బెంగళూరును వీడని వాన.. తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న ప్రజలు.. నేడు నగరానికి నీటి సరఫరా పునరుద్ధరణ!

Published : Sep 07, 2022, 10:14 AM IST
బెంగళూరును వీడని వాన.. తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న ప్రజలు.. నేడు నగరానికి నీటి సరఫరా పునరుద్ధరణ!

సారాంశం

బెంగళూరును వర్షాలు వీడటం లేదు. నగరంలోని చాలా ప్రాంతాలు ఇంకా జలదిగ్భంధంలోనే ఉన్నాయి. ఇదిలా ఉంటే.. మహదేవపుర, తూర్పు జోన్లలో తాజాగా కురిసిన వర్షం పరిస్థితిని మరింత అధ్వాన్నంగా మార్చింది.

బెంగళూరును వర్షాలు వీడటం లేదు. నగరంలోని చాలా ప్రాంతాలు ఇంకా జలదిగ్భంధంలోనే ఉన్నాయి. ఇదిలా ఉంటే.. మహదేవపుర, తూర్పు జోన్లలో తాజాగా కురిసిన వర్షం పరిస్థితిని మరింత అధ్వాన్నంగా మార్చింది. చాలా చోట్ల రోడ్లపై వరదనీరు నిలిచే ఉంది. దీంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పలు ప్రాంతాలకు తాగునీరు, విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో జనాలు అవస్థలు పడుతున్నారు. భారీ వర్షాల నేపథ్యంలో సహాయక చర్యల కోసం ప్రభుత్వం రూ. 300 కోట్లను విడుదల చేసింది. 

సోమవారం రాత్రి వైట్‌ఫీల్డ్ మెయిన్ రోడ్డుపై వరద నీటిలో స్కూటర్‌పై ప్రయాణిస్తున్న 23 ఏళ్ల యువతి కరెంట్ షాక్‌తో మరణించింది. దీంతో నగరంలో వర్ష బీభత్సం కారణంగా  మృతిచెందిన వారి సంఖ్య రెండుకు చేరింది. నగరంలో పరిస్థితులు చక్కబడేందుకు మరికొన్ని రోజుల సమయం పట్టే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు.  

అయితే ఇలాంటి పరిస్థితుల్లో.. బెంగళూరువాసులకు భారీ ఊరట లభించింది. మాండ్య జిల్లాలో వరద ముప్పుకు గురైన పంప్ హౌస్ నుంచి నగరానికి కావేరీ నీటి సరఫరా బుధవారం ఉదయం నాటికి పునరుద్ధరించబడుతుందని కర్ణాటక సీఎం బసవరాజ్ బొమ్మై మంగళవారం చెప్పారు.

వరద బాధితుల తరలింపు చర్యల్లో డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్(ఎస్‌డీఆర్ఎఫ్), నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ (ఎన్‌డీఆర్ఎఫ్) బృందాలు పాల్గొంటున్నాయి. మంగళవారం సాయంత్రం నాటికి.. ఎన్‌డీఆర్ఎఫ్, ఎస్‌డీఆర్ఎఫ్ బృందాలు వరద ప్రభావిత ప్రాంతాల నుండి 5,000 మందిని రక్షించాయి. లేఅవుట్‌లు, టెక్ కారిడార్‌లలో చిక్కుకున్న నివాసితులు ఇందులో ఉన్నారు. వరద నీటిలో చిక్కుకున్న పెంపుడు జంతువుల, వీధి కుక్కలను కూడా వీరు రక్షించారు. ఈ సహాయక చర్యల్లో ఎస్‌డీఆర్ఎఫ్ 518 సిబ్బందిని, 29 పడవలను మోహరించింది. మద్రాస్ సాపర్స్‌కు వరద సహాయక టాస్క్ ఫోర్స్ కూడా యెమలూరు రోడ్డులో తరలింపు ప్రక్రియ  చేపట్టింది. 

భారీ వర్షాలు, వరదల కారణంగా కారణంగా బెంగళూరు ఈస్ట్ జోన్‌లోని ప్రాథమిక, ఉన్నత పాఠశాలలకు ఈ రోజు (సెప్టెంబర్ 7) కూడా అధికారులు సెలవు ప్రకటించారు. ఇప్పటికి  చాలా అపార్ట్‌మెంట్స్‌లోని సెలార్లు, పార్కింగ్ ప్రదేశాలలో వర్షపు నీరు నిలిచి ఉంది. ఉద్యోగాలకు వెళ్లేవారు ట్రాక్టర్లలో రాకపోకలు సాగిస్తున్న దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. 

ఇదిలా ఉంటే.. బుధవారం బెంగళూరు అర్బన్‌, రూరల్‌ జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ నిపుణులు అంచనా వేస్తున్నారు. ఈ నెల 9వ తేదీ వరకు ఇలాంటి వాతావరణ పరిస్థితులే కొనసాగే అవకాశం ఉందని చెబుతున్నారు. 
 

PREV
click me!

Recommended Stories

Viral News: ఈ గ్రామంలో మ‌హిళ‌లు 5 రోజులు న‌గ్నంగా ఉంటారు.. వింత ఆచారం ఎక్క‌డంటే
Census 2027: 30 లక్షల మంది సిబ్బంది, రూ. 11,718 కోట్లు.. ప్రపంచంలోనే అతిపెద్ద ఫీల్డ్ ఆపరేషన్‌గా జ‌న‌గ‌ణ‌న‌