భారత ప్రజాస్వామ్యం పనిచేస్తుంటే.. నేను పార్లమెంట్‌లో మాట్లాడగలను: బీజేపీపై రాహుల్ గాంధీ ఫైర్..

By Sumanth KanukulaFirst Published Mar 16, 2023, 4:28 PM IST
Highlights

అదానీ గ్రూప్ గురించి తన చివరి పార్లమెంట్ ప్రసంగంలో అడిగిన ప్రశ్నలకు ప్రధాని మోదీ ఇంకా సమాధానం ఇవ్వలేదని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ అన్నారు. 

అదానీ గ్రూప్ గురించి తన చివరి పార్లమెంట్ ప్రసంగంలో అడిగిన ప్రశ్నలకు ప్రధాని మోదీ ఇంకా సమాధానం ఇవ్వలేదని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ అన్నారు. రాహుల్ ఈరోజు మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ.. లోక్‌సభలో తాను మాట్లాడాలనుకుంటున్నానని స్పీకర్‌కు చెప్పానని రాహుల్ తెలిపారు. నలుగురు మంత్రులు తనపై ఆరోపణలు చేశారని.. వాటికి సమాధానం చెప్పే హక్కు తనకు ఉందని అన్నారు. అయితే ఈరోజు నేను వచ్చిన తర్వాతే సభ వాయిదా పడిందని అన్నారు. రేపు పార్లమెంట్‌లో మాట్లాడేందుకు అనుమతిస్తారని ఆశిస్తున్నానని చెప్పారు. ఎంపీగా పార్లమెంటులో సమాధానం చెప్పడం తన ముందున్న బాధ్యత అని పేర్కొన్నారు. ఆ తర్వాతే మీడియా ముందు వివరణ ఇవ్వగలనని చెప్పారు. 

అదానీ సమస్యతో ప్రభుత్వం, ప్రధానమంత్రి భయపడుతున్నారని విమర్శించారు. అందుకే వారు ఈ ‘‘తమాషా’’ని సిద్ధం చేశారని ఆరోపించారు. పార్లమెంట్‌లో మాట్లాడేందుకు తనను అనుమతించరని భావిస్తున్నానని చెప్పారు. ‘‘మోదీజీ, అదానీజీల మధ్య సంబంధం ఏమిటన్నది ప్రధాన ప్రశ్న’’ అని రాహుల్ గాంధీ పేర్కొన్నారు. 

పార్లమెంటులో ఆరోపణలు చేసినందున.. మాట్లాడే అవకాశం కల్పించడం తనకు ప్రజాస్వామ్య హక్కు అని రాహుల్ గాంధీ అన్నారు. భారత ప్రజాస్వామ్యం పనిచేస్తుంటే తాను పార్లమెంటులో మాట్లాడగలనని అన్నారు. నిజానికి మీరు చూస్తున్నది భారత ప్రజాస్వామ్యానికి పరీక్ష అని రాహుల్ గాంధీ పేర్కొన్నారు. 

భారత్‌లో ప్రజాస్వామ్యం దాడికి గురవుతోందంటూ కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ తన లండన్ పర్యటనలో చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్న సంగతి  తెలిసిందే. ఇందుకు సంబంధించి రాహుల్ క్షమాపణలు చెప్పాలని బీజేపీ డిమాండ్ చేస్తోంది. పార్లమెంట్ సమావేశాల వేళ కూడా పలువురు కేంద్ర మంత్రులు మాట్లాడుతూ.. రాహుల్ గాంధీ క్షమాపణ  చెప్పాలని డిమాండ్ చేశారు. అయితే లండన్‌ నుంచి తిరిగివచ్చిన తర్వాత రాహుల్ గాంధీ నేడు పార్లమెంట్‌‌కు వచ్చారు. అనంతరం రాహుల్ మీడియాతో మాట్లాడుతూ ఈ కామెంట్స్ చేశారు.

click me!