‘రజనీ అలా అన్నందుకు బాధేసింది.. కానీ ‘కాలా’ తో సంబంధం ఏంటి..?’’

First Published Jun 4, 2018, 11:49 AM IST
Highlights

ట్విట్టర్ లో ప్రకాశ్ రాజ్

కర్ణాటకలో ‘కాలా’ సినిమా  బ్యాన్ పై సినీ నటుడు ప్రకాశ్ రాజ్ స్పందించారు. అసలు కావేరీ నదీ వివాదానికి, కాలా సినిమాకి ఏంటి సంబంధం అని ప్రశ్నించారు.  ఇటీవల కావేరీ జల వివాదంపై రజనీకాంత్  వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ప్రకాశ్ రాజ్ స్పందించారు.

సుప్రీం కోర్టు తీర్పు ప్రకారం కర్ణాటక..తమిళనాడుకు కావేరీ నీటిలో వాటా ఇవ్వాలని ఇటీవల రజనీ అన్నారు. దాంతో రజనీ చేసిన వ్యాఖ్యలపై కన్నడిగులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ‘కాలా’ను విడుదల కానివ్వమంటూ రాష్ట్రంలో నిషేధం విధించారు. ఈ నేపథ్యంలో ప్రకాశ్‌ రాజ్‌ ట్విటర్‌ ద్వారా తన అభిప్రాయాన్ని వెల్లడించారు.

‘మనిషికి, నదికి మధ్య ఓ అనుబంధం ఉంటుంది. అందుకే కావేరీ గురించి మాట్లాడినప్పుడల్లా మనం ఉద్వేగానికి లోనవుతుంటాం. కానీ ఉద్వేగానికి లోనైంత మాత్రాన సమస్యకు పరిష్కారం దొరకదు. కావేరీ వివాదానికి ‘కాలా’కు సంబంధం ఏంటి? ఎందుకు ఎప్పుడూ చిత్ర పరిశ్రమనే టార్గెట్‌ చేస్తున్నారు? ’

‘ఈ విషయంలో కాంగ్రెస్‌, జేడీఎస్‌ ప్రభుత్వాలు ఏమన్నా చర్యలు తీసుకుంటాయా? లేక ‘పద్మావత్‌’ విషయంలో భాజపా చేసినట్లే చేస్తాయా?’ రెండు బాధ్యతగల ప్రభుత్వాలు, కేంద్ర ప్రభుత్వం కలిసి కావేరీ సమస్యకు పరిష్కారం చూపాలి. రాజకీయ కారణాల వల్ల, ఒత్తిడి వల్ల ప్రభుత్వాలు స్పందించకపోతే మేమే వారికి బాధ్యతను గుర్తుచేయాల్సి వస్తుంది. ’

‘‘కాలా’ విడుదలను ఆపడం వల్ల కొన్ని సంస్థలకు వచ్చే లాభం ఏంటో ఒక్క క్షణం ఆలోచించాలి. రజనీకాంత్‌ చేసిన వ్యాఖ్యలు చాలా బాధించాయి. ఆ కోపంతో ఆయన సినిమాను నిషేధించాలని చూస్తున్నారు. కానీ కన్నడిగులకు కావాల్సింది సినిమా నిషేధించడమా?’

‘కన్నడిగులకు ఏం కావాలో నిర్ణయించడానికి వారెవరు? సినిమా కోసం నిర్మాతలు పడిన కష్టం ఏమైపోతుంది? రజనీ చేసిన వ్యాఖ్యలకు నిర్మాతలు ఎందుకు బాధపడాలి? థియేటర్లలో క్యాంటీన్లు నడిపేవారు, రోజూ సైకళ్లపై తిరుగుతూ పోస్టర్లు అతికించేవారి జీవితాలు ఏమైపోవాలి? ’

‘ఆందోళనల నేపథ్యంలో వాహనాలు తగలబెడుతున్నారు. మరి వారికి పరిహారం ఎవరిస్తారు? పిల్లలు పాఠశాలలకు వెళ్లలేకపోతున్నారు. వారి సంగతేంటి? ఈ ఆందోళనల వల్ల తమిళనాడు, కర్ణాటక ప్రజల మధ్య ద్వేషం పెరిగిపోతోంది. కొందరు ఆందోళనకారులు మా భావోద్వేగాలతో ఆడుకుంటున్నారు. ’

‘ఈ సమస్య పరిష్కారం అయ్యాక మరో విషయంలో ఆందోళనలు చేయడానికి వస్తారు. ఆఖరికి దెబ్బతినేది మేమే. నేను ఇవన్నీ ప్రశ్నించడం వల్ల డిబేట్లు పెట్టి నేను కన్నడిగులకు వ్యతిరేకిని అంటూ వ్యాఖ్యానిస్తారు. గతంలో నా అభిప్రాయం వ్యక్తం చేసినందుకు హిందువులకు వ్యతిరేకిని అన్నారు. అయినా నా అభిప్రాయం వెల్లడించకుండా నన్ను ఆపలేకపోయారు. నేను చెప్పాల్సింది చెప్పాను. మిగతాది మీ విజ్ఞతకే వదిలేస్తున్నాను’ అని పేర్కొన్నారు ప్రకాశ్‌రాజ్‌.

click me!