
ప్రభుత్వ ఉద్యోగాలకు (Government Jobs) సంబంధించి కేంద్రం కీలక ప్రకటన చేసింది. railway jobని ఆశించేవారు.. చట్టవిరుద్ధమైన కార్యకలాపాలకు పాల్పడినట్లు గుర్తిస్తే వారు సంస్థలో ఉద్యోగానికి అనర్హులని రైల్వే మంత్రిత్వ శాఖ వెల్లడించింది. చట్ట వ్యతిరేకంగా రైళ్లు అడ్డుకున్నా, ట్రైన్ ఆపరేషన్లకు విఘాతం కలిగించినా, సంస్థల ఆస్తుల ధ్వంసం చేసినా వారిని అనర్హులుగా ప్రకటించనున్నట్టుగా చెప్పింది. అటువంటి వారు రైల్వే ఉద్యోగం పొందకుండా జీవితకాల నిషేధాన్ని ఎదుర్కోవలసి ఉంటుందని పేర్కొంది.
“రైల్వే ఉద్యోగాలను ఆశించేవారు రైల్వే ట్రాక్‌లపై నిరసనలు చేయడం, రైలు కార్యకలాపాలకు అంతరాయం కలిగించడం, రైల్వే ఆస్తులను దెబ్బతీయడం వంటి విధ్వంసం/చట్టవిరుద్ధమైన కార్యకలాపాలకు పాల్పడినట్లు దృష్టికి వచ్చింది” అని రైల్వే మంత్రిత్వ శాఖ (Ministry of Railways) మంగళవారం విడుదల చేసిన ఒక పబ్లిక్ నోటీసులో పేర్కొంది. ఇటువంటి తప్పుదారి పట్టించే కార్యకలాపాలు అత్యున్నత స్థాయి క్రమశిక్షణా రాహిత్యమని, అలాంటి అభ్యర్థులను రైల్వే/ప్రభుత్వ ఉద్యోగాలకు అనర్హులుగా మారుస్తుందని తెలిపింది.
‘అటువంటి కార్యకలాపాల వీడియోలు ప్రత్యేక ఏజెన్సీల సహాయంతో పరిశీలించబడతాయి.. చట్టవిరుద్ధమైన కార్యకలాపాలకు పాల్పడిన అభ్యర్థులు/ఆశావాదులపై పోలీసు చర్యతో పాటు రైల్వే ఉద్యోగం పొందకుండా జీవితకాలం నిషేధించబడుతుంది’ అని తెలిపింది.
రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డులు (RRB) అత్యున్నత ప్రమాణాల సమగ్రతను కాపాడుతూ న్యాయమైన, పారదర్శకమైన నియామక ప్రక్రియను నిర్వహించడానికి కట్టుబడి ఉన్నాయని పేర్కొంది.
సోమవారం ఆర్‌ఆర్‌బీ నిర్వహించిన పరీక్ష ఫలితాల్లో తేడాలున్నాయని ఆరోపిస్తూ బీహార్‌లో వేలాది మంది ఆందోళనకారులు రైల్వే ట్రాక్‌లపై ఆందోళనకు దిగారు. ఇటీవల వెలువడిన ఆర్‌ఆర్‌బీ NTPC CBT 1 ఫలితాలపై పెద్ద సంఖ్యలో అభ్యర్థులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఫలితాలలో అవకతవకలు జరిగాయని ఆరోపించారు. ఒకే అభ్యర్థిని పలు పోస్టులకు ఎంపిక చేశారని వారు చెబుతున్నారు. తమకు న్యాయం చేయాలని కోరుతూ బిహార్‌లోని పలు నగరాల్లో అభ్యర్థులు.. రైల్వే ట్రాక్‌లపై ఆందోళనకు దిగారు. దీంతో దాదాపు 5 గంటల పాటు రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. మరోవైపు.. రైల్వే బోర్డు మాత్రం నిబంధనల ప్రకారమే అభ్యర్థుల ఎంపిక జరిగినట్టు చెబుతోంది. ఈ క్రమంలోనే రైల్వే శాఖ నుంచి ఈ విధమైన ప్రకటన వెలువడినట్టుగా తెలుస్తోంది.