రాజస్థాన్‌లో భారత్ జోడో యాత్ర.. ధాబాలో టీ తాగుతూ.. పిల్లలతో కబుర్లు చెప్పిన రాహుల్ గాంధీ...

By SumaBala BukkaFirst Published Dec 5, 2022, 1:25 PM IST
Highlights

ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్, మాజీ డిప్యూటీ సచిన్ పైలట్ లు రాజస్థాన్ లో ప్రారంభమైన రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్రలో పాల్గొన్నారు. భారత్ జోడో యాత్ర సోమవారం ఉదయం ఝలావర్ జిల్లా నుండి ప్రారంభమయ్యింది.

ఝలావర్ : కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ  భారత్ జోడో యాత్ర రాజస్థాన్ లోకి ప్రవేశించింది. సోమవారం ఉదయం రాజస్థాన్ లోని ఝలావర్ జిల్లా నుండి ఆయన యాత్ర ప్రారంభించారు. ఈ యాత్రలో రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్, మాజీ డిప్యూటీ సచిన్ పైలట్ రాహుల్ తో పాటు పాల్గొన్నారు. గత 88 రోజులుగా రాహుల్ గాంధీ పాదయాత్ర చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ యాత్రలో 89వ రోజు యాత్ర రాజస్థాన్-మధ్యప్రదేశ్ సరిహద్దులోని ఝల్రాపటాన్‌లోని కాలి తలై నుండి ప్రారంభమైంది.

ఉదయం 6.10 గంటల సమయంలో ఈ యాత్ర ప్రారంభమయ్యింది. దేశంలో రోజురోజుకూ చలి తీవ్రత పెరుగుతోంది. ఈ రోజు ఉదయం ఉష్ణోగ్రత 13 డిగ్రీల సెల్సియస్‌గా ఉంది. చలిని కూడా లెక్క చేయకుండా రాహుల్ యాత్రను కొనసాగించారు. ఇంత చలిలోనూ రాహుల్ హాఫ్ స్లీవ్స్ టీ-షర్టు, ప్యాంటుతో స్పోర్ట్స్ షూస్‌తో ఉత్సాహంగా నడక సాగిస్తూ కనిపించారు. రాహుల్ తో పాటు యాత్రలో పాల్గొన్న ఇతర నాయకులు,  పార్టీ కార్యకర్తలు మాత్రం చలికోట్లు వేసుకుని కనిపించారు.

రాహుల్ గాంధీ వెంట ఈ యాత్రలో ఇతర ప్రముఖ నాయకులు ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్, రాజస్థాన్ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ చీఫ్ గోవింద్ సింగ్ దోతస్రా, సీనియర్ నాయకుడు భన్వర్ జితేంద్ర సింగ్ , ఆహార  పౌర సరఫరాల మంత్రి ప్రతాప్ సింగ్ ఖచరియావాస్ ఉన్నారు. యాత్రలో భాగంగా నడుస్తూ.. రాహుల్ గాంధీ అర డజను మంది పిల్లలతో సంభాషించారు. తనతో పాటు యాత్రలో పాల్గొన్నవారిని ఉద్దేశించి జాతరలా ఉంది అంటూ హర్షం వ్యక్తం చేశారు. ఒక చోట యాత్రను ఆపి అక్కడి దాబాలో ఉదయం టీ తాగారు.

యాత్రలో మాజీ ఎంపీ రఘువీర్ మీనాకు అసౌకర్యం కలగడంతో అంబులెన్స్‌లో ఝలావర్‌లోని జిల్లా ఆస్పత్రికి తరలించారు. దాదాపు 14 కిలోమీటర్ల మేర పాదయాత్ర బలిబోర్డా చౌరహా వద్ద నిలిచిపోయింది. మధ్యాహ్నం 3.30 గంటలకు నహర్డి ప్రాంతం నుండి భోజనం చేసిన తరువాత తిరిగి ప్రారంభమవుతుంది. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, మద్దతుదారులను ఉద్దేశిస్తూ.. యాత్రలో ఉత్సాహంగా పాల్గొనాలని.. ‘ఊహించని అద్భుతాన్ని’ చేసి చూపించాలని హిందీలో ట్వీట్ చేసింది.

ఆర్టీసీ బస్సులో పండంటి బిడ్డకు జన్మనిచ్చిన మహిళ.. ఉత్తరప్రదేశ్ లో ఘటన..

'భారత్ జోడో యాత్ర రాజస్థాన్ నేలకు సెల్యూట్ చేసింది, చరిత్రను తిరగరాసే నేల అయిన రాజస్థాన్ మరో చరిత్రను సృష్టిస్తుంది' అని పార్టీ ట్వీట్ చేసింది. గెహ్లాట్ ట్విట్టర్‌లో యాత్రకు సంబంధించిన ఫోటోలను షేర్ చేశారు. సచిన్ పైలట్ మైక్రో బ్లాగింగ్ ప్లాట్‌ఫారమ్‌ లో రాష్ట్రంలోని యువత ఆశలను, అంచనాలను అందుకునేలా యాత్ర ప్రారంభమైందని తెలిపారు.

దేశం మొత్తాన్ని ప్రేమ, సామరస్యం, ఐక్యత అనే దారంతో ముడిపెట్టేందుకు రాహుల్ గాంధీ తలపెట్టిన భారత్ జోడో యాత్ర ఇప్పుడు రాజస్థాన్‌లో చరిత్ర సృష్టించేందుకు బయలుదేరింది’’ అని దోటసారా ట్వీట్ చేశారు. డిసెంబర్ 21న హర్యానాలో ప్రవేశించడానికి ముందు 17 రోజుల పాటు ఝలావర్, కోటా, బుండి, సవాయి మాధోపూర్, దౌసా, అల్వార్ జిల్లాల మీదుగా దాదాపు 500 కిలోమీటర్ల మేర యాత్ర ప్రవేశించిన ఏకైక కాంగ్రెస్ పాలిత రాష్ట్రం రాజస్థాన్.

డిసెంబర్ 15న దౌసాలోని లాల్‌సోట్‌లో రైతులతో గాంధీ ఇంటరాక్ట్ అవుతారు. డిసెంబర్ 19న అల్వార్‌లోని మలాఖేడాలో బహిరంగ సభలో ప్రసంగిస్తారు. సెప్టెంబరు 7న తమిళనాడులోని కన్యాకుమారి నుంచి ప్రారంభమైన యాత్ర ఇప్పటివరకు ఐదు దక్షిణాది రాష్ట్రాలైన తమిళనాడు, కేరళ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తెలంగాణలను కవర్ చేసి, ఆపై మహారాష్ట్ర, మధ్యప్రదేశ్ మీదుగా ప్రయాణించింది. 150 రోజుల్లో 3,570 కి.మీ.లను కవర్ చేసి ఫిబ్రవరి 2023  మొదట్లో జమ్మూ కాశ్మీర్‌లో ముగుస్తుంది.

click me!