
అహ్మదాబాద్: 2019 పరువునష్టం కేసులో రాహుల్ గాంధీని దోషిగా తేల్చి రెండేళ్ల జైలు శిక్షను సూరత్ కోర్టు నిన్న విధించింది. ఈ తీర్పుతో ఈ రోజు రాహుల్ గాంధీ ఎంపీ పోస్టునూ కోల్పోయాడు. ఈ కోర్టు రాహుల్ గాంధీని దోషిగా తేల్చడానికి ముందు కొన్ని నాటకీయ పరిణామాలు జరిగినట్టు తెలుస్తున్నది. లాయర్లు, కాంగ్రెస్ సీనియర్ నేతలు రాహుల్ గాంధీని క్షమాపణలు చెప్పి కేసు నుంచి తప్పుకోవాలని సూచించారు. ఈ కేసు ద్వారా పార్లమెంటు నుంచే తప్పించాలని చూస్తున్నట్టూ రాహుల్ గాంధీకి వారు వివరించి చెప్పారు. పార్లమెంటులో తాను ఉండటం కచ్చితంగా అవసరం అని కాంగ్రెస్ సీనియర్ నేతలు ఆయనకు తెలిపారు. కాబట్టి, క్షమాపణలు చెబితే ఈ సమస్య ఉండదని వివరించారు. కానీ, రాహుల్ గాంధీ మాత్రం అందుకు అంగీకరించలేదు. లాయర్లు, సీనియర్ నేతలు ఎన్ని సలహాలు చెప్పినా రాహుల్ గాంధీ వినిపించుకోలేదు. ఈ విషయాన్ని సూరత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్, డిఫమేషన్ కేసులో రాహుల్ గాంధీకి బెయిల్ గ్యారంటీర్‌గా ఉన్న కాంగ్రెస్ నేత హస్ముక్ దేశాయ్ వివరించారు.
తాను క్షమాపణలు చెప్పేది లేదని రాహుల్ గాంధీ తెగేసి చెప్పినట్టు ఆయన తెలిపారు. తాను ఏ తప్పూ చేయలేదని, కాబట్టి, కోర్టు విధించే ఓ శిక్షకైనా తాను సిద్ధమని చెప్పినట్టు పేర్కొన్నారు.
Also Read: రాహుల్ గాంధీ ముందున్న దారులేమిటీ? 8 ఏళ్లు ఎన్నికలకు దూరమేనా? కోర్టులో పిటిషన్ వేస్తారా?
ఎయిర్‌పోర్టు నుంచి సూరత్ కోర్టుకు వెళ్లుతుండగా లాయర్లు, సీనియర్ నేతలు రాహుల్ గాంధీని క్షమాపణలు చెప్పాలని కన్విన్స్ చేసే ప్రయత్నం చేశారని ఆయన వివరించారు. ఇది సీరియస్ క్రైమ్ కేసు కాదని, కాబట్టి, క్షమాపణలు చెబితే క్షమించి శిక్షను మాఫీ చేసే అవకాశం ఉంటుందని రాహుల్‌కు సర్ది చెప్పే ప్రయత్నం చేశారని పేర్కొన్నారు. కానీ, రాహుల్ గాంధీ స్పష్టంగా తాను క్షమాపణలు చెప్పేది లేదని తెలిపారని వివరించారు.
కోర్టుకు వచ్చిన తర్వాత కొందరు పార్టీ సీనియర్ నేతలు అతనితో మాట్లాడారని, ఆయనను డిఫేమ్ చేయడానికి ప్రభుత్వ యంత్రాంగమే ఇన్వాల్వ్ అయి ఉన్నదని చెప్పారని, వారే ఎంపీ పోస్టునూ తొలగించే ప్రయత్నం చేస్తున్నారని రాహుల్‌కు చెప్పారు. పార్లమెంటులో రాహుల్ గాంధీ ఉండటం అవసరం అని తెలిపినా.. ఆయన మాత్రం తన వైఖరిని మార్చుకోలేదని హస్ముక్ దేశాయ్ వివరించారు.