఏర్పాటు ముహూర్తం తేదీ అంటూ వార్తలు చక్కర్లు కొడుతున్నాయి.
ఇప్పటికే పార్టీ పేరుగా మక్కల్ సేవై కర్చీ, పార్టీ గుర్తుగా ఆటో రిక్షాను ఎంపికచేసినట్లు సమాచారం. కాగా పార్టీ ఏర్పాటుకు రజనీ జనవరి 14 లేదా 17 తేదీలను పరిశీలిస్తున్నట్లు సమాచారం. జనవరి 14న తమిళ పొంగల్ సందర్భంగా పార్టీ పెట్టాలని కొందరు సూచిస్తే.. ఎంజీఆర్ పుట్టినరోజు సందర్భంగా జనవరి 17న పార్టీ పెట్టాలని మరికొందరు రజనీకి సూత్రప్రాయంగా వెల్లడించినట్లు తెలుస్తుంది.
ఏదైమైనా జనవరి 17నే రజనీ పార్టీ ఏర్పాటుకు ముహూర్తం ఖరారు కానుందని మెజారిటీ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. ఇక తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు ఏప్రిల్ లేదా మే నెలలో జరగనున్నాయి.
ఓ వైపు రజనీ పార్టీ పెట్టే జోరులో ఉండగా తూత్తుకుడి ఆందోళనల ఘటనపై నటుడు రజనీకాంత్‌కు సోమవారం సమన్లు జారీ అయ్యాయి. జనవరి 19 లోపు సమాధానం ఇవ్వాలని సింగిల్ జడ్జి కమిషన్ ఆదేశాలు జారీ చేసింది.
2018 మేలో తూత్తుకుడిలోని స్టెరిలైట్ కర్మాగారాన్ని శాశ్వతంగా మూసివేయాలని కోరుతూ సాగిన ఉద్యమం హింసాత్మకంగా మారిన సంగతి తెలిసిందే. ఫ్యాక్టరీలో కాల్పులు జరగడంతో 13మంది ప్రాణాలు కోల్పోయారు. దీనిపై తమిళనాడు ప్రభుత్వం రిటైర్ట్ జస్టిస్ అరుణ జగదీశన్ ఆధ్వర్యంలో కమిటీని ఏర్పాటు చేసింది.
అయితే ఈ ఘటన వెనుక సంఘ విద్రోహ శక్తులు ఉన్నాయని రజనీకాంత్ సంచలన ఆరోపణలు చేశారు. మరోవైపు మక్కల్ సేవై కట్చి పేరును రజనీకాంత్ రిజిస్టర్ చేస్తే కోర్టులో కేసు దాఖలు చేస్తామని అఖిల భారత మక్కల్ సేవై ఇయక్కం అధ్యక్షుడు తంగ షణ్ముగసుందరం హెచ్చరించారు.