Deep Fake Issue : రోజురోజూకు సైబర్ నేరగాళ్లు రెచ్చిపోతున్నారు. డీప్ ఫేక్ వీడియోలను తయారు చేస్తూ దుమారం రేపుతున్నాయి. సచిన్ ( Sachin Tendulkar) డీప్‌ఫేక్ వీడియోపై కేంద్ర ఎలక్ట్రానిక్స్, ఐటీ శాఖ సహాయ మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ (Rajeev Chandrasekhar) స్పందించారు.
Deep Fake Issue : ఇటీవలి కాలంలో చాలా మంది సెలబ్రిటీల డీప్‌ఫేక్ వీడియోలు బారిన పడుతున్నారు. తొలుత నటి రష్మిక మందన్న డీప్‌ఫేక్ వీడియో సంచలనం సృష్టించింది. ఆ తరువాత హీరోయిన్ కత్రినా, కాజోల్ వీడియో కూడా బయటపడింది. బాలీవుడ్ సెలబ్రిటీలే కాదు.. ఆ తరువాత ప్రధాని మోడీ కూడా డీప్‌ఫేక్‌కి గురి అయ్యారు. డీప్‌ఫేక్‌లను పెద్ద ముప్పుగా అభివర్ణించిన ఆయన, సిగరెట్ ప్యాకెట్లపై హెచ్చరిక రాసినట్లే, డీప్‌ఫేక్‌తో రూపొందించినట్లు ఏఐతో రూపొందించిన వీడియోపై కూడా రాయాలని అన్నారు. ఇప్పుడు తాజాగా మాజీ క్రికెటర్ సచిన్ టెండూల్కర్‌కి సంబంధించిన ఇలాంటి వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇందులో అతను బెట్టింగ్ యాప్‌ను ప్రమోట్ చేస్తూ కనిపించాడు.
సచిన్ టెండూల్కర్ డీప్‌ఫేక్ వైరల్
సచిన్ టెండూల్కర్ తాను డీప్ ఫేక్ బారిన పడినట్టు స్వయంగా తన X హ్యాండిల్‌లో వెల్లడించారు. ఈ వీడియోను సచిన్ టెండూల్కర్ స్వయంగా తన ఎక్స్ ఖాతాలో షేర్ చేశాడు. ఆ ఫేక్ వీడియోలో సచిన్ .. తన కూతురు ఈ గేమ్స్ ఆడుతూ రోజూ బాగా మొత్తంలో సంపాదిస్తున్నదని చెప్పాడు. ఈ వీడియోలో స్కై వర్డ్ ఏవియేటర్ క్వెస్ట్ అనే బెట్టింగ్ యాప్‌ను ప్రమోట్ చేస్తున్నట్లు ఉంది. ఈ వీడియోను సచిన్ షేర్ చేస్తూ.. ఇలా వ్రాశాడు. "ఈ వీడియో నకిలీ, మిమ్మల్ని మోసం చేయడానికి రూపొందించబడింది. ఈ రకమైన సాంకేతికతను దుర్వినియోగం చేయడం పూర్తిగా తప్పు. మీరు ఇలాంటి వీడియోలు లేదా యాప్‌లు లేదా ప్రకటనలను చూసినట్లయితే.. వాటిని వెంటనే రిపోర్ట్ చేయాలని అభ్యర్థించారు. ఈ పోస్ట్‌ను సచిన్.. సమాచార సాంకేతిక శాఖ సహాయ మంత్రి రాజీవ్ చంద్రశేఖర్‌కు కూడా ట్యాగ్ చేశారు.
సచిన్ పోస్టుపై రాజీవ్ చంద్రశేఖర్ రియాక్ట్
సచిన్ టెండూల్కర్ పోస్ట్‌ను ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ సహాయ మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ కూడా షేర్ చేశారు. AI ద్వారా రూపొందించిన డీప్‌ఫేక్‌లు, తప్పుడు సమాచారం పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఇలాంటివి భారతీయ వినియోగదారుల భద్రత,నమ్మకానికి ముప్పు అని, యూజర్లకు హాని చేయడమే కాకుండా చట్టాలను ఉల్లంఘిస్తున్నాయని మండిపడ్డారు. అవసరమైతే కొత్త చట్టం సైతం తీసుకొస్తామని స్పష్టం చేశారు. ఏఐ, డీప్‌ఫేక్ వంటి సాంకేతికత విషయంలో ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని హామీ ఇచ్చారు. నకిలీ సమాచారం నుంచి ప్రజలకు రక్షణ కల్పిస్తామని, ప్లాట్‌ఫారమ్‌లకు అనుగుణంగా ఉండేలా ఐటి చట్టం కింద కఠినమైన నిబంధనలను త్వరలో తీసుకొస్తామని స్పష్టం చేశారు. గతేడాది నవంబరులో డీప్‌ఫేక్‌లపై సోషల్ మీడియా సంస్థలకు నోటీసులు జారీ చేసిన విషయం తెలిసిందే.
గతేడాది ప్రభుత్వం అన్ని ప్లాట్‌ఫారమ్‌లను IT నిబంధనలను పాటించాలని ఆదేశించింది. నిషేధించబడిన కంటెంట్ గురించి వినియోగదారులకు స్పష్టమైన, ఖచ్చితమైన నిబంధనలను తెలియజేయాలని కంపెనీలను ఆదేశించింది. డీప్‌ఫేక్‌లపై నిర్ణయాత్మకంగా వ్యవహరించాలని, IT నియమాలు, ప్రస్తుత చట్టాల ప్రకారం వాటి ఉపయోగ నిబంధనలు, కమ్యూనిటీ మార్గదర్శకాలను రూపొందించాలని కేంద్రం ప్లాట్‌ఫారమ్‌లను కోరింది. ఏదైనా సమ్మతి విఫలమైతే కఠినంగా వ్యవహరిస్తామని ప్రభుత్వం స్పష్టం చేసింది.