
జైపూర్: రాజస్థాన్ సీఎం ఆశోక్ గెహ్లాట్ పాత బడ్జెట్ ను చదివారు. దాదాపు ఏడు నిమిషాల పాటు పాత బడ్జెట్ ప్రతులను సీఎం చదివారు. అయితే ఈ విషయాన్ని గుర్తించిన చీఫ్ విప్ సీఎం దృష్టికి తీసుకెళ్లారు. వెంటనే సీఎం గెహ్లాట్ తన ప్రసంగాన్ని నిలిపివేశారు. సీఎం తీరుపై విపక్షాలు మండిపడ్డాయి. అసెంబ్లీ వెల్ లోకి వచ్చి విపక్షాలు ఆందోళన నిర్వహించాయి. దీంతో గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. ఈ కారణంగా శాసనసభను అరగంటపాటు వాయిదా వేశారు స్పీకర్,
రాజస్థాన్ సీఎం ఆశోక్ గెహ్లట్ పై మాజీ సీఎం వసుంధరరాజే తీవ్రంగా మండిపడ్డారు. తాను సీఎంగా ఉన్న సమయంలో బడ్జెట్ ను పదేపదే పరిశీలించిన తర్వాతే చదివేవారమన్నారు. పాత బడ్జెట్ ను చదివే సీఎం చేతిలో రాష్ట్రం ఉందని వసుంధర రాజే విమర్శలు గుప్పించారు.
ఈ బడ్జెట్ సమర్పించడం సాధ్యం కాదని బీజేపీ నేత గులాబ్ చంద్ కటారియా అసెంబ్లీలో చెప్పారు. ఇది లీక్ అయిందా అని ఆయన ప్రశ్నించారు. స్పీకర్ అసెంబ్లీని వాయిదా వేసినా కూడా వెల్ లోనే ఎమ్మెల్యేలు బైఠాయించి నిరసనకు దిగారు.
సభ ప్రారంభమైన తర్వాత విపక్షాల విమర్శలకు సీఎం ఆశోక్ గెహ్లట్ సమాధానమిచ్చారు. తన బడ్జెట్ కాపీలో పొరపాటున పాత బడ్జెట్ కాపీకి సంబంధించి పేజీ ఉందన్నారు. బడ్జెట్ ప్రతులు సభళో సభ్యులకు అందించిన విషయాన్ని సీఎం గుర్తు చేశారు. బడ్జెట్ ఎలా లీకైందని ఆయన ప్రశ్నించారు. పాత బడ్జెట్ చదివి విన్పించినందుకు సభకు సీఎం ఆశోక్ గెహ్లట్ క్షమాపణలు చెప్పారు. పొరపాటున ఇది జరిగిందని ఆయన చెప్పారు.
ఈ ఏడాది చివర్లో రాజస్థాన్ అసెంబ్లీకి ఎన్నికలు జరగనున్నాయి. గెహ్టట్ ప్రభుత్వానికి ఈ టర్మ్ లో ఇదే చివరి బడ్జెట్. రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రైవేట్ కాలేజీల్లో బడ్జెట్ ను ఇవాళ తొలిసారిగా ప్రత్యక్ష ప్రసారం చేశారు. .