చైనా యుద్ధానికి ప్రిపేర్ అవుతున్నది.. మన ప్రభుత్వం పట్టించుకోవట్లేదు: రాహుల్ గాంధీ

By Mahesh KFirst Published Dec 16, 2022, 6:56 PM IST
Highlights

‘చైనా మన దేశంపై యుద్ధానికి సిద్ధం అవుతున్నది. దాని వెపన్ ప్యాటర్న్ చూస్తే ఇది అర్థం అవుతుంది. కానీ, మన దేశ ప్రభుత్వం ఈ వాస్తవ పరిస్థితిని అంగీకరించట్లేదు. గంభీరమైన ఈ పరిస్థితులను పట్టించుకోవడం లేదు’ అని రాహుల్ గాంధీ అన్నారు.
 

న్యూఢిల్లీ: కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ శుక్రవారం కేంద్ర ప్రభుత్వంపై విమర్శలు సంధించారు. చైనా నుంచి పొంచి ఉన్న ముప్పును కేంద్రప్రభుత్వం తక్కువ చేసి చూపుతున్నదని వివరించారు. ఒక వైపు పొరుగునే ఉన్న డ్రాగన్ కంట్రీ యుద్ధానికి సిద్ధం అవుతుంటే.. మన ప్రభుత్వం మాత్రం ఆ వాస్తవాన్ని అంగీకరించట్లేదని మండిపడ్డారు. అరుణాచల్ ప్రదేశ్‌లోని తవాంగ్ సెక్టార్‌లో ఉభయ దేశాల సైనికుల మధ్య ఘర్షణలు చోటుచేసుకున్న నేపథ్యంలో రాహుల్ గాంధీ ఈ వ్యాఖ్యలు చేశారు.

భారత భూభాగంలోకి చొచ్చుకురావడం కాదు.. ఏకంగా యుద్ధానికే చైనా ప్రిపేర్ అవుతున్నదని ఆయన అన్నారు. వారి ఆయుధాల ప్యాటర్న్ చూస్తే మనకు ఇది అర్థం అవుతుందని తెలిపారు. వారు యుద్ధానికి సన్నద్ధం అవుతున్నారని వివరించారు. కానీ, మన ప్రభుత్వం ఈ వాస్తవాన్ని అంగీకరించట్లేదని పేర్కొన్నారు. భారత ప్రభుత్వం ఒక వ్యూహం ప్రకారం నడవట్లేదని, కేవలం ఈవెంట్లను ఆధారం చేసుకుని నడుస్తున్నదని విమర్శించారు.

Also Read: నేటి నుంచి భారత్-చైనా బార్డర్ లో వైమానిక దళ విన్యాసాలు.. సుఖోయ్, రాఫెల్ యుద్ధ విమానాలు పాల్గొనే అవకాశం..

‘చైనా మన భూభాగాలను దురాక్రమించింది. వారు మన జవాన్లపై దాడి చేస్తున్నారు. చైనా నుంచి ఉన్న ముప్పు సుస్పష్టం. కానీ, ప్రభుత్వం దాన్ని దాస్తున్నది. పట్టించుకోవట్లేదు. లడాఖ్, అరుణాచల్ ప్రదేశ్‌లలో చైనా దాడి చేయడానికి సర్వం సిద్ధం చేసుకుంటున్నది. కానీ, మన ప్రభుత్వం మాత్రం మొద్దు నిద్ర పోతున్నది’ అని రాహుల్ గాంధీ ఫైర్ అయ్యారు. రాజస్తాన్‌లోని దౌసాలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు.

అరుణాచల్ ప్రదేశ్‌ తవాంగ్ సెక్టార్‌లో సరిహద్దు యథాతథ స్థితిని మార్చడానికి చైనా ప్రయత్నించింది. చైనా సైనికుల ఈ ప్రయత్నాన్ని భారత జవాన్లు సమర్థంగా ఎదుర్కొని వారిని నిలువరించారని కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ పార్లమెంటులో వెల్లడించారు. ఈ దాడిలో ఇరువైపులా జవాన్లకు గాయాలైనట్టు తెలిసింది. 

click me!