సిమెంట్ స్తంభాన్ని ఢీకొట్టిన Rajdhani Express.. ఆ కోణంలో అనుమానాలు వ్యక్తం చేస్తున్న పోలీసులు

By Sumanth KanukulaFirst Published Jan 15, 2022, 11:44 AM IST
Highlights

గుజరాత్‌లో రాజధాని ఎక్స్‌ప్రెస్‌కు పెను ప్రమాదం తప్పింది. ముంబై నుంచి ఢిల్లీ బయలుదేరిన రాజధాని ఎక్స్‌ప్రెస్.. గుజరాత్‌తోని వల్సాద్ సమీపంలో రైల్వే ట్రాక్‌ పై పడి ఉన్న సిమెంట్ స్తంభాన్ని ఢీకొట్టింది. రైలు పట్టాలు తప్పించేందుకు దుండగులు ప్రయత్నించినట్టుగా కనిపిస్తుందని పోలీసులు అనుమానిస్తున్నారు.

గుజరాత్‌లో రాజధాని ఎక్స్‌ప్రెస్‌కు పెను ప్రమాదం తప్పింది. ముంబై నుంచి ఢిల్లీ బయలుదేరిన రాజధాని ఎక్స్‌ప్రెస్.. గుజరాత్‌తోని వల్సాద్ సమీపంలో రైల్వే ట్రాక్‌ పై పడి ఉన్న సిమెంట్ స్తంభాన్ని ఢీకొట్టింది. ఈ ఘటనలో ఎవరికి గాయాలు కాలేదని పోలీసులు తెలిపారు. శుక్రవారం సాయంత్రం ముంబై నుంచి బయలుదేరిన రైలును పట్టాలు తప్పించే ప్రయత్నంలో భాగంగానే కొందరు దుండగులు.. సిమెంట్ స్తంభాన్ని రైల్వే ట్రాక్‌పై ఉంచినట్టుగా పోలీసులు భావిస్తున్నారు. అయితే అదృష్టవశాత్తు ఎలాంటి హాని జరగకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. 

ఇందుకు సంబంధించి సమాచారం అందుకున్న పోలీసులు, రైల్వే ఉన్నతాధికారులు ఘటన స్థలానికి చేరుకుని పరిశీలించారు. శుక్రవారం రాత్రి 7.10 గంటల ప్రాంతంలో జరిగిన ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. 

‘ముంబై-హజ్రత్ నిజాముద్దీన్ August Kranti Rajdhani Express రైలు వల్సాద్ సమీపంలో ఉన్న అతుల్ స్టేషన్‌కు సమీపంలో రైల్వే ట్రాక్‌పై ఉంచిన సిమెంట్ స్తంభాన్ని ఢీకొట్టింది. రైలు ఢీకొనడంతో పిల్లర్ విరిగి ట్రాక్‌ పక్కకు నెట్టబడింది. ఈ సంఘటన రైలుపై ఎటువంటి ప్రభావం చూపలేదు. రైలు ముందుకు వెళ్లిపోయింది. ప్రయాణీకులెవరూ గాయపడలేదు. లోకో పైలట్ వెంటనే దాని గురించి అతుల్ రైల్వే స్టేషన్ సిబ్బందికి సమాచారం అందించాడు’ అని వల్సాద్ రూరల్ పోలీస్ స్టేషన్ అధికారి తెలిపారు.

‘కొందరు దుర్మార్గులు సిమెంట్ స్తంభాన్ని ట్రాక్‌పై ఉంచారు. రైలు స్తంభాన్ని ఢీకొట్టింది.. ఆ తర్వాత లోకో పైలట్ వెంటనే స్థానిక స్టేషన్ మాస్టర్‌కు సమాచారం అందించారు’ అని సూరత్ పోలీస్ అధికారి రాజ్‌కుమార్ పాండియన్ విలేకరులతో అన్నారు. రైలు పట్టాలు తప్పించేందుకు దుండగులు ప్రయత్నించినట్టుగా కనిపిస్తుందని, విచారణ కొనసాగుతుందని తెలిపారు. ఇక, దుండగులకు పట్టుకోవడానికి ప్రయత్నాలు జరుగుతున్నట్టుగా పోలీసులు తెలిపారు. 

click me!