
న్యూఢిల్లీ: ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి విమర్శకుల నుంచీ శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. ప్రతి రోజూ విమర్శలు చేసే కాంగ్రెస్ మాజీ అధ్యక్షులు రాహుల్ గాంధీ, ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్‌లూ ట్వీట్ చేసి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. నేడు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పుట్టిన రోజు.
దాదాపు ప్రతి రోజూ నరేంద్ర మోడీ ప్రభుత్వాన్ని రాహుల్ గాంధీ విమర్శిస్తారు. నేడు రాహుల్ గాంధీ.. ప్రధానమంత్రి మోడీకి ‘హ్యాపీ బర్త్ డే మోడీ జీ’ అని ట్వీట్ చేశారు. అలాగే, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ కూడా శుభాకాంక్షలు తెలిపారు. ‘గౌరవనీయులైన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ జీకి జన్మదిన శుభాకాంక్షలు. మీరు సుదీర్ఘకాలం జీవించి సుఖసంతోషాలతో వర్ధిల్లాలని కోరుకుంటున్నా’ అని ట్వీట్ చేశారు.
మోడీ జన్మదినాన్ని పురస్కరించుకుని బీజేపీ మూడువారాల ఉత్సవాలు నిర్వహిస్తున్నది. ఇందులో భాగంగా మోడీకి పోస్ట్‌కార్డులు పంపండం, వ్యాక్సినేషన్ డ్రైవ్‌లు, స్వచ్ఛత కార్యక్రమాలు చేపడుతున్నారు. 2001లో ఆయన గుజరాత్ సీఎంగా ప్రమాణం తీసుకున్న రోజు వరకు అంటే అక్టోబర్ 7వ తేదీ వరకు ఈ సంబురాలు జరుగుతాయి.
ఈ వేడుకలను బీజేపీ సేవా సమర్పణ్ అభియాన్ పేరుతో జరుపుతుండగా కాంగ్రెస్ జాతీయ నిరుద్యోగ దినోత్సవం పేరిట ట్వీట్లు చేస్తున్నది.