
Rahul Gandhi: భారతదేశంలో కొనసాగుతున్న విద్యుత్ సంక్షోభంపై కాంగ్రెస్ మాజీ చీఫ్ రాహుల్ గాంధీ స్పందించారు. మోడీ ప్రభుత్వం ద్వేషపూరిత బుల్డోజర్లను నడపడం మానేసి, బదులుగా విద్యుత్ ప్లాంట్లను నడపడం ప్రారంభించాలని చురకలు అంటించారు. మోడీ సర్కార్ దేశంలో బొగ్గు, విద్యుత్ సంక్షోభం సృష్టించిదనీ, కేంద్రం ప్రజల గురించి పట్టించుకుంటుందా ? లేదా? అని విమర్శించారు.
ద్వేషం అనే బుల్‌డోజర్‌ను నడపడం మానేసి, దేశంలో పవర్ ప్లాంట్లు ప్రారంభించాలని మోడీ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ రోజు బొగ్గు ,విద్యుత్ సంక్షోభం మొత్తం దేశంలో విధ్వంసం సృష్టించిందని ఆరోపించారు.
మరోసారి మళ్ళీ చెబుతున్నాను - ఈ సంక్షోభం చిన్న పరిశ్రమలను నాశనం చేస్తుంది, దీని వల్ల నిరుద్యోగం మరింత పెరుగుతుంది. రైలు, మెట్రోలను ఆపడం వల్ల ఆర్థిక నష్టం జరుగుతుందని విమర్శించారు. ‘మోదీ జీ, మీకు దేశం, ప్రజల గురించి పట్టింపు లేదా’ అని ప్రశ్నిస్తూ.. ‘#BJPFailsIndia’ అనే హ్యాష్‌ట్యాగ్‌ని వాడారు రాహుల్ గాంధీ.
దేశవ్యాప్తంగా ఉన్న విద్యుత్ ప్లాంట్లకు బొగ్గు పంపిణీకి మోదీ ప్రభుత్వం లాజిస్టికల్ మద్దతు అందించడం లేదని, ఇది సంక్షోభానికి దారితీసిందని కాంగ్రెస్ అధికార ప్రతినిధి గౌరవ్ వల్లభ్ ఆరోపించారు. మోడీ ప్రభుత్వం తన బాధ్యత నుండి పారిపోయి దేశంలోని అన్ని సమస్యలకు రాష్ట్రాలను నిందించజాలదని ఆయన అన్నారు.